Saturday, April 27, 2024

దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

తౌక్టే తుపాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన గోవా, కేరళ, కర్నాటకలలో అప్పుడే కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లోను శనివారం రాత్రినుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోవాలో అనేక ప్రాంతాల్లో పెనుగాలుల తాకిడికి విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల చెట్లు విరిగి పడి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపోయాయి. మహారాష్ట్రనుంచి గోవాకు విద్యుత్ తీసుకు వచ్చే 220కెవి లైన్లు సైతం దెబ్బతిన్నాయని రాష్ట్ర విద్యుత్ మంత్రి నీలేష్ కాబ్రాల్ తెలిపారు. విద్యుత్ లైన్లపై పడిన చెట్లను తొలగించేందకు తమ సిబ్బంది శనివారం రాత్రినుంచి శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు వార్తలు రాలేదని ఆయన తెలిపారు. తుపాను ప్రభావంతో కేరళలోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ విభాగం చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఉత్తర కేరళ జిల్లాలైన మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉంది. అళప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాల్లోను ప్రభావం కనిపించింది. తీరప్రాంతాల్లో సముద్రం ఆకస్మికంగా ముందుకు చొచ్చుకు రావడంతో జనజీవనం స్తంభించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపడ్డంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అటంకం ఏర్పడింది. ప్రధాన నదులైన మీనాచిల్, అచన్‌కోవిల్, మణిమాలల్లో నీటిప్రవాహం పెరుగుతోంది. ఇడుక్కి జిల్లాలోని కల్లార్‌కుట్టి, మాలాంకర, భూతథంతెట్టు, పథనంతిట్ట జిల్లాలోని మణియార్ ఆనకట్టల గేట్లు ఎత్తివేశారు. చెట్లు విరిగి ఇళ్లు, వాహనాలపై పడడంతో ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌వత్తవాడ మార్గంలో చాలా సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కర్నాటకలోని మల్నాడ్ తీరప్రాంత జిల్లాల్లో తౌక్టే తుపాను బీభత్సం సృషిస్తోంది.

దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, కొడగు, శివమొగ్గ, చిక్‌మగళూరు జిల్లాల్లోని 17 తాలూకాలు, 73 గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. ఆదివారం ఉదయంనుంచి ఈ ప్రాంతాల్లో బారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు నలుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కన్నడ జిల్లాల్లో తన బోటును కట్టేయడానికి వెళ్లిన ఒక జాలరి మరో బోటు ఢీకొనడంతో మృతి చెందాడు, ఉడుపి జిల్లా విద్యుదాఘాతంతో ఒకరు, చిక్‌మగళూరు జిల్లాలో ఇల్లు కూలి ఒకరు, శివమొగ్గ జిల్లాలో పిడుగు పడి మరొకరు చనిపోయారు. ఇప్పటివరకు 318 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.112 ఇళ్లు, 139 విద్యుత్‌స్తంభాలు, 22 ట్రాన్స్‌ఫారాలు, 4 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని తీరప్రాంత జిల్లాల ఇన్‌చార్జి మంత్రులను, డిప్యూటీ కమిషనర్లను ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప ఆదేశించారు. తుపాను కారణంగా ముంబయి నగరానికి సోమవారం వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తుపాను ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో అమిత్ షా సమీక్ష
తౌక్టే తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్ష చేపట్టారు. వర్చువల్‌గా సిఎంలతో సమావేశమై తుపాను ప్రభావం, అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.

Tauktae Cyclone: 6 dead due to Heavy Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News