Monday, April 29, 2024

అదరగొడుతున్న షమి

- Advertisement -
- Advertisement -

23 వికెట్లతో ప్రపంచకప్‌లో పెను ప్రకంపనలు

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచకప్‌లో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి అసాధారణ బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. మెగా టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లలో తుది జట్టులో స్థానాన్ని కూడా సంపాదించని షమికి హార్దిక్ పాండ్య గాయ బారిన పడడం కలిసి వచ్చింది. హార్దిక్ స్థానంలో షమిని తుది జట్టులోకి తీసుకున్నారు. అంతే..అందివచ్చిన అవకాశాన్ని షమి సద్వినియోగం చేసుకున్నాడు. ఛాన్స్ దొరికిన మొదటి మ్యాచ్‌లోనే అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షమి చెలరేగి పోయాడు.

కివీస్ బ్యాటర్లను హడలెత్తించి 54 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తర్వాత మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా షమి అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. షమికి ఈసారి నాలుగు వికెట్లు దక్కాయి. అంతేగాక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ షమి విజృంభించాడు. నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈసారి 18 పరుగులకే ఐదు వికెట్లను పడగొట్టి భారత్‌కు రికార్డు విజయం సాధించి పెట్టాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ప్రమాదకర బ్యాటర్లు వండర్ డుసెన్, మార్‌క్రమ్ వికెట్లను తీసి భారత్ విజయానికి మార్గం సుగమం చేశాడు.

కొత్త రికార్డు..

తాజాగా న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో అద్భుత ప్రదర్శనతో భారత్‌ను ఫైనల్‌కు చార్చడంలో ముఖ్యభూమిక పోషించాడు. ఈ మ్యాచ్‌లో షమి ఏకంగా ఏడు వికెట్లు తీసి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా షమి చరిత్ర సృష్టించాడు.

అంతేగాక వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌లో నాలుగు సార్లు ఐదు వికెట్లను పడగొట్టిన తొలి బౌలర్‌గా కూడా మరో కొత్త రికార్డు షమి నెలకొల్పాడు. షమి ఈ వరల్డ్‌కప్‌లో మూడు సార్లు ఐదు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేగాక ఓవరాల్‌గా నాలుగు సార్లు ఈ ఫీట్‌ను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో షమి ఆరు మ్యాచుల్లోనే 23 వికెట్లను పడగొట్టి పెను ప్రకంపనలు సృష్టించాడు. ఇప్పటికే మూడు సార్లు మ్యాచ్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న షమి వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News