Saturday, April 27, 2024

నీటి పొదుపే మేటి పొదుపు

- Advertisement -
- Advertisement -

జీవన భద్రతకు నీరు, ఆహారం ఎంతో అవసరం. అయినా దీని గురించి సీరియస్‌గా ఉండడం లేదు. ప్రపంచం మొత్తం మీద వ్యవసాయ దిగుబడిలో 10 శాతం వరకు 600 మిలియన్ రైతులు సమష్టిగా అందిస్తుండగా, భారత దేశ రైతులు మాత్రం భూగర్భ జలాల నీటి మట్టాల వాస్తవ స్థాయి ఏమిటో పట్టించుకోకుండా విచక్షణా రహితంగా వినియోగించడం పరిపాటి అవుతోంది. ఇటీవల కాలంలో ప్రత్యామ్నాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు రైతుల దృష్టి మళ్లిందని చెబుతున్నారు. కానీ వాస్తవానికి అదెంతవరకు సాధ్యమో తెలియడం లేదు. ఎందుకంటే 2 హెక్టార్ల కన్నా తక్కువ విస్తీర్ణం కలిగిన సాగు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ మార్పు చాలా కష్టమనిపిస్తోంది. మన దేశ వ్యవసాయ రైతు జనాభాలో 85% మంది వీరే ఉన్నారు. చిన్న, మధ్య తరహా వ్యవసాయ రైతుల జీవన విధానంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నా 84% మంది రైతులు తమ భూమిని అమ్ముకోడానికి గానీ, ఇతర సంపాదన మార్గాల వైపు మళ్లడానికి గానీ ఇష్టపడడం లేదు. గ్రామీణ భారతంలో ఇటువంటి రైతులు 85% మంది తమ జీవన విధానం కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు.

భూగర్భ జలాలు అడుగంటడం వల్ల వచ్చే ప్రమాదాలపై వీరికి అవగాహన ఉండడం లేదు. పంజాబ్ రాష్ట్రంలో 76%, రాజస్థాన్‌లో 63%, తమిళనాడులో 40% వరకు భూగర్భ జలాలను అత్యధికంగా వాడడం జరుగుతోంది. ఈ వాడకం భూగర్భ జలాల రీఛార్జి అంటే తిరిగి నింపడం కన్నా ఎక్కువయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. 2020లో దేశంలో గృహ అవసరాల కోసం 54,000 బిలియన్ లీటర్ల నీరు అవసరమైనట్టు అంచనా. వ్యవసాయ రంగానికి 14 రెట్లు ఎక్కువ అవసరం అంటే 7,76,000 బిలియన్ లీటర్ల నీరు అవసరం.కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సిఇఇడబ్లు) అంచనా ప్రకారం 2030 నాటికి వ్యవసాయ రంగానికి దేశంలోని జలాల్లో 87% డిమాండ్ ఉంటుందని తేలింది. ఈ కారణంగా మన పరిమిత జలవనరులపై ఒత్తిడి తప్పనిసరి అవుతుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నీటి కేటాయింపులపై వివాదాలు పోటీ పడుతుంటాయి. ఆహారం, భూమి, నీరు, ఇంధనం రంగాలు కీలకంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించకుండా ఏదో ఒక రంగంపై ఒత్తిడి పెంచితే మిగతా రంగాలపై విపరీత ప్రభావం పడుతుంది.

భారత దేశ హరిత విప్లవంలో పంజాబ్, హర్యానాల్లో భూగర్భ జలాల ఆధారిత వ్యవసాయంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి సబ్సిడీలు అమలు చేయడం మనం చూస్తున్నాం. 2019లో వ్యవసాయ రంగానికి రూ. 80,000 కోట్ల నుంచి రూ. 91,000 కోట్ల వరకు విద్యుత్ సబ్సిడీలకు కేటాయించవలసి వచ్చింది. ఎక్కువ సాగు నీరు ఆధారమైన వరి, గోధుమ, చెరకు పంటలకు కనీస మద్దతు ధరల కల్పన లోనూ రాయితీలు తప్పనిసరి అయ్యాయి. అయినా నీటి పారుదల విధానాలు క్రమబద్ధీకరణ కాలేదు. విచక్షణా రహితంగా భూగర్భ జలాల వాడకం జరుగుతోంది. ప్రమాదకరస్థాయిలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాగునీటి నిర్వహణలో నిష్క్రియాత్మక విధానం ఫలితంగా 2030 లో 48 ట్రిలియన్ నుంచి 2050లో 138 ట్రిలియన్ రూపాయల వరకు ఖర్చు చేయవలసి వస్తుందని సిఇఇడబ్లు అంచనా వేసింది. రానున్న దశాబ్దాల్లో దేశంలో నీటి భద్రతను అభివృద్ధి చేయడానికి తద్వారా ఆహార వ్యవస్థలను బలోపేతం చేయడానికి మూడు దశలను సిఫార్సు చేశారు. మొదట ప్రభుత్వాలు… ముఖ్యంగా రాష్ట్రాలు వ్యవసాయ నీటి పారుదల వ్యవస్థను, నీటి వినియోగ పద్ధతులను, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

కచ్చితమైన వ్యవసాయం, సూక్ష్మబిందుసేద్యం, నీరు ఆవిరైపోకుండా ఆకులతో కప్పి ఉంచడం, నీటి వాడకంపై ఆడిటింగ్, ఘనపరిమాణ విలువ కట్టడం, తదితర సాంకేతిక విధానాలు అనుసరించాలని సూచించారు. ఇలాంటి విధానాల ద్వారా 20 నుంచి 47 శాతం వరకు సాగునీరు పొదుపు అవుతుందని సూచించారు. భారత దేశం ఇప్పటికే ఇలాంటి సమర్ధవంతమైన నీటి పారుదల విధానాలను రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన ద్వారా ‘ప్రతినీటి చుక్కకు ఎక్కువ పంట’ అనే పథకం అమలు చేస్తోంది.
ఈ సూక్ష్మ నీటిపారుదల విధానంలో 2022లో 7.2 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిని తీసుకొచ్చింది. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులను వేగవంతం చేయడం ద్వారా సుస్థిరమైన వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయాన్ని, ఆహార వ్యవస్థలను రూపొందించాలని గత ఏడాది జి20 దేశాల సదస్సు సంకల్పించింది. వ్యవసాయంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, రాయితీలతో నీటి పారుదలను, నీటి యాజమాన్యాన్ని అభివృద్ధి చేయడం ఎంతో కీలకం. రెండవది ఆహారం, భూమి, నీరు, విద్యుత్, విధానాలను అంతర్గతంగా అన్ని దశల్లోనూ ఏకీకృతం చేయడం అవసరం.వీటి రూపకల్పన, అమలు, పర్యవేక్షణల ప్రభావం మూల్యాంకనం చేయాలి.

జలశక్తి, వ్యవసాయం, వ్యవసాయదారులసంక్షేమం, పునరుత్పాదక ఇంధనం, పెట్రోలియం, సహజవాయువు, విద్యుత్ తదితర సంబంధిత మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న పథకాలు, విధానాల ప్రణాళిక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్న ఒక స్వతంత్ర వ్యవస్థ మార్గనిర్దేశం చేయగలదు.జాతీయ స్థాయిలో దీని అవసరం చాలా కీలకమైనప్పుడు ఇప్పటికే ఉన్న యంత్రాంగాల సామర్ధం ఆధారంగా రాష్ట్రాలు కూడా తమ అవసరాలను అంచనా వేయగలుగుతాయి. ఉదాహరణకు ఒడిశా ప్రభుత్వం ప్లానింగ్ అండ్ కన్వెర్జెన్స్ డిపార్టుమెంట్ పేరున ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఆయా శాఖల పథకాల ప్రయత్నాలను, విధానాలను వాటి సమగ్రత, సమర్ధత కోసం సమన్వయం చేస్తుంది. 2018లో నీతి ఆయోగ్ అభివృద్ధి చేసిన కాంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్ (మిశ్రమ నీటి నిర్వహణ సూచిక) నీటి రంగంలోనే కాకుండా ఆహారం, ఇంధనం వంటి అనుసంధాన రంగాల పురోగతిని పరిగణిస్తుంది.

ఆహార ఉత్పత్తి, భూమి, నీరు, విద్యుత్ వంటి క్లిష్టమైన మౌలిక అవసరాల పరస్పర చర్యలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వాటిని పరిరక్షిస్తుంది. వ్యవసాయ సుస్థిరతకు, ఆహార భద్రతకు ఇవి చాలా అవసరం. మూడో అంశం క్లిష్టమైన భూగర్భజల వనరులను సుస్థిరం చేయడానికి సామాజిక నిర్వహణను మరింత పెంచడం తప్పనిసరి. వాతావరణ మార్పులు నీటి దుర్లభ్యతను అసమానంగా పెంచుతాయి. కాబట్టి నీటి వినియోగం నుంచి నీటి పరిరక్షణకు ఆలోచనా విధానంలో మార్పు కీలకం అవుతుంది. ఇది దేశంలో భూగర్భ జలాలు దోపిడీ కాకుండా సురక్షితంగా ఉంచుకునేలా చేయడమే కాక, 62% వ్యవసాయ సాగు నీటి పారుదలను కొనసాగేలా చేస్తుంది. ఎప్పటికప్పుడు తాజాగా స్థానికీకరించిన డేటా కూడా యథాతథ స్థితిని కొనసాగించడానికి ఎంతో కీలకం. నీటి భద్రత కోసం రూపొందించిన ప్రణాళికలో అటల్ భూజల్ యోజన అనే కేంద్ర పథకం ఈ దిశలో ఒక ముందడుగు వంటిది. ఈ మేరకు ఆయా స్థానిక సమాజాల ద్వారా గ్రామ పంచాయతీ స్థాయిలో కావలసిన డేటా సేకరించడమవుతుంది.

ఈ పథకంలో ప్రధాన బాధ్యతల్లో ఒకటి నీటి భద్రత ప్రణాళికలను అభివృద్ధి చేసేలా గ్రామ సమాజాలకు శిక్షణ కల్పించడం. భూగర్భ జలాల పరిరక్షణ, వినియోగంలో ఆయా గ్రామస్థాయి సమాజాల ప్రాతినిధ్యం వల్ల గతంలో అనుకున్న సత్ఫలితాలు లభించాయి. ప్రభుత్వ పథకాల ద్వారా దీన్ని అభివృద్ధి చేయాలనుకోవడం సానుకూల చర్య అవుతుంది. 2030 నాటికి ఆహార భద్రతలో విజయం సాధించాలన్న లక్షం నీటి నిర్వహణ పైనే భారీ ఎత్తున ఆధారపడి ఉంది. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సవరణల్లో నీటి యాజమాన్యం అన్నది ప్రధాన అనుసంధానంలో భాగంగా అర్థం చేసుకున్నప్పుడే భవిష్యత్తులో నీటి, ఆహార భద్రతకు కీలకం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News