Monday, April 29, 2024

ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ షురూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ షురూ అయ్యింది. ముందుగా అక్రమ లే ఔట్‌లో వెంచర్‌లోని ప్లాట్లకు స్క్రూటీని జరుగుతుండగా వాటికి 2020 సంవత్సరంలో ఉన్న మార్కెట్ వాల్యూను అధికారులు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి హెచ్‌ఎండిఏ అధికారులు గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న అక్ర మ వెంచర్‌ల క్రమబద్ధీకరణపై దృష్టి సారించారు. గతం లో రూ. 10 వేలు కట్టిన వెంచర్ యజమానులకు ఫోన్ లు చేసి దానికి సంబంధించిన మార్కెట్ వాల్యూను కట్టాలని అధికారులు సూచించారు.

అందులో భాగంగా అక్రమ వెంచర్‌దారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను చెల్లిస్తుండగా వారికి త్వరలోనే హెచ్‌ఎండిఏ అధికారులు వారికి ప్రోసీడింగ్‌లను అందచేయనున్నారు. ఇప్పటివర కు 1420 లేఔట్లలో 43,250 ప్లాట్లకు అధికారులు క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. అక్రమ వెంచర్‌లు అయిపోయిన తరువాత మిగతా ప్లాట్ల క్రమబద్ధీకరణ పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
రిజిస్ట్రార్‌లు సమర్పించిన విలువల ఆధారంగా…
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న, ప్రభుత్వం నిర్ణయించిన విలువల ఆధారంగా క్రమబద్ధీకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్‌లు సైతం జూలై లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రస్తుతం విలువలకు సంబంధించి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించగా దాని ఆధారంగా ఆయా ప్లాట్‌ల విలువలను అధికారులు యజమానుల నుంచి వసూలు చేస్తున్నారు.
గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్క్రూటీని…
2020 సంవత్సరంలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా సుమా రు 25 లక్షల పైచిలుకు దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన 2021లో గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారుల కమిటీ స్క్రూటీని సైతం పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 10,69,555 దరఖాస్తులు, మున్సిపాలిటీల్లో 10,48,239, కార్పొరేషన్‌లో 4,11,056 దరఖాస్తులు రాగా, మొత్తం 25,28,850 ఎల్‌ఆర్‌ఎస్ కింద 2020 సంవత్సరంలో దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.

25,28,850 లక్షల దరఖాస్తుల్లో సుమారుగా 14 లక్షల దరఖాస్తులు జిహెచ్‌ఎంసి పరిధిలో నుంచి రాగా, ఆ తరువాతి స్థానం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు నుంచి ఆయా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే అనుమతులు లేని లే ఔట్లలో క్రమబద్ధీకరణ కోసం దాఖలైన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో ఎక్కువ శాతం 200 గజాల విస్తీర్ణం కలిగి ఉన్న ప్లాట్లు ఉన్నట్టుగా అధికారుల స్క్రూటీనిలో తేలింది.
రెండు ప్రక్రియలుగా తనిఖీలు…
అయితే ప్రభుత్వానికి అందిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో అనుమతులు లేని లే ఔట్లకు సంబంధించిన ప్లాట్ల క్రమబద్దీకరణ నిమిత్తం వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉండడంతో ఆయా ప్లాట్ల అధికారుల కమిటీ తనిఖీ చేసింది. అయితే దరఖాస్తుల పరిశీలన నిమిత్తం దరఖాస్తుల క్లస్టరింగ్ (గ్రూపులుగా విభజించడం), సైట్ ఇన్‌స్పెక్షన్ (స్థలాన్ని తనిఖీ చేసి) రెండు ప్రక్రియలుగా అధికారుల బృందం వీటిని పూర్తి చేసింది. మొదటి దశలో గ్రామాలు, వార్డులు, సర్వే నంబర్లు, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించిన అధికారుల బృందం దరఖాస్తులతో పాటు ఆయా ప్లాట్లను స్వయంగా పరిశీలించింది.
3 లక్షల దరఖాస్తులు తిరస్కరణ…
రెండో దశలో అధికారుల బృందం క్లస్టర్లను తనిఖీ చేసి రిమార్కులను ఆన్‌లైన్ నమోదు చేయగా దీనికోసం వివి ధ విభాగాల అధికారుల బృందం పనిచేసింది. అయితే వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని ఎల్‌ఆర్‌ఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని అధికారుల బృందం ప్రభుత్వానికి ఇచ్చిన జాబితాలో పేర్కొన్నట్టుగా తెలిసింది. దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న అంశాన్ని గుర్తించడానికి పురపాలక శాఖ చెక్ లిస్ట్ రూపొందించగా, లే ఔట్, ప్లాట్‌లు తనిఖీకి వెళ్లినప్పుడు అధికారుల బృందం ఈ చెక్ లిస్ట్ ఆధారంగా పరిశీలన జరిపింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్ నిమిత్తం వచ్చిన దరఖాస్తుల్లో నిబంధనలను విరుద్ధంగా ఉన్నా క్రమబద్ధీకరణకు అర్హత లేవని, అయితే ఈ 3లక్షల దరఖాస్తులకు రానున్న రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
2015 దరఖాస్తులకు సైతం మోక్షం!
అయితే 2020లో వచ్చిన దరఖాస్తులతో పాటు 2015లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ (48,553) దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 2015లో హెచ్‌ఎండిఏకు 1,76,102 దరఖాస్తులు రాగా, 88,117 ఫైనల్ ప్రోసీడింగ్స్ (డిజిటల్ సైన్)తో జారీ చేశారు. 12,133 దరఖాస్తులను మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డు, బఫర్ జోన్‌లో ఉన్నాయని వివిధ కారణాలతో వాటిని తిరస్కరించారు. ఇవికాక అధికారులు ఆమోదించినా ఫీజులు చెల్లించాల్సినవి 14,425 దరఖాస్తులు ఉన్నాయి. ఫైనల్ ప్రోసీడింగ్స్ కోసం పిఓల వద్ద 104, డిజిటల్ సైన్ చేయకుండా ఫైనల్ ప్రోసీడింగ్స్ కోసం 633, షార్ట్‌ఫాల్స్‌లో 17 ఉన్నాయి. ఇన్సియల్ ఫీజు (రూ.10 వేలు) చెల్లించని 9,545 దరఖాస్తులుండగా, మొత్తం 48,533 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి కూడా ఈసారి ఆమోదం లభించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News