Monday, April 29, 2024

విలియమ్సన్ కెప్టెన్సీ అదుర్స్.. ఐసిసి టోర్నీల్లో అదరగొడుతున్న కివీస్

- Advertisement -
- Advertisement -

T20 World Cup: NZ vs AUS Final Match on Nov 14

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ తాను ఎంత ప్రమాదకర జట్టో మరోసారి చాటింది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి ప్రకంపనలు సృష్టించింది. అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో కూడా ట్రోఫీని సొంతం చేసుకుంది. తాజాగా పొట్టి ప్రపంచకప్‌లోనూ ఫైనల్‌కు చేరి తనకు ఎదురులేదని నిరూపించింది. అంచనాలను తారుమారు చేస్తూ ఐసిసి టోర్నమెంట్‌లలో కివీస్ అత్యంత నిలకడైన ప్రదర్శన చేస్తోంది. వరుసగా నాలుగు ప్రపంచ టోర్నమెంట్‌లలో ఫైనల్‌కు చేరడం అనుకున్నంత తేలికేం కాదు. గతంలో వెస్టిండీస్ మాత్రమే ఇలా నిలకడగా మూడు సార్లు ఐసిసి టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం న్యూజిలాండ్ కూడా ఇలాంటి ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో అత్యంత అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంటోంది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో రెండు సార్లు ఫైనల్‌కు చేరినా కివీస్ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించక పోవడం పెద్ద లోటుగానే చెప్పొచ్చు. ఇక టి20 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరింది.
అతని కెప్టెన్సీ వల్లే..
ఇక కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేస్తున్న జట్లలో న్యూజిలాండ్‌దే అగ్రస్థానం. కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా ఐసిసి టోర్నీల్లో అయితే అసాధారణ ఆటతో చెలరేగిపోతోంది. పెద్ద పెద్ద జట్లను సయితం అలవోకగా ఓడిస్తూ ముందుకు దూసుకుపోతోంది. కిందటి వన్డే వరల్డ్‌కప్‌లో కివీస్ తృటిలో ట్రోఫీని సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. అంపైర్లు తీసుకున్న పొరపాటు నిర్ణయాల వల్ల కివీస్ ట్రోఫీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసిసి చాంపియన్‌షిప్ ఫైనల్లో విజేతగా నిలువడం ద్వారా తన ఖాతాలో తొలి ఐసిసి ట్రోఫీని జమ చేసుకుంది. ఫైనల్లో బలమైన టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఇక యుఎఇ వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో కూడా వరుస విజయాలతో ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. ఒక మ్యాచ్‌లో గెలిస్తే తన ఖాతాలో తొలి ప్రపంచకప్ ట్రోఫీని జత చేసుకుంటోంది. న్యూజిలాండ్ విజయాల్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ పాత్ర వెలకట్టలేనిది. జట్టును ముందుండి నడిపించడంలో కేన్‌కు ఎవరూ సాటిరారు.

సహచరుల్లో విజయకాంక్షను రేకెత్తిస్తూ వారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడు. ఇక కెప్టెన్ అందించిన స్ఫూర్తితో క్రికెటర్లు సయితం చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం న్యూజిలాండ్‌దే హవా నడుస్తోంది. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకొంది. ఇక ఆదివారం జరిగే టి20 ప్రపంచకప్ ఫైనల్లో కూడా గెలిచి సరికొత్త ఆధ్యాయానికి తెరలేపాలని తహతహలాడుతోంది. మార్టిన్ గుప్టిల్, కాన్వే, మిఛెల్, విలియమ్సన్, ఫిలిప్స్, నీషమ్‌లు బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్నారు. ఇక, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి, ఐష్ సోధి, సాంట్నార్‌లతో బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. దీనికి తోడు జట్టులోని ఆటగాళ్ల మధ్య అద్భుత సమన్వయం ఉంది. ఇన్ని లక్షణాలు ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా ఎదిగింది.

T20 World Cup: NZ vs AUS Final Match on Nov 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News