Thursday, May 9, 2024

తాలిబన్ల రాక్షసం.. బగాన్ లోయలో గాయకుడి వధ

- Advertisement -
- Advertisement -

Taliban kill Afghan folk singer

బగ్లాన్ /కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయిన పులులుగా పంజాలు విసురుతూ రక్తదాహం తీర్చుకుంటున్నారు. దేశ ఈశాన్యపు బగాన్ ప్రాంతానికి చెందిన పేరొందిన జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని దారుణంగా చంపివేశారు. తాలిబన్లు రెండోసారి అధికారం చేజిక్కుంచుకున్న దశలో దేశపు కొండప్రాంతాలు మరింతగా కల్లోలస్థితికి చేరుకున్నాయి. ఈశాన్యపు అందరాబీ లోయలోని కిషన్‌బాద్ గ్రామంలో తన ఇంట్లో ఉన్న పెద్ద వయస్కుడైన ఫవాద్‌ను ఇంటివారు ఎంతగా వేడుకున్నా వీడకుండా తాలిబన్లు బయటకు ఈడ్చుకువచ్చారని తరువాత అతి సమీపం నుంచి తూటాలు పేల్చడంతో రక్తమోడుతూ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.

దేశ కొండలు లోయల ప్రాంతాలలో పలు చోట్ల తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్ ఫైటర్ ఒకరు ఈ జానపద గాయకుడిని చంపివేసినట్లు వెల్లడైంది. శుక్రవారం గాయకుడిని దారుణంగా అంతమొందించిన విషయం రెండు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. ఘటనాప్రాంతం కాబూల్‌కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాలిబన్ల అధికార క్రమం దశలో ఈ లోయ కల్లోలంగా మారింది. ఇప్పటికీ ఈ లోయలోని కొన్ని ప్రాంతాలు స్థానిక సాయుధ యోధుల అధీనంలోనే ఉన్నాయి. వీరు తాలిబన్లకు లొంగేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి పలు లోయలు, కొండ ప్రాంతాలను లక్షంగా ఎంచుకుని తాలిబన్లు దాడులు ఉధృతం చేస్తున్నారు.

చాయ్ తాగి వెళ్లారు ప్రాణాలు తీశారు

తన తండ్రి అమాయకుడని, ఏ పాపం తెలియదని, ఘటనకు ఒక్కరోజు ముందు తాలిబన్లు ఇంటికి వచ్చారని, ఇల్లంతా వెతికారని, తరువాత తండ్రితో కలిసి టీ తాగి వెళ్లారని, ఇప్పుడు పొట్టన పెట్టుకున్నారని ఈ గాయకుడి కుమారుడు జావదఖ అందరాబి తెలిపారు. తన పాటలతో కచెరీతో ప్రజలకు ఆనందం కల్గిస్తూ వస్తున్నాడని, అంతకు మించి ఆయనకు ఏమీ తెలియదని వాపొయ్యారు. ఇంటినుంచి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లి తరువాత అక్కడి పొలంలో పడేసి తలలో తూటాలు పేల్చారని , తనకు న్యాయం దక్కాలని కుమారుడు కోరారు. తన తండ్రిని చంపిన వారిని శిక్షించడం జరుగుతుందని స్థానిక తాలిబన్ల మండలి తనకు మాట ఇచ్చిందన్నారు. గాయకుడి దారుణ హత్య ఘటనపై తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందించారు. దీనిపై తాము పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు.

వివరాలు వెలువరించలేదు. లోయనే తన సంగీత కచేరీకి వేదికగా చేసుకుని గాయకుడు అందరాబీ పలు సార్లు స్థానికుల కోసం జానపద గీతాలు ఆలాపించేవాడు. ప్రత్యేకమైన వాయిద్య పరికరం గిచాక్ మోగిస్తూ పాటలు పాడేవారు. తన అందమైన లోయ, తన దేశం , తన తాత ముత్తాతల ఊరు బతుకులోనూ చావులోనూ వదిలేది లేదంటూ అక్కడి లోయలు జలపాతాల నేపథ్యంలో ఆయన పాడిన పాటలు విదేశాలలో కూడా మార్మోగుతున్నాయి. అయితే తనది ఎల్లలు దాటని పాట అని చెపుతూ , వారసత్వ సాంప్రదాయక పరిరక్షణకే పాట బాట పట్టానని పలు సార్లు ఈ గాయకుడు చెప్పేవారు. ఇటువంటి గాయకుడి హత్య దారుణం అని ఐరాసకు చెందిన సాంస్కృతిక హక్కుల ప్రత్యేకదూత కరిమా బోనౌనె ఆవేదన వ్యక్తం చేశారు. అమ్నెస్టీ ఇంటర్నెషనల్ సెక్రెటరీ జనరల్ అగ్నెస్ కాలామార్డ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

దేశంలో గానంవాయిద్యంపై నిషేధం

ఇప్పుడు దేశాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు మునుపటి లాగానే పలు తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. గత వారం వెలువరించిన నిబంధనలలో దేశంలో సంగీతంవిన్పించరాదని ఆదేశించారు. పెళ్లికాని ఆడవారి వెంబడి విధిగా ప్రయాణ సమయాలలో పెద్దవారైన ఆడవారు ఉండాని , ఒంటరిగా వారు బయట తిరగరాదని నిర్ధేశించారు. . ఇస్లాంలో సంగీతానికి స్థానం లేదని తాలిబన్ల ప్రతినిధి జబినుల్లా ముజాహిద్ తెలిపారు. పాటలు పాడవద్దని, సంగీత వాయిద్యాలు మోగించవద్దని తాము ప్రజలను కోరుతామని, బలవంతం చేయబోమని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News