Friday, May 17, 2024

ఇంద్రవెళ్లిలో లక్ష మందితో దళిత, గిరిజన దండోరా: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కదం తొక్కుతామని, ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా దినోత్సవం నాడు ఇంద్రవల్లిలో లక్ష మందితో దళిత గిరిజన దండోరా చేద్దామని ఆ కార్యక్రమానికి ప్రేమ్‌సాగర్ రావ్ నాయకత్వం వహించాలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఎఐసిసి సభ్యులు, మాజీ ఎంఎల్‌సి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో ఆయన ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పిసిసి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రేవంత్‌రెడ్డి ప్రేమ్ సాగర్‌రావుని కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస పార్టీ సమావేశానికి రేవంత్‌రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి సమావేశం ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖతో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికార. మాజీ ఎంఎల్‌సి ప్రేమ్ సాగర్ రావ్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాల జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులను ప్రేమ్ సాగర్ రావు రేవంత్‌రెడ్డికి పరిచయం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేశారు.

మరికొంతమంది కాంగ్రెస్ కండువా కప్పి సత్కరించారు. మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ప్రేమ్‌సాగర్‌రావుకి, తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని వెల్లడించారు. ప్రేమ్ సాగర్ రావు సోదర సమానులు అని ఆయన అన్నారు. అనంతరం కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త ధైర్యంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించాలని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ సైనికులకు పార్టీ అధినాయకత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావడమే లక్షంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Revanth Reddy meets Ex MLC Prem Sagar Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News