Monday, April 29, 2024

ఇసిల నియామకంపై రేపు సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల(ఇసి) ఎంపికకు సంబంధించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ)ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మార్చి 15న(శుక్రవారం) విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ఆర్గోయవంతమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఎన్నికల కమిషన్‌ను రాజకీయ, ప్రభుత్వ జోక్యం నుంచి తప్పించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) పిటిషన్ దాఖలు చేసింది.

ఎడిఆర్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బుధవారం ఈ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారణకు చేపడుతున్నట్లు తనకు ఇప్పుడే సిజెఐ నుంచి సమాచారం అందిందని చెప్పారు. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలెక్షన్ కమిషనర్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని కోరుతూ ఎడిఆర్ తన పిటిషన్ దాఖలు చేసింది.

సిఇసి, ఇసిల ఎంపికకు ఉద్దేశించిన కమిటీ నుంచి సిజెఐను తప్పించడాన్ని ఎడిఆర్ తన పిటిషన్‌లో సవాలు చేసింది. కొత్త చట్టం ప్రకారం సిఇసి, ఇసిల ఎంపిక కమిటీలో ప్ధాన మంత్రి చైర్‌పర్సన్‌గా ఉంటారు. ప్రతిపక్ష నాయకుడు(లోక్‌సభలో), ప్రధాని నామినేట్ చేసే కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీల రాజీనామా చేయడంతో ఎడిఆర్ ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఈ రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికల కమిషనర్ల ఖాళీల భర్తీ కోసం 2023లో అనూప్ బారన్‌వాల్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు నియామకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎడిఆర్ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరింది.

స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు, దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం మనుగడ సాధించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్‌ను రాజకీయ, ప్రభుత్వ జోక్యం నుంచి తప్పించాలని ఎడిఆర్ కోరింది. కాగా..2023 మార్చి 2న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ కమిటీ సిఫార్సు మేరకు సిఇసి, ఇసిలను రాష్ట్రపతి నియమించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ ప్వచ్ఛత పాటింపు కోసం ఈ కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) సభ్యులు ఉంటారని రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును పక్కనపెడుతూ కేంద్ర ప్రభుత్వం కమిటీ నుంచి సిజెఐని తప్పిస్తూ కొత్త చట్టం తీసుకువచ్చిందని ఎడిఆర్ తన పిటిషన్‌లో పేర్కొంది.

సిఇసి, ఇసిల నియామకాలను ప్రభుత్వం చేతుల్లో ఉంచడం మన ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి హా చేయడంతోపాటు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు తీవ్ర అవరోధం కాగలదని సుప్రీంకోర్టు తన 2023 తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఎడిఆర్ తన పిటిషన్‌లో గుర్తు చేసింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో ప్రతిపక్ష సభ్యులు లేని సమయంలో, విస్తృతంగా చర్చ జరగకుండా పార్లమెంట్‌లో కొత్త చట్టాన్ని ఆమోదించిందని ఎడిఆర్ పేర్కొంది. ఈ కొత్త చట్టం 2024 జనవరి 2 నుంచి అమలులోకి వచ్చిందని తెలిపింది. కాగా..ఇటీవలనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠౠకూర్ కూడా కొత్త చట్టం మేరకు ఎన్నికల కమిషనర్ల నియామకాలు జరగకుండా నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2023 చట్ట నిబంధనలను కూడా ఆమె సవాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News