Monday, April 29, 2024

ఫేవరెట్‌గా ‘టీమిండియా’

- Advertisement -
- Advertisement -

Team India looks to be Favorites in Test series against England

 

చెన్నై : సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో ఆతిథ్య టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ గెలుపుతో సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులో చేరడంతో సహచరుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సిరీస్‌లో గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో టీమిండియా చారిత్రక ప్రదర్శనతో ఆకట్టుకుంది.

ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన ఘనతను భారత్ దక్కించుకుంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. సీనియర్ బౌలర్లు ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రిత్ బుమ్రాలు మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇక నటరాజన్, సిరాజ్, శార్దూల్, సుందర్ వంటి యువ బౌలర్లు ఉండనే ఉన్నారు. మరోవైపు కోహ్లి రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, కెఎల్.రాహుల్‌లతో పాటు సీనియర్లు చటేశ్వర్ పుజరా, అజింక్య రహానెలు ఉండనే ఉన్నారు. ఇలా రెండు విభాగాల్లోనూ చాలా పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

అయితే ఇంగ్లండ్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. ఆ జట్టులో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ జోరూట్ జోరుమీదున్నాడు. అండర్సన్, బ్రాడ్‌ల రూపంలో అగ్రశ్రేణి బౌలర్లు ఉండనే ఉన్నారు. ఇక జోస్ బట్లర్, డొమినిక్ సిబ్లి, లారెన్స్, మోయిన్ అలీ, బెన్‌స్టోక్స్ తదితరులతో బ్యాటింగ్ కూడా చాలా బలంగా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మరో ఆసక్తికర సిరీస్ కొనసాగడం ఖాయమని చెప్పాలి. ఇక భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి రెండు టెస్టులకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి టెస్టు ఫిబ్రవరి ఐదు నుంచి జరుగనుంది. టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లండ్ ఐదు టి20లు, మరో మూడు వన్డే మ్యాచుల్లో భారత్‌తో తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News