Wednesday, May 1, 2024

ఒడిశాలో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒడిశా ఐటి దాడులు అయిదో రోజు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. జార్ఖండ్‌నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ధీరజ్ సాహుకు చెందిన లిక్కర్ కంపెనీ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా లెక్కకు రాని నగదును స్వాధీనం చేసుకున్నారు. ధీరజ్ సాహుకు చెందిన బౌధ్ డిస్టిలరీతో పాటుగా పార్టర్‌షిప్‌లో ఉన్న బల్దేవ్ సాహు గ్రూపు కంపెనీల్లో ఆదివారం కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో మరింత నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు. సాహు, ఆయన బంధువుల కంపెనీలు, కార్యాలయాలు, ఇళ్లనుంచి స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి ఐటి అధికారులు చెమటోడ్చాలి వస్తోంది.

ఇప్పటికే ఈ డబ్బును లెక్కించడానికి 40 కౌంటింగ్ మిషన్లను వినియోగిస్తుండగా, తాజాగా మరిన్ని మిషన్లను, అదనపు సిబ్బందిని స్టేట్‌బ్యాంక్‌నుంచి రప్పించారు. ఆదివారం రాత్రికల్లా నగదు లెక్కింపును పూర్తి చేయాలని ఐటి అధికారులు భావిస్తున్నారు. కాగా తమకు 176 నగదు సంచులు అందగా, వాటిలో ఇప్పటివరకు 140 నగదు సంచులను లెక్కించడం పూర్తయిందని ఎస్‌బిఐ రీజినల్ మేనేజర్ భగత్ బెహరా చెప్పారు. నగదు లెక్కింపు ప్రక్రియలో మూడు బ్యాంకులకు చెందిన 50 మంది అధికారులు నిమగ్నమై ఉన్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్ము మొత్తం రూ.150 కోట్లకు పైగానే ఉండవచ్చని అధికారులు అంటున్నారు.

సాహును వివరణ కోరాం: కాంగ్రెస్
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎంపి ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకోవడంపై ఆయననుంచి వివరణ కోరినట్లు జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి అవినాశ్ పాండే చెప్పారు. ఇది ధీరజ్ సాహుకు చెందిన ప్రైవేటు వ్యవహారమని, దీనితో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపిగా ఉన్నందున అంత పెద్ద మొత్త తనకు ఎలా వచ్చిందో ఆయనఅధికారికంగా ప్రకటన చేయాలని ఆదివారం రాంచీలోని బిర్సాల ముండా విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ పాండే చెప్పారు. ‘

దాడులు, నగదు స్వాధీనానికి సంబంధించి ఐటి శాఖ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదని, అయినా కాంగ్రెస్ పార్టీకి దీన్ని ముడిపెడుతూ ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సాహు కుటుంబం వందేళ్లుగా వ్యాపారంలో ఉందని, అది సాహు కుటుంబం ఉమ్మడి వ్యాపారమని సాహు వ్యాపారంలో కేవలం ఒక భాగస్వామి మాత్రమేనని పాండే అంటూ, అయితే అంత పెద్ద మొత్తం తనకు ఎలా వచ్చిందో ఆయన వివరణ ఇవ్వాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News