Monday, April 29, 2024

మార్చి 6న స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్‌పై మానేపల్లి దంపతులు రామారావు, విజయలక్ష్మి సారథ్యంలో నిర్మించిన స్వర్ణగిరి పద్మావతి, గోదాదేవీ సమేత వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రాణ ప్రతిష్ఠ, ఆలయ ఉత్సవాల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మానేపల్లి హిల్స్ అధినేత మానేపల్లి రామారావు, ఆయన కుమారులు మానేపల్లి మురళీకృష్ణ, గోపీ కృష్ణ తెలిపారు. మార్చి 2 నుంచి 6 వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 11 గంటల 06 నిమిషాలకు జరిపించి, అనంతరం శాంతి కళ్యాణంతో కార్యక్రమాలు సుసంపన్నం కానున్నట్లు తెలిపారు. భువనగిరి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి అని నామకరణం చేసి తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు. నూతన ఆలయ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా ముందు రోజు బుధవారం ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మానేపల్లి హిల్స్ కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళ శాసనాలతో 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం చేసిన కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో, ప్రాకారానికి నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలతో, సువిశాలమైన మండపాలతో, 5 అంతస్థుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చని అన్నారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాల కృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మించినట్టు తెలిపారు.

దేవాలయ ఆవరణలో మనోభీష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ, భక్తుల విన్నపాలు దీని ద్వారా స్వామివారికి అనుసంధానం అవుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల కనుగుణంగా విశాలమైన మాఢ వీధులు, రథశాలతో పాటు 40 అడుగుల ఎత్తైన చూడచక్కటి రథం రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి వారి దివ్య మూర్తి, శ్రీ లక్ష్మీనారసింహ స్వామి, శ్రీ భూవరాహ స్వామి, వకులమాత, హంపి శిల్పరీతులతో నిర్మితమైన విశాలమైన పుష్కరిణి తోపాటు నాలుగు వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో పెద్ద జలనారాయణ మూర్తి ప్రతిష్ఠించినట్లు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా సుమారు ఒకటిన్నర టన్నుల భారీ కంచు గంట భక్తుల ప్రార్థన శ్రీవారికి చేరేందుకు జయ గంట మండపంలో నెలకొల్పామని వివరించారు. ఈ సమావేశంలో ఆలయ రూపశిల్పి, ప్రముఖ స్థపతి డిఎన్వి ప్రసాద్, వేద పండితులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News