Monday, April 29, 2024

బిఎస్‌పికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ కెసిఆర్‌తో ప్రవీణ్ సమావేశం

కెసిఆర్, బిఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తానని వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. శనివారం బిఎస్‌పి పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్‌తో నందినగర్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. బరువెక్కిన హృదయంతో బిఎస్‌పిని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రవీణ్‌కుమార్ ఎక్స్‌లో తెలిపారు. తాను ఈ సందేశాన్ని టైప్ చేయలేకపోతున్నానని పేర్కొన్నారు. కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున తాను తప్పక టైప్ చేయాల్సి వచ్చిందని, దయచేసి క్షమించాలని కోరారు. తనకు మరో మార్గం లేదు అని, కొత్త దారి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తాను అని, ఇటీవల తెలంగాణలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

స్వేరోగా తాను ఎవరినీ నిందించను అని, తనను నమ్మిన వారిని మోసం చేయను స్పష్టం చేశారు. మళ్లీ చెబుతున్నా.. చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటాను..జై భీం అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్‌లో పేర్కొన్నారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే… కష్టసుఖాలు పంచుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. ఇదే తాను నమ్మిన నిజమైన ధర్మం అని పేర్కొన్నారు. బిఎస్‌పి బిఆర్‌ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బిజెపి ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నదని అన్నారు. బిజెపి కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను అని, ఈ ప్రస్థానాన్ని ఆపలేను అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
బాధాతప్త హృదయంతో బిఎస్‌పిని వీడాను : ప్రవీణ్‌ కుమార్
బిఆర్‌ఎస్, బిఎస్‌పి పొత్తు లేకుండా బిజెపి ఒత్తిడి తీసుకొచ్చిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించరాదన్నదే తన అభిమతమని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో సమావేశం అనంతరం ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తాము లౌకిక కూటమి ఏర్పాటు చేస్తే ఒత్తిడి తీసుకొచ్చారని, గులాబీ పార్టీతో పొత్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని బిఎస్‌పి హై కమాండ్ నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని ఆదేశించారని పేర్కొన్నారు. అందుకే బాధాతప్త హృదయంతో బిఎస్‌పిని వీడినట్లు తెలిపారు. తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసమే తన నిర్ణయమని చెప్పారు. తాను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గబోనని, అందరితో చర్చించిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

భవిష్యత్‌లో కెసిఆర్, బిఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తానని చెప్పారు. మాయావతి ఆశీర్వాదంతో నల్గొండ సభలో బిఎస్‌పిలో చేరి, 4 వేల గ్రామాల్లో పర్యటనలు చేశానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్‌పి అభ్యర్థిగా తాను పోటీ చేయడమే కాకుండా 107 అభ్యర్థులను బరిలో నిలిపానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో కాకుండా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నామని, అందరితో చర్చించి బిఆర్‌ఎస్,బిఎస్‌పి పొత్తుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తమకు కెసిఆర్ రెండు సీట్లు కేటాయించారని, బిఎస్‌పి జాతీయ నాయకత్వం సైతం అంగీకరించిందని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్, బిఎస్‌పి పొత్తు నచ్చని బిజెపి బిఎస్‌పిపై ఒత్తిడి తీసుకువచ్చి పొత్తును రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి గేలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. తాను ఐపిఎస్ ఆఫీసర్‌గా దేశం కోసం పని చేశానని అన్నారు. తనకు బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మాయావతికి ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎన్నటికీ బహుజన వాదాన్ని వీడను అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, కెసిఆర్‌కు పొత్తుపై మాట ఇచ్చాను అని, అందుకే మాట తప్పను అని పేర్కొన్నారు. తన శ్రేయోభిలాషులతో చర్చలు జరిపి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కెసిఆర్‌తో చర్చించానని, రాబోయే రోజుల్లో కెసిఆర్‌తో,బిఆర్‌ఎస్ పార్టీతో కలిసి పని చేస్తానని వెల్లడించారు.

Praveen and KCR 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News