Wednesday, May 1, 2024

ఆస్ట్రేలియా ఓపెన్ క్వీన్ సోఫియా కెనిన్

- Advertisement -
- Advertisement -
Sofia-Kenin
ఫైనల్లో ముగురుజా ఓటమి

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా సంచలనం, 16వ సీడ్ సోఫియా కెనిన్ టైటిల్ ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో కెనిన్ స్పెయిన్‌కు చెందిన మాజీ నంబర్‌వన్ గార్బయిన్ ముగురుజాను ఓడించింది. కెనిన్ ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించడం కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని భావించిన ముగురుజాకు నిరాశే మిగిలింది. కెనిన్ ధాటికి ముగురుజా రన్నరప్‌తోనే సరి పెట్టుకుంది. మూడు సెట్ల ఫైనల్ సమరంలో కెనిన్ 46, 62, 62తో ముగురుజాను చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలి సెట్‌లో ముగురుజా పైచేయి సాధించింది.

కెనిన్ జోరును అడ్డుకుంటూ ముందుకు సాగింది. దూకుడుగా ఆడుతూ పట్టు సాధించింది. ఇదే క్రమంలో తొలి సెట్‌ను కూడా సొంతం చేసుకుంది. ముగురుజా ఆటను చూస్తే కెనిన్‌కు ఓటమి ఖాయమని అందరూ భావించారు. అయితే రెండో సెట్‌లో అమెరికా టినేజర్ కెనిన్ అనూహ్యంగా పుంజుకుంది. తన మార్క్ షాట్లతో ముగురుజాను హడలెత్తించింది. అద్భుత షాట్లతో అలరించిన కెనిన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముగురుజాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగిం ది. ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే రెండో సెట్‌ను సాధించింది. దీంతో ఇటు ముగురుజా అటు కెనిన్‌కు ఆఖరి సెట్ కీలకంగా తయారైంది. ఇందులో గెలిచి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఇద్దరు కోర్టులో అడుగు పెట్టారు. కానీ, ఈసారి కెనిన్ జోరును కొనసాగించింది. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది.

అసాధారణ ఆటతో ముగురుజాను కోర్టు నలుములలా పరిగెత్తించింది. ఆఖరి వరకు ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగిన కెనిన్ అలవోకగా సెట్‌ను గెలిచి తన ఖాతాలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమచేసుకుంది. ఇదే క్రమంలో ఆడిన తొలి ఫైనల్లోనే గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇక, ఈ టోర్నీలో అన్ సీడెడ్‌గా బరిలోకి దిగిన మాజీ నంబర్‌వన్ ముగురుజా అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఏకంగా ఫైనల్‌కు చేరి ప్రకంపనలు సృష్టించింది. అయితే టైటిల్‌తో పూర్వ వైభవం సాధించాలని భావించిన ముగురుజాకు నిరాశ మిగిలింది.

విక్టోరియా, మయోట్‌లకు టైటిల్స్

మరోవైపు జూనియర్ బాలబాలికల విభాగంలో హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్), విక్టోరియా జిమెనేజ్ కసిన్‌సేవా (అండోరా) టైటిల్స్ సాధించారు. శనివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో విక్టోరియా 57, 62. 62తో వెరోనికా బస్జాక్ (పోలండ్)ను ఓడించింది. 9వ సీడ్‌గా బరిలోకి దిగిన విక్టోరియాకు తొలి సెట్‌లో చుక్కెదురైంది. ఆరంభం నుంచే సెట్ హోరాహోరీగా సాగిం ది. అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో వెరోనికా పైచేయి సాధించింది. కానీ, తర్వాతి రెండు సెట్లలో విక్టోరియా చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన విక్టోరియా వరుసగా రెండు సెట్లు గెలిచి బాలికల జూనియర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక, బాలుర జూనియర్ విభాగంలో టాప్ సీడ్ మయోట్ టైటిల్‌ను సాధించాడు. ఏక పక్షంగా సాగిన పోరులో మయోట్ 64, 61తో ఐదో సీడ్ ఆర్థర్ కజాక్స్‌ను చిత్తు చేశాడు.

నేడు జకోవిచ్‌తో థిమ్ ఢీ

ఇక, పురుషుల సింగిల్స్ ఫైనల్ ఆదివారం జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), ఐదో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా)లు ఫైనల్లో తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. అయితే నాదల్‌ను ఓడించిన థిమ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇద్దరు కూడా జోరుమీదున్నారు. దీంతో ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయం. జకోవిచ్ ఇప్పటికే 16 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. మరోవైపు థిమ్ ఒక్కసారి కూడా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవలేదు. అంతేగాక తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరాడు. ఈసారి జకోవిచ్‌ను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సాధించాలని తహతహలాడుతున్నాడు.

Sofia Kenin wins Australian Open 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News