Monday, April 29, 2024

వీధి కుక్కలను ఎలా నిర్మూలించాలి?

- Advertisement -
- Advertisement -

వీధి కుక్కల దాడుల నియంత్రణపై మార్గదర్శకాలు జారీ
కచ్చితంగా ఆదేశాలను పాటించాలని మెమో జారీ చేసిన ఎంఏయూడి

మనతెలంగాణ/హైదరాబాద్:  వీధికుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీధి కుక్కల దాడుల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలు చేపట్టాలని ఎంఏయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ మెమో నెం.3308/టిపి అండ్ ఈ (2)/2023, తేదీ 22.02.2023లో ఆదేశాలు జారీ చేశారు. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ ప్రభుత్వం సూచించింది.

మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. మూసీ నదిలోని వీధి కుక్కలు, అటవీ ప్రాంతాల్లో ఉండే కుక్కలను వందశాతం పట్టుకొని స్టెరిలైజేషన్ చేసేలా విస్తృత చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నారాయణగూడ ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రుల నుంచి కుక్కకాటు బాధితుల వివరాలను వెంటనే తెలుసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం తెలిపింది. వీధికుక్కల విషయంలో అవగాహన కల్పించేలా స్వయం సహాయక బృందాలు, మెప్మా, పారిశుధ్య సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. కుక్కకాటు కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, ఇందుకోసం కాలనీ, బస్తీ, పట్టణ సంక్షేమ సంఘాలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి 13 రకాల మార్గదర్శకాలతో కూడిన మెమోను అర్వింద్‌కుమార్ జారీ చేశారు.

మార్గదర్శకాలు ఇలా…..

1.కుక్కలకు కుటుంబ నియంత్రణ వేగంగా చేపట్టాలి.
2.కుక్కలు ఎక్కువ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ప్రమాదాలను నియంత్రించాలి.
3. సిటీజన్స్ జిహెచ్‌ఎంసి పరిధిలో హెల్ప్ లైన్ నెంబర్ 040 21111111పై అవగాహన కల్పించాలి.
4.మాంసం దుకాణాలు హోటల్స్ యజమానులు వ్యర్ధాలను రోడ్లపై వేయకుండా జిహెచ్‌ఎంసి వాహనాలకు మాత్రమే ఇవ్వాలి.
5.కుక్కల స్థితిల గురించి జిహెచ్‌ఎంసి, స్వచ్ఛంద సంస్థలతో ప్రజలకు అవగాహన కల్పించాలి.
6. స్కూల్స్‌లో విద్యార్థులు వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలన్న విషయాల గురించి వివరించాలి.
7.కాలనీ సంఘాలు, బస్తీల్లో వచ్చే నెల రోజులు కుక్క కాటుపై అవగహన కల్పించాలి.
8.జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న అన్ని రకాల శానిటేషన్ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి.
9.కాలనీలే కాకుండా, మూసీ పరిసర ప్రాంతాలు, చెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని కుక్కలకు ఆపరేషన్ వేయడం, రేబిస్ టీకా వేయడం లాంటివి చేపట్టాలి.
10.వీధి కుక్కలను దత్తత తీసుకోవడంపై ప్రజల్లో అవగహన కల్పించాలి.
11.కుక్క కాటుకు గురైన వారి పూర్తి వివరాలు సేకరించి సరైన సమయంలో వైద్యం, ఇతర సహకారాలు అందించాలి.
12. వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలన్న దానిపై హోర్డింగ్స్, పోస్టర్స్, బిల్ బోర్డ్‌తో ప్రచారం చేపట్టాలి.
13. వీధి కుక్కల కోసం ప్రజలకు దూరంగా నీటి పాత్రలు జిహెచ్‌ఎంసి ఉంచాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News