Saturday, May 4, 2024

బిసిలుగా సంచార జాతులు

- Advertisement -
- Advertisement -

Sanchara Jathulu in Backward caste

చేసే పని ఇష్టమైనది, సంతృప్తినిచ్చేదైతే లోకమందున అంతకుమించినది మరొకటి ఉండదనుకుంటా! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పని చేయటం జీవితకాలానికి మరువలేని మహద్భాగ్యం. రాష్ట్రం సాధించుకున్న తర్వాత పునర్నిర్మాణంలో పని చేసే అవకాశం లభించడం మరింత ఆనందకరమైనది. నాకు ఇష్టమైన అట్టడుగు వర్గాల కోసం, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల కోసం పని చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బాధ్యతనివ్వటం జీవితంలో మరిచిపోలేనిది. బిసి కమిషన్‌ను నియమిస్తూ అందులో నన్నొక సభ్యునిగా నియమించాక మా మూడు సంవత్సరాల అధ్యయన చదువులో అట్టడుగు పొరల్లో మూల్గుల్ని వినే అవకాశం, వాటిని రికార్డు చేసే అవకాశం లభించింది. ఇంత మంచి పనిలో నన్ను భాగస్వామిని చేసినందులకు కెసిఆర్‌కు రుణపడి ఉంటాను.
వాళ్లు నోరులేని వాళ్లు తరతరాలుగా గుండెనిండా నింపుకున్న బాధల్ని భద్రంగా మోసుకుంటూ జీవితాల్ని ఈడ్చుకుంటూ పోతున్న సంచార జాతులవాళ్లు. సమాజంలో ఏ పాలకులు గుర్తించని సంచార కులాలకు చెందినవాళ్లు. అయ్యా మేం ఎంత మందికో మొరపెట్టుకున్నం, ఎన్నో ప్రభుత్వాలకు విన్నవించుకున్నాం. మా బాధలు తీరలేదు. మా కష్టాలు పోలేదు. కనీసం మాదే కులమో? మాదే జాతో తెలియని అపస్మారక స్థితిలో మగ్గినం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా గోసను వినేందుకు ప్రభుత్వమే బిసి కమిషన్‌ను నియమించి మా దగ్గరకు పంపినందుకు వాళ్లు పొందిన పరమానందాన్ని చూసి మా కళ్లు చెమ్మగిల్లినయ్. ఇంత గొప్ప పనిని కెసిఆర్ మా కప్పగించటం వల్లనే సంచార జాతులకు చెందినవాళ్ల జీవన విధానాన్ని చదువుకోగల్గిగాం. ఇంతకంటే గొప్ప పని ఏముంటుందన్న ఆనందం మా జీవితాంతం చెరిగిపోదు. అత్యాధునిక సమాజాలు చూడలేని మట్టిపొరల్లో దాగి వున్న జీవిత మూలుగుల్ని విన్నవాడే అసలైన నాయకుడు, పాలకుడు అవుతారు.
సంచార జాతులకు చేయగలిగిన మేరకు సాయం చేయాలని వాళ్ల జీవితాలకు కొత్తదారులు చూపాలన్న మహా సంకల్పం కెసిఆర్‌లో బలంగా ఉంది. అందుకే బిసి కమిషన్‌ను ఆదేశించి అధ్యయనం చేయించి నివేదికను తెప్పించుకున్నారు. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని 17 సంచార, అర్థసంచార, అత్యంత వెనుబడిన కులాల వారిని బిసి కులాల జాబితాలో చేర్చుతూ నూతన చరిత్రకు తలుపులు తెరిచారు. ధైర్యంతో కూడుకున్న పనులు కెసిఆర్ మాత్రమే చేస్తారనటానికి ఈ 17 సంచారకులాల్ని బిసిల్లో చేర్చటం నిదర్శనంగా చెప్పవచ్చును. ఏమాటకామాట చైర్మన్ బి.ఎస్.రాములు తత్త్వాలు చెప్పగలవాడు, వకుళాభరణం కృష్ణమోహన్ బిసి కమిషన్‌లో తెలంగాణ రాకముందే రెండుసార్లు సభ్యునిగా పని చేసి తెలంగాణ రాష్ట్ర తొలి బిసి కమిషన్‌లో సభ్యుడైన సీనియర్, మా నలుగురిలో అందరి కంటే వయసులో చిన్నవాడు అయిన డాక్టర్ ఆంజనేయగౌడ్ ఎల్.ఎల్.ఎవ్‌ు పూర్తి చేసి న్యాయశాస్త్రంలో బిసి రిజర్వేషన్లపై పి.హెచ్.డి పూర్తి చేస్తాడు. చట్టాలపై పట్టున్న యువకుడు. మా మూడేళ్ల కమిషన్ పని కాలంలో క్షేత్రస్థాయిలో తిరిగింది సుమారు ఒక లక్ష కిలోమీటర్లని కారు కిలోమీటర్లు లెక్కకట్టి మరీ చెబుతుంది.
2016 అక్టోబర్ 22న బిసి కమిషన్ నియమించబడిన కొన్ని నెలల్లోనే బిసి(ఇ) గ్రూపులోని ముస్లింల జీవన విధానంపై అధ్యయనం చేసి నివేదికను అందజేయడం, ఆ నివేదిక ఆధారంగా ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీని సమావేశపరిచి ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానించింది. కెసిఆర్ ఈ పనిని పూర్తి చేయటం ఒక చారిత్రక తీర్మానంగా చరిత్రలో మిగిలిపోయింది.
బిసి కమిషన్ సభ్యునిగా నియమించబడిన తర్వాత కెసిఆర్‌ను ఎన్నిసార్లు కలిశామో అన్నిసార్లు ఆయన లోతైన అధ్యయనం చేయాలని చెబుతూ వచ్చారు. ఇందుకు జిఒ నెం. 9ని విడుదల చేశారు. సంచార జాతులపై సమగ్ర నివేదికను అందించమన్నారు. సిఎం ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగానే ఈ 17 సంచార కులాలపై అధ్యయనం చేసి బిసి కులాల్లో చేర్చేందుకు నివేదికను అందించాం. కెసిఆర్ ఈ కులాల్ని బిసి జాబితాల్లో చేర్చుతూ మంత్రివర్గం తీర్మానించింది. తరతరాలుగా కనీసం కుల ధ్రువీకరణ పత్రాలే కూడా లేని దీన స్థితిలో ఈ సంచార తెగలున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణకు పూర్వం అనంతరామన్ కమిషన్, మురళీధరన్ కమిషన్లు వున్నప్పటికినీ వీరు ఒబిసి కుల జాబితాల్లోకి చేరలేకపోయారు. పేదలకు, అట్టడుగు వర్గాల వారికి అందజేస్తున్న అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు డిఎన్‌టీలు అర్హులు కాలేకపోతున్నారని సంచార జాతులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బాలకృష్ణరేణకే కమిషన్ నివేదికను ఇచ్చింది. కానీ దాన్ని కేంద్రమే అమలు చేయలేదు. సంచార జాతుల వారికి అన్నింటా తరతరాలుగా అన్యాయం జరుగుతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతుల జీవన విధానంలో మార్పు తేవాలని, వారి బిడ్డలకు నాణ్యమైన మంచి చదువును అందజేసి అసమానతల నుంచి, ఆత్మన్యూనతల నుంచి వారిని బైటపడవేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధ్దంగా వుందన్న సంసిద్ధతను, సందేశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యక్తం చేశారు.
ఆయనలోని ఆ భావనలకు రూపకల్పనగానే మొదటవారి సంస్కృతి వారి సంస్కృతి, కులం, వృత్తి, జీవన విధానాన్ని అధ్యయనం చేయవలసిందిగా బిసి కమిషన్ ఆదేశించటం జరిగింది. సంచారజాతుల బిడ్డలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించి పోటీ సమాజంలో వాళ్ళను నిలపాలని ఆయన పదేపదే చెప్పారు. ఆ దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. అందులో భాగంగానే జిఒ 9ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సమాజంలో అత్యంత వెనుబడిన సంచార జాతుల వారిని ఆదుకోవటం వారి నైపుణ్యాలను జాతి సంపదగా మార్చి విశ్వవీధిలో నిలబెట్టవలసిన అవసరం ఉంది. అసమానతలకు గురైన వర్గాలు నిలుదొక్కుకునేందుకు విద్య చాలా అవసరం. ఈ పని తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల ద్వారా మొదలైంది. సంచార జతుల బిడ్డలు గురుకులాల్లో చేరి మంచి విద్యను పొందే అవకాశం కలిగింది.
బిసి జాబితాలో చేరిన ఈ 17 సంచార జాతుల వారికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి జీవన విధానంలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తుంది. వీళ్లను బిసి జాబితాల్లో చేర్చటం కెసిఆర్ సాహసంగానే చెప్పాలి. దీంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచి వారికి స్థిర జీవితం కల్పించేందుకు కూడా కెసిఆర్ కృషి చేస్తారన్న విశ్వాసం ఆవర్గాల్లో ఉంది. ఆ 17 కులాలకు చెందిన వాళ్లు రాష్ట్ర కేబినేట్ నిర్ణయాన్ని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మా జీవితాల్లోకి తొంగిచూసి మా జీవితాలను మార్చేందుకు తొలిమెట్టుగా మమ్ముల్ని బిసి జాబితాలో చేర్చారని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నట్లుగా మా జీవితాల్లో కూడా మార్పులు వచ్చి తీరుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్‌ను మరువరాని మనిషిగా ఈ 17 సంచార జాతుల వాళ్లు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News