Thursday, May 9, 2024

రేపటి నుంచి రెండో విడత జెఇఇ మెయిన్

- Advertisement -
- Advertisement -

Second phase of JEE Main from tomorrow

ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటిల్లో బి.టెక్, ఇంటిగ్రేటెడ్ బి.టెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రెండో విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి 30 వరకు జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 500 నగరాలతో పాటు ఇతర దేశాల్లో 17 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేసింది. రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండవ సెషన్ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాల్లోనే

జెఇఇ మెయిన్ పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థికి జారీచేసిన హాల్‌టికెట్(అడ్మిట్ కార్డు)తో పాటు, పరీక్షల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు అందించింది. పరీక్ష కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలు అడ్మిట్ కార్డులో పొందుపరిచారు. విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డు వెంట తీసుకువెళ్లాలి. అభ్యర్థులకు పరీక్షా కేంద్రం వద్దనే మాస్కులు అందజేస్తారు. సొంత మాస్కులతో లోపలికి అనుమతించరు. డయాబెటీస్ ఉన్న విద్యార్థులు షుగర్ ట్యాబ్లెట్లు, అరటిపండు, యాపిల్, ఆరెంజ్ వంటి పళ్లతో పాటు ట్రాన్పరెంట్ వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లవచ్చు. అయితే ప్యాక్ చేసిన ఛాక్లెట్లు, క్యాండీ, శాండ్‌విచ్ వంటి వాటిని అనుమతించమని ఎన్‌టిఎ స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా ఎటువంటి వ్యక్తిగత వస్తువులను అనుమతించరు. విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. మొదటి సెషన్‌కు ఉదయం 7 గంటల నుంచి, రెండవ సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామని ఎన్‌టిఎ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News