Saturday, April 27, 2024

సంపాదకీయం: నవశకం

- Advertisement -
- Advertisement -

Will Increasing Legal Age Of Marriage For Girls Address రైతు చల్లగా ఉంటే రాష్ట్రం చక్కగా ఉంటుందని నమ్మే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దిశగా అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నీటి పారుదల రంగానికి అగ్రతర ప్రాధాన్యం ఇవ్వడం, సాగు సమయంలో చేదోడుగా ఉండేందుకు రైతుబంధు, రైతు బంధు బీమా వంటి పథకాలను అమల్లోకి తేవడం, అంతిమంగా రైతే తన పంటకు ధరను నిర్ణయించుకొని దానిని పొందగలిగే స్థితిని ఆవిష్కరించే వైపు వినూత్న ఆలోచనలు, ఆచరణలకు అంకితం కావడం కెసిఆర్ రైతు పక్షపాత కృషికి తిరుగులేని నిదర్శనాలు. స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వ్యవస్థలను అతి దగ్గరి నుంచి చూశారు. వాటిలోని లోపాలను గమనించారు. వాటి వల్ల రాష్ట్రంలోని అసంఖ్యాక చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను గమనించారు.

ఆ లొసుగులను తొలగించి రైతును వాటి నుంచి గట్టెక్కించడానికి కంకణం కట్టుకున్నారు. అందుకే గత కొంత కాలంగా కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో యంత్రాంగాన్ని తలమునకలు చేయించారు. ఆ మేరకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నాడు ఆమోదించిన తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్ 2020 (తెలంగాణ భూ హక్కులు పట్టాదార్ పాస్ పుస్తకాల బిల్లు 2020) ను నేడు శాసన సభలో ప్రవేశపెట్టడానికి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో మరో అత్యద్భుత ఘట్టంగా నిలుస్తుంది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత సబ్ రిజిస్ట్రార్ల నుంచి తహసీల్దార్లకు బదిలీ కానున్నది. అదే సమయంలో విఆర్‌ఒ (గ్రామ రెవెన్యూ అధికారి) వ్యవస్థ రద్దు అవుతుంది. ఒక్క సారిగా ఆవిష్కృతమయ్యే ఈ రెండు మార్పులకు అవసరమైన పూర్వ రంగం కూడా సిద్ధమైపోయింది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు విరామం ప్రకటించారు. విఆర్‌ఒల వద్ద గల రికార్డులను యుద్ధ ప్రాతిపదిక మీద తక్షణమే తహసీల్దార్లు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ వ్యవస్థ సర్వ ప్రక్షాళన అధ్యాయం కళ్లు మిరుమిట్లు గొల్పుతున్నది.

అధికార యంత్రాంగం బల్లకింది నుంచి చేతులు చాచడమనే భ్రష్టాచార విశ్వరూపం భూముల రిజిస్ట్రేషన్ ఘట్టంలో తిష్ఠ వేసుకొని చాలా కాలమైంది. అలాగే రిజిస్ట్రేషన్ అనంతరం ఆ భూమి హక్కును కొనుగోలుదారు పేరు మీద మార్చే మ్యూటేషన్ (హక్కుల మార్పిడి) ఘట్టంలో కూడా అవినీతి నిలువెత్తున దర్శనమిస్తూ వచ్చింది. భూమిపై తండ్రి తాతల నుంచి సంక్రమించే వారసత్వ హక్కును బదలాయించేటప్పుడు కూడా చేతులు తడపక తప్పని దుస్థితి రాజ్యమేలింది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామ రెవెన్యూ రికార్డుల నుంచి వివరాలను సమర్పించడం వంటి కీలక విధులు విఆర్‌ఒల వద్ద ఉండడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. విఆర్‌ఒలతో రైతులు నానాయాతనలు పడుతున్నారనే అభిప్రాయం, ఆవేదన స్థిరపడిపోయాయి. వారు రైతుల పాలిట విలన్లుగా మారారని, ప్రతి చిన్న పనికి లంచాలు గుంజుతున్నారని బాధిత రైతులు వాపోయిన సందర్భాలు అనేకం. హక్కు పత్రాలు అందక, వాటి కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేక పురుగు మందులను ఆశ్రయించి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఉదంతాలు లెక్కలేనన్ని.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల సందర్భంలోనూ, తెల్లకాగితాల మీద రాసుకునే సాదా బైనామాల స్థానంలో శాశ్వత హక్కులు కల్పించిన ఘట్టంలోనూ వందలాది మంది విఆర్‌ఒలు కోట్లకు పడగెత్తారంటే అతిశయోక్తి కాదు. అందుకే విఆర్‌ఒ వ్యవస్థను రద్దు చేయడం, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాన్ని కూడా మ్యూటేషన్ జరిపించే తహసీల్దార్లకే అప్పగించడం ద్వారా అవినీతి రహితమైన, మరింత పారదర్శకమైన వ్యవస్థను నెలకొల్పాలని కొత్త బిల్లులో ఉద్దేశించారు. 2017లో జరిపిన భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా రైతులకు కొత్త పాస్ బుక్కులను అందజేశారు. దానితోపాటు భూముల వివరాల్లో హక్కుదార్ల ఆధార్ సంఖ్య, ఫోన్ నెంబర్లు పొందుపరిచారు.

వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పూర్తి కావడంతోనే ఆ సమాచారాన్ని కొనుగోలుదార్లకు ఫోన్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. అవ్యవధిగా మ్యూటేషన్ పూర్తి అవుతుంది. రికార్డుల్లో హక్కుల మార్పు జరగగానే తపాలా ద్వారా కొనుగోలుదారుకు రిజిస్ట్రేషన్ పత్రాలు, పాస్‌బుక్ చేరిపోతాయి. ఏ దశలోనూ ఎవరూ బల్లకింది చేయి చాచకుండా, తిప్పించుకోడాలు, వేధింపులు లేకుండా భూ హక్కుల మార్పిడి పూర్తయ్యేలా కొత్త రెవెన్యూ చట్టం హామీ ఇస్తుంది. ఇప్పటికే కొత్త పంచాయతీ రాజ్, పురపాలక చట్టాలను తెచ్చి విజయవంతంగా అమలు జరిపిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ రెవెన్యూ చట్టం ద్వారా మరో నవశకాన్ని ఆవిష్కరిస్తున్నది. రాష్ట్రానికి దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి కలిగించాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మహోత్కృష్ట ధ్యేయం దిశగా ఇది మరో ముందడుగు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News