Monday, April 29, 2024

తెలుగు వర్శిటీకి సురవరం పేరు పెట్టాలి

- Advertisement -
- Advertisement -

ఈ సభకు ముందే ఒక వ్యాసం రాసినాడు. 2-11-1936న రాసి న ఈ వ్యాసంలో కొండా వెంకటరంగారెడ్డి షాద్‌నగర్ సభలకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని, అంతకు ముందే శాసనసభ్యుడిగా ఎన్నిక కావడాన్ని స్వాగతిస్తూ “ఈ రెండు పదవులు ఒక వ్యక్తికే ఒక సంవత్సరము లభించుట వలన ప్రజాభిప్రాయం ప్రభుత్వ మందిరములోనికి బాగు గా ప్రవేశించగలదు… రైతుల రుణ బాధ, సహకార సంఘముల లోటుపాటులు, హరిజనుల ఇబ్బందులు, సాంఘికములగు దౌర్బల్యములు, జాగీరు ప్రజల కష్టములు మున్నగునవి శాసనసభ మూలమున నివారించబడుటకు ఈ మహాసభ చాలా అవకాశముల కలిగించగలదు (నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు- 2, పుట- 148) ఈ సూచనలు మహాసభ ఏయే సమస్యలను చేపట్టవలెనో తెలియచేస్తున్నవి.
17-12- 1936న రాసిన మరొక సంపాదకీయంలో సనాతనులకు ఆధునికులకు జరిగిన భావజాల ఘర్షణ గురించి రాసినాడు. దాని గురించి వారి మాటల్లోనే చూద్దాం.

“ఆంధ్రమహాసభవారు ఇంతవరకు జరిగిన నాలుగు సమావేశములలోను బాల్యవివాహములు చేయరాదని తీర్మానించి యున్నారు…. పూర్వాచారాభినివేశులు… బాల వివాహ ప్రతికూలురపై అగ్రహము చెందుచున్నారు… అట్టి మొండి పట్టుగల వారల హృదయములను కరిగించు యత్నము సందిగ్ధ ఫలము… సంస్కరణముఖుల సంఖ్య ఎక్కువైనంత మాత్రాన బాల్య వివాహ నిషేధ శాసనము… పూర్వాచారాభినివేశుల ప్రతికూల ప్రయత్నముల మధ్య దుష్కరము… సంస్కరణ ప్రతికూలుర జోలి వదలి ప్రాచ్య పాశ్చాత్య నాగరకతల సమ్మేళనముచే నేర్పడిన హేతు ప్రధాన వాతావరణంలో ఎదగ ఇప్పుడిప్పుడే వికసించుచున్న యువకుల హృదయములను సుళువుగ ఆవర్జించబడును. ఈ యువకులే సిరిసిల్ల ఆంధ్ర మహాసభను శారదా శాసనం కంటె రెండడుగులు ముందుకు లాగినది… కాబట్టి క్రియ ప్రధానమైనచో, కిటుకంతయు విద్యనభ్యసించుచున్న బాల యువకుల చేతులలోనే యున్నది… ఈ రహస్యమును తెలిసికొని ఆంధ్రమహాసభ నాయకులు యువకులందరిని బాల్య వివాహ ప్రతికూలుర చే”యవలెను. (గోలకొండ పత్రిక సంపాదకీయాలు -2. పుటలు- 39, 40).

ఈ సభల్లో ప్రాథమిక విద్యకు సంబంధించిన తీర్మానం మీద “మనం అవిద్యాంధకారములో మునిగిపోవుచున్నాము. ఈ అధికారము పోవలెననిన నిర్బంధ విద్య అవసరము…. పది సంవత్సరములలోగా యీ విధానమును మన రాష్ర్టమునందంతటను వ్యాపింపచేయవలెన”ని ఉద్వేగంగా మాట్లాడినాడు. హరిజనులకు దేవాలయ ప్రవేశం, మంచి నీళ్ళ వనరులపై సమాన హక్కులు, విద్యా హక్కులు, అస్పృశ్యత నిషేధానికి సంబంధించిన “హరిజనోద్ధరణము” అనే తీర్మానాన్ని బలపరుస్తూ శంకరాచార్య చండాలుర సంభాషణాది అనేక విషయాలు ఉదహరించి, తిరువాన్కూరు దేవాలయాల్లో హరిజనుల ప్రవేశ ఉదంతాన్ని ప్రస్తావించి, ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య వాక్ ఝురితో ప్రసంగించినారు. ఈసభలో గూడ బాల్యవివాహ నిషేధ తీర్మానం మీద అనుకూలంగా మాట్లాడినారు. ఈ సభ గురించి రిపోర్టు రాయడమే గాకుండా, ఎప్పటిలాగానే గోలకొండ పత్రికలో సంపాదకీయం రాసినాడు.

డిసెంబర్ 1937న నిజామాబాద్‌లో జరిగిన ఆరవ మహాసభ ప్రారంభం రోజు గోలకొండ పత్రికలో సంపాదకీయంతో పాటు ఒక వ్యాసం కూడా రాసిండు. మహాసభ నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను సూచించిండు. మహాసభలో ఆంధ్రేతర భాషలలో కొందరు మాట్లాడటం ఆంధ్రమహాసభ నియమావళి 31కి విరుద్ధమని నందగిరి వెంకటరావు ప్రతిపాదించిన తీర్మానం వీగిపోయింది. అందుకు సురవరం “పరితాపపడినాడు”. దీని ఫలితంగా సురవరం అధ్యక్షుడిగా వల్లూరి బసవరాజు కార్యదర్శిగా “అభివృద్ధి పక్షము” అనే ఒక సమాంతర సంస్థను స్థాపించినారు. ఇది ఆంధ్ర మహాసభకు వ్యతిరేకం కాదని అందులో ఒక భాగమేనని వివరణ ఇచ్చినారు. 1712 1937 నాటి ప్రకటన ప్రకారం ఉన్నవ వెంకటరామయ్య కార్యదర్శి అయినాడు. ఈ సంస్థ 1) ఆంధ్ర వ్యక్తిత్వాన్ని కాపాడటం 2) ప్రాథమిక హక్కులు సాధించడం 3) సాంఘిక లోపాల్ని తొలగించడం, 4) కర్షక, కార్మిక ఆర్థిక అభివృద్ధికి ప్రయత్నించడం, 5) దేశీయ పరిశ్రమల్ని ప్రోత్సహించడం అనే ఆశయాల్ని ప్రకటించింది. జనవరి 1938 న ఈ ఆశయాల్ని వివరిస్తూ సురవరం గోలకొండ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చినాడు. ఇది ఆయన సామాజిక, రాజకీయ దృక్పథాన్ని పట్టి ఇస్తుంది. కాబట్టి దీనిలోని కొన్ని వాక్యాలు ఇక్కడ ఇస్తున్న

1.“ప్రతి జాతికిని ప్రత్యేక సంస్కృతియుండును. అదే విధంగా ఆంధ్రుల సంస్కృతికిని విశిష్టత కలదు. సంస్కృతియనగా నాగరికత, ఆచార వ్యవహారములు, కళ, శిల్పము, వాఙ్మయము, జాతి చరిత్ర, క్రమక్రమాభివృద్ధి ఇట్టివన్నియు కలిపిన విలక్షణత… అట్టి వానిని జనులలో ప్రబోధం కలిగించి జాతీయాభిమానము పెంపొందింపజేయుట చాలా అవసరం. నిజాము రాష్ర్టమున ఆంధ్రులకు వారి సంఖ్యను బట్టి, చారిత్రక ప్రాముఖ్యతను బట్టి, వారుండు ప్రాంత వైశాల్యమునుబట్టి, ప్రభుత్వ కోశమునకు వారిచ్చుకొను అత్యధిక ద్రవ్య ప్రాముఖ్యతను బట్టి… వారి కుండవలసిన పలుకుబడి లేనందున దాన్ని సాధించుట ఈ పక్ష (అభివృద్ధిపక్ష) ఆశయములలో ముఖ్యమైనది.
2. రెండవ ఆశయము ప్రజల ప్రాథమిక స్వత్వములకై ప్రయత్నించుట ప్రాథమిక స్వత్వములనగా (Fundamental Rights) వాక్కు యొక్కయు ఆస్తియొక్కయు, రచనల యొక్క యు, సమావేశముల యొక్కయు, మతము యొక్కయు, ఆత్మ విశ్వాసముల (వ్యక్తుల స్వీయ అభిప్రాయాలు, భావాలు రచయిత) యొక్కయు స్వాతంత్య్రము…”
3. “తెలంగాణాలోని రైతులు ఆత్మగౌరవహీనులై” యున్నారు… మన సోదరులలో ఆత్మగౌరవమును పెంపొందించుట విద్యాధికుల ముఖ్య కర్తవ్యమై యుండును.

“ఆంధ్రులలో ననేక సాంఘికాచారములతో సంస్కారార్హమైన విషయములు కలవు. స్త్రీల యభివృద్ధికి భంగకరముగా నుండు పద్ధతులన్నింటను అవసరమగు మార్పులు కలిగించుట”.
4. “నాల్గవ యాశయము కర్షకుల యొక్కయు, కార్మికుల యొక్కయు, ఆర్థికాభివృద్ధికై ప్రయత్నించుట… తెలంగాణా వ్యవసాయకుల స్థితి చాలా ఘోరముగానున్నది… రైతు నష్టము పొంది అప్పులపాలై దినదినము క్షీణించుచున్నాడు. అట్టి రైతుల … యిబ్బందులను తొలగించుటలో సర్వదా తోడ్పడుచుండును… తెలంగాణలోని కార్మికులు (అనగా వివిధ వృత్తులవారును, కూలినాలి చేసి బ్రతుకువారును) తమ కష్టమునకు తగినంత ప్రతిఫలము పొందుటలేదు…. వెట్టి చాకిరీ విశేషముగా తీసికొనబడుచున్నది… వారినుద్ధరించుటకై ఈ పక్షము పాటుపడుచుండును”.
5. “అయిదవ యాశయము దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించుట … తెలంగాణాలో ప్రాచీనము నుండియు అనేక చేతి పరిశ్రమలు వృద్ధినొందుచు… అట్టి పరిశ్రమలు విదేశీయుల నుండి దిగుమతియగు అగ్గువగు సరుకుల చేతను క్షీణించిపోయి యున్నవి.

ఆలంపూరు జంపఖానాలు, నవారు పట్టెలును, ఓరుగల్లు తివాసీలును, పెంబర్తి లోహము పనులను కోరుట్ల కాగితములను, దేవకదిరె కంబళ్ళను, గద్వాల చీరలను కోదాటి కొమ్ము పనులను, సిద్దిపేట పట్టుబట్టలను, కరీంనగర్ (చొప్పకట్ల) దుందిగల్ బొమ్మలను మున్నగునట్టివి మూలబడి యున్నవి. వీటిని పునరుద్ధరించుటలో ప్రోత్సాహం కలిగించును.” ఈ “అభివృద్ధిపక్ష” ప్రణాళికను జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రమహాసభ మితవాదానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక, ప్రజాస్వామిక ప్రణాళిక, ప్రజాపక్ష ప్రణాళిక, తెలంగాణ అస్తిత్వ ప్రణాళిక, తెలంగాణ జాతీయవాద ప్రణాళిక అని అర్థమవుతుంది. కార్మికుల నిర్వచనం కూడా యూరోపియన్ మోడల్‌కు భిన్నంగా భారతీయ వాస్తవికత కనుగుణంగా ఉందని అర్థమవుతుంది.
ఈ ప్రకటనలో అంతర్లీనంగా కనిపించే తెలంగాణ జాతీయతా భావనను అభివృద్ధిపరచి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం ఆగిపోయి ఉండేది. 2014లో మొదలైన తెలంగాణ అభివృద్ధి 1948 లోనే మొదలై ఉండేది. అదట్లా ఉంచి ఈ సభ నుంచి సురవరం క్రమక్రమంగా ఆంధ్రమహా సభ నుంచి పక్కకు జరిగిండు.

తాజా కలం: తెలంగాణా వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 128వ జయంతి సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం దృష్టికి కొన్ని విషయాలు తేదలచినాను.
1. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు పెడతామని ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయ విభజన పూర్తి కావొస్తున్నందున ఆ హామీని నెరవేర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న.
2. ఇతరుల పేరు మీద రెండు పురస్కారాలు ప్రభుత్వం తరపున ఇస్తున్నారు. తెలంగాణ అస్తిత్వ నిర్మాత సురవరం పేరు మీద పురస్కారం ఇవ్వాల్సిందిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందిమి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న.
3. సురవరం రచనల సర్వస్వాన్ని ప్రచురించడానికి తెలుగు అకాడమీలో గానీ, తెలుగు విశ్వవిద్యాలయంలో గానీ ఒక పరిశోధనా పీఠాన్ని ఏర్పాటు చేయించాల్సింది గా మనవి చేస్తున్న.

డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి
9885682572

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News