Thursday, May 9, 2024

టెన్త్ ఎగ్జామ్స్ రద్దు

- Advertisement -
- Advertisement -

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలూ క్యాన్సిల్
సెకండియర్ పరీక్షలు వాయిదా

ఆబ్జెక్టివ్ విధానంలో పదో తరగతి ఫలితాలు, ఎస్‌ఎస్‌సి ఇంటర్నల్
మార్కులు తక్షణమే అప్‌లోడ్ చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు
ఎంసెట్‌లో 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు
జూన్ రెండో వారంలో సెకండియర్ పరీక్షలపై నిర్ణయం
ద్వితీయ సంవత్సరం బ్యాక్‌లాగ్స్‌కు కనీస మార్కులు
కొవిడ్ ఉధృతి దృష్టా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
స్వాగతించిన తల్లిదండ్రులు, టీచర్లు, అధ్యాపకులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ఉధృతి దృష్టా పదవ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేయగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఎస్‌ఇ తరహాలోనే పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌ఇ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానం ద్వారా పదవ తరగతి ఫలితాలను వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెన్త్ ఫలితాలపై విద్యార్థుల్లో ఎవరికైనా సంతృప్తి లేకపోతే వారికి తర్వాత పరిస్థితులను అనుకూలిస్తే పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 5.35లక్షల మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ఈసారి పరీక్షలు లేకుండా పాస్ కానున్నారు.
జూన్ రెండవ వారం ఇంటర్ ద్వితీయ పరీక్షలపై నిర్ణయం
మే 1 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. జూన్ రెండవ వారంలో కొవిడ్ పరిస్థితులను సమీక్షించి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. బ్యాక్‌లాగ్ ఉన్న రెండవ సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్ మార్కులు వేస్తామని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తామని, భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత పదవ తరగతి, ఇంటర్ పరీక్షలపై ఎస్‌ఎస్‌సి, ఇంటర్ బోర్డు అధికారులతో విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రారామచంద్రన్ సమావేశం నిర్వహించారు. పరీక్షల రద్దు, వాయిదా ప్రతిపాదనలకు చర్చించి, అందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పంపించారు. సిఎం ఆమోదం అనంతరం విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.
ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 4.59,008 మంది ప్రమోట్
రాష్ట్రంలో ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తం 9,32,975 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అందులో 4,59,008 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండగా, 4,73,967 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.ఈ సారి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెలించిన 4,59,008 మంది విద్యార్థులు పరీక్షలు లేకుండా ప్రమోట్ కానున్నారు. వీరితో పాటు ఇంటర్ రెండవ సంవత్సరం బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉన్న 1,99,019 మంది విద్యార్థులు కూడా పరీక్షలు లేకుండానే కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించనున్నారు.
హర్షం వ్యక్తం చేసిన ఇంటర్ విద్య జెఎసి
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇంటర్మీడియట్ విద్య జెఎసి హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సిబిఎస్‌ఇ పరీక్షలు రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని ఇంటర్ విద్య జెఎసి ఛైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.కళింగ కృష్ణ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి 15 రోజులు ముందుగానే ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల తేదీలను చెబుతామని చెప్పడం గొప్ప విషయమని తెలిపారు. అలాగే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ఉన్న 25 శాతం వెయిటేజీని రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సమయానుకూలంగా ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధానోపాధ్యాయులు
కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం(టిఎస్‌జిహెచ్‌ఎం) స్వాగతించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజగంగారెడ్డి, కోశాధికారి ఎస్.గిరిధర్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరపు పదవ తరగతి ఫలితాలను ప్రస్తుతం పాఠశాలలో అందుబాటులో ఉన్న ఎఫ్‌ఎ 1 మార్కుల ఆధారంగా ప్రకటించి విద్యార్థులు అందరికీ న్యాయం చేయాలని కోరారు.
పదవ తరగతి పరీక్షల రద్దు పట్ల టిపిఎ హర్షం
సిబిఎస్‌ఇ తరహాలోనే పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం పట్ల తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టిపిఎ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం రావడం లక్షలాదిమంది పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు సంతోషం కలిగిస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఫలితాల ప్రకటనకు ప్రభుత్వం ఎంచుకొనే ఆబ్జెక్టివ్ క్రైటేరియా విద్యార్థుల ప్రతిభా పాటవాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులు వివరాలు

రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థుల సంఖ్య : 5.35 లక్షలు
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు : 4,73,967
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 4,59,008
బ్యాక్‌లాగ్స్ ఉన్న రెండవ సంవత్సరం విద్యార్థులు : 1,99,019

SSC Exams 2021 cancelled in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News