Saturday, April 27, 2024

వలస కార్మికులు, విద్యార్థుల తరలింపునకు ‘శ్రామిక్ స్పెషల్ ’రైళ్లు

- Advertisement -
- Advertisement -

Trains

 

కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
ఆయా రాష్ట్రాలు, రైల్వే శాఖ సమన్వయంతో ఏర్పాటు
మేడే తొలి రోజే ఆరు ప్రత్యేక రైళ్లు
మరిన్ని రైళ్లు నడిపే అవకాశం
మార్గదర్శకాలు జారీ

న్యూఢిల్లీ: ఈ నెల 3న ముగియనున్న దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి ముందే కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయిన వలస కార్మికులు, విద్యార్థ్థులు, యాత్రికులను వారి స్వస్థలాలకు తరలించడానికి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు అనుమతించింది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకారం అందిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్రప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు. టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. అయితే వలసకార్మికులు, విద్యార్థులను తరలించే సమయంలో నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

కాగా ట్రక్కులు, వస్తువుల రవాణా వాహనాలకు ప్రత్యేక పాస్‌లు అవసరం లేదని కూడా హోం శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోడీ శుక్రవారం తన నివాసంలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లద్వారా కార్మికుల తరలింపుపై నిర్ణయం వెలువడిందని భావిస్తున్నారు. కాగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘శ్రామిక్ స్పెషల్’పేరిట ఆరు ప్రత్యేక రైళ్లను శుక్రవారంనుంచే నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వలస కూలీలు చిక్కుపడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అలాగే వారి సొంత రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని రైల్వే శాఖతో సంప్రదించి ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. కాగా శుక్రవారం ఆరు ప్రత్యేక రైళ్లు లింగపల్లినుంచి హతియా, కేరళలోని అలువానుంచి ఒడిశాలోని భువనేశ్వర్, నాసిక్‌నుంచి లక్నో, నాసిక్‌నుంచి భోపాల్, జైపూర్‌నుంచి పాట్నా, కోటానుంచి హతియాకు నడుపుతారు. ఇవి కాక మరిన్ని ప్రత్యేక రైళ్లు కూడా పట్టాలు ఎక్కవచ్చని భావిస్తున్నారు. వీటికి సంబంధించిరైల్వే శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

* రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే నిబంధనల మేరకు ‘ శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడుపుతారు. వీటి సమన్వయానికి రైల్వే శాఖ, రాష్ట్రాలు సీనియర్ అధికారులను కోడల్ అధికారులుగా నియమించాలి.
*ప్రయాణికులు రైలు ఎక్కే ముందు వారిని పంపించే రాష్ట్రాలు స్క్రీనింగ్ నిర్వహించాలి. కోవిడ్19 లక్షణాలు లేవని తేలిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి.
* శానిటైజ్ చేసిన బస్సుల్లో ప్రయాణికులను బ్యాచ్‌ల వారీగా రైల్వే స్టేషన్‌కు తీసుకురావాలి. ప్రయాణికులు ముఖానికి మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలి.

* ప్రయాణికులను పంపే రాష్ట్రమే వారికి భోజనం తాగునీరు రైలు ఎక్కే ముందు సమకూర్చాలి. ఒక వేళ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటే రైళ్లలోనే భోజన ఏర్పాట్లు చేస్తారు.
* ప్రయాణికులు గమ్యాన్ని చేరిన తర్వాత సదరు రాష్ట్రప్రభుత్వం వారికి స్క్రీనింగ్ నిర్వహించాలి. అవసరమనుకుంటే క్వారంటైన్‌కు తరలించాలి. రైల్వే స్టేషన్‌నుంచి ప్రయాణికులు వారి సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా ఏర్పాటు చేయాలి.
కాగా శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని లింగంపల్లినుంచి జార్ఖండ్‌లోని హతియాకు తొలి ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్లింది. సాయంత్రం కేరళలోని అలువానుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు మరో రైలు బయలుదేరి వెళ్తుందని రైల్వే శాఖ తెలిపింది.

 

Special Trains for Migrant workers and Students
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News