Friday, April 26, 2024

గండం గడువలే

- Advertisement -
- Advertisement -

cm kcr

 

కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n లాక్‌డౌన్, కర్ఫూలు
తప్పదు n కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత కరోనా ఫ్రీ n అవసరానికి మించి
30శాతం డాక్టర్లు, సిబ్బంది నియామకం n మన నియంత్రణ చర్యలకు అంతర్జాతీ
యంగా ప్రశంసలు n పంటల కొనుగోళ్లకు రూ.30వేల కోట్లు n వచ్చే నెల 1 నుంచి మే
15 వరకు గ్రామాల్లోనే కొనుగోళ్లు n ప్రతి గింజ కొంటాం.. రైతులు బెంగటిల్లొదు
n కూపన్ల తేదీల్లోనే ధాన్యం కొంటాం n కోటి 5లక్షల టన్నుల ధాన్యం, 14లక్షల
టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేస్తాం n ఒకట్రెండు రోజుల్లో 12కేజీల బియ్యం,
రూ.1500నగదు పంపిణీ n వలస కూలీలకు బియ్యం, ఒక్కొక్కరికి రూ.500నగదు
n హైదరాబాద్‌లో 500 కేంద్రాల్లో పండ్ల విక్రయం n గ్రామాల్లో కంచెలు తీసి
గంగాళాలు, సబ్బులు పెట్టండి – జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తరువాత
మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఏదీ ఏమైనా కరోనాపై యుద్ధం చేద్దామని, ప్రజలు సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ వైరస్ ఎప్పుడు విస్ఫోటనంలా విజృంభిస్తాదో తెలియదని, అంతా సర్దుకునే వరకు, గండం గట్టేక్కే వరకు ప్రజలు స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలితో అలమటించొద్దన్నారు. ఇతర రాష్ట్రాల కూలీలను తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్ పార్టనర్స్‌గా చూస్తామని వారికి ఒక్కొక్కరికి రూ.500, 12 కిలోల బియ్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు రూ.1500 బ్యాంకు ఖాతాకు రెండు, మూడు రోజుల్లో జమ చేస్తామన్నారు. నియంత్రిత విధానంలో కూపన్‌లో ఇచ్చే తేదీ ఆధారంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకురావాలని, కిలో లేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తరువాత సిఎం ప్రగతి భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కరోనా నెగిటివ్ వచ్చిన 11 మందిని సోమవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు సిఎం వెల్లడించారు. వైరస్ ఉందా, లేదా అని అన్నీ విధాలుగా చెక్ చేసిన తరువాత ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 70గా ఉందని, ఇందులో ఒకరు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఆ వ్యక్తితో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడారన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులతో పాటు డాక్టర్లు బాగా చూసుకున్నారని చెప్పారన్నారు. ప్రస్తుతం 58 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని, ఒక ఆయన 76 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కొంత క్రిటికల్‌గా ఉన్నారని, మిగతా అందరూ కోలుకున్నట్లు తెలిపారు. రేపు, ఎల్లుండి కొద్దిమంది డిశ్చార్జ్ అవుతారన్నారు. మొత్తంగా విదేశాల నుంచి కరోనా మోసుకొచ్చిన వారు, అనుమానితులు, వైరస్ భారీన పడిన వారు 25,937 మంది వైద్యులు, అధికారుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు.

ఇందులో చాలా మంది క్వారంటైన్ సమయం త్వరలోనే పూర్తవుతోందన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో 5744 టీమ్స్ పర్యవేక్షిస్తున్నాయని వివరించారు. ఎవరికైనా లక్షణాలు సీరియస్‌గా ఉంటే హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారని తెలిపారు. 14రోజుల క్వారంటైన్ విడతల వారీగా ఏప్రిల్ 7వ తేదీ వరకు దాదాపుగా అందరికీ ముగుస్తుందన్నారు. ఆ తరువాత కొంత సమస్య తీవ్రత తగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. కొత్త కేసులు వచ్చి చేరకపోతే, రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన వ్యక్తులు ఉండరని వ్యాఖ్యానించా రు. కొత్త కేసులు రావొద్దని ఆశిద్ధామన్నారు. దిక్కుమాలిన తప్పుడు ప్రచారాలు చేసే వారికి కరోనా రావాలని శాపం పెడుతున్నట్లు చెప్పారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

అత్యంత విపత్కర పరిస్థితి
ధాన్యం కొనేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. రెవిన్యూ పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామా లేదా అనే పరిస్థితి. ఒ.డి రూ.12 వేల కోట్లు ఆర్‌బిఐని అడిగే అవకాశం ఉందని సిఎం పేర్కొన్నారు. అన్నీ బంద్ ఉన్నాయి. పెద్ద లాస్ మొదటికే మోసంలా ఉందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.. ఎంఎల్‌ఎలకు జీతాలు కూడా బంద్ పెట్టాల్సి వస్తది. ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైతే కోత విధిస్తాం. ఇదీ సుఖవంతమైన సమయం కాదు. తప్పదు. రెండు నెలలో, మూడు నెలలో, నాలుగు నెలలో కుదుట పడే వరకు నియంత్రించుకోవాల్సిందేనన్నారు. కఠిన పరిస్థితుల్లోనూ పౌరసరఫరాల శాఖకు రూ.25 వేల కోట్లకు ఉమ్మడి ఎపిలో కూడా లేదు.. చరిత్రలో లేని విధంగా ప్రభుత్వం సమకూర్చిందన్నారు. అలాగే మార్క్‌ఫెడ్‌కు రూ.3200 కోట్లు మొక్కజొన్న కొనుగోళ్లకు బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నట్లు తెలిపారు. ఫైళ్లపై సంతకాలు చేసినట్లు చెప్పారు.

రైతులు క్రమశిక్షణ, నియంత్రణ పాటించాలి. నియంత్రిత విధానంలో పంటను తీసుకురావాలి. కూపన్లు ఇస్తారు. ఇచ్చిన తేదీకి అనుగుణంగా మార్కెట్ రావాలి. ముందు వస్తే వెళ్లగొడుతారన్నారు. ఒకటే మాట చెబుతున్నా.. ఒక్క కిలో వడ్లు లేకుండా ప్రభుత్వమే కొంటదన్నారు. ఈ కొవిడ్ 19కు మందు లేదని స్వీయ నియంత్రణ, గుంపులగా గుమికూడకపోవడం, లాక్‌డౌన్‌కు సంపూర్ణంగా సహకరించడం ఒక్కటే ఆయుధమన్నారు. గండం గట్టేక్కే వరకు నిబంధలు ఖచ్చితంగా పాటించాలని, ప్రజలు కూడా మంచిగా సహకరిస్తున్నారని సిఎం తెలిపారు. హైదరాబాద్, రాష్ట్రం, దేశం, ప్రపంచం కర్ఫూ ఉందన్నారు. చాలా డేంజరస్ పొజిషన్ భవిష్యత్‌లో చూస్తామో లేదో.. రావొద్దని కోరుకుందామన్నారు.

దేశ లాక్‌డౌన్‌ను విదేశీ పత్రికలు మెచ్చుకున్నాయ్
ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మెడికల్ సైంటిస్టులు, పత్రికలు దేశం తీసుకున్న ముందస్తు చర్యలు లాక్‌డౌన్‌ను మెచ్చుకున్నాయని సిఎం తెలిపారు. భారత్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమని, వైద్య సదుపాయాలు అంతగా లేవన్నారు. ఏకైక ఆయుధం ఏకైక లాక్‌డౌన్ చేయడం మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిని కరెక్ట్‌గా వినియోగించారని పలువురు పేర్కొంటున్నారని తెలిపారు. భగవంతుని దయ వల్ల బయటపడాలని కెసిఆర్ ఆకాంక్షించారు. సౌత్ కొరియాలో ఒకే ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని, ఆయనకు జబ్బు సోకినట్లు తెలియకుండా మొత్తం 59 వేల మందికి వచ్చిందన్నారు. ఒక్క సూదిమొన మీద కొన్ని లక్షల క్రిములు ఉంటాయని, ఇది చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవడమే తెలివైన పనిగా చెప్పారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నారని, మరింత పరిశీలన చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలిపారు.

ప్రభుత్వమే కొంటది
తెలంగాణలో 55 లక్షల పైచిలుకు పంటలు పండుతున్నాయని సిఎం తెలిపారు. 45.40 లక్షల ఎకరాల్లో వరి సాగువుతోందని, కోటి ఐదుల లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే మొక్కజొన్న 14 న్నర లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒక్క గింజ కూడా బయట అమ్ముకోవద్దని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మొక్కజొన్న కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.3200 కోట్లు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇచ్చిందన్నారు. కూపన్‌లో ఇచ్చిన తేదీ ఆధారంగా పంట తీసుకురావాలని, ఆన్‌లైన్‌లో డబ్బులు వేస్తామన్నారు. రైతులకు ఆందోళన అవసరం లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. మనల్ని మనం రక్షించుకునేందుకు, అన్నీ మార్కెట్ యార్డులు బంద్ చేసామని, మార్కెటింగ్ సిబ్బంది మొత్తం ఊర్లలోనే ఉంటారన్నారు. ఈసారి మొత్తం ధాన్యం గ్రామాల్లోనే కొంటామని తెలిపారు. మార్కెట్‌లు అయితే వందలు, వేల సంఖ్యలో వస్తరని అది ప్రమాదం కనుకనే అందుకే షట్‌డౌన్ చేశామన్నారు.

రైతులకు ఆతురత వద్దు
జిల్లా వ్యవసాయాధికారి, మార్కెటింగ్ అధికారి, పౌరసరఫరాల అధికారి జిల్లాల్లో, మండల వ్యవసాయాధికారి అధ్యక్షతన ఎఇఒ, రైతుబంధు సమితులు, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులతో మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం తెలిపారు. రైస్ మిల్లర్లు, వ్యాపారుస్తులు ధాన్యం కొంటా అంటే రానివ్వాలని, అయితే కనీస మద్ధతు ధర ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రైస్ మిల్లరతో సోమవారం సమావేశం పెట్టామని, వాళ్లకు కూడా విధివిధానాలు చెబుతామన్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య కూడా పెంచామని, రైతులు ఆతురత పడొద్దని తెలిపారు. దాదాపు నెల 15 రోజులు ధాన్యం కొంటామని, ఏఫ్రిల్ మొదటి వారం నుంచి మే 15 వరకు కొనున్నట్లు తెలిపారు. రైతులు పాసుబుక్, బ్యాంకు అకౌంట్ నెంబర్ తీసుకురావాలని సూచించారు. ఎయిఒలు కూపన్‌లు పంపిణీలో ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. కొనుగోళ్ల కేంద్రాల వద్ద మూడు ఫీట్ల సామాజిక దూరం పాటించాలని, గత్తర చేస్తం అంటే కుదరదన్నారు. నా నియోజకవర్గంలోనే క్వింటా మొక్కజొన్న రూ.800లకు కొంటా అంటే రైతు వెనక్కి పోయిండు. ఆగుమని చెప్పినా కిలో లేకుండా కొంటామన్నారు.

పట్టణాల కంటే గ్రామాల్లో ఎక్కువ క్రమశిక్షణ
పట్టణాల కంటే గ్రామాల్లో ఎక్కువ క్రమశిక్షణ పాటిస్తున్నారని సిఎం పేర్కొన్నారు. ఇంట్లో ఆడవాళ్లు బయటకు ఎందుకు పోతున్నారని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో బీమారు లేదన్నారు. అయితే వరికోత మిషన్లకు వాడే ట్రాక్టర్లను పని అయిపోయాక కిందకు దించుతారని వాటిని ఎక్కించే మనుషులు రాష్ట్రంలో పలు టౌన్‌లలో ఉన్నారన్నారు. ఆ టీమ్స్ అందరికీ పోలీసులు ప్రత్యేక పాసులు ఇస్తారని గ్రామాలకు వచ్చి ట్రాక్టర్ ఎక్కించాలని తెలిపారు. రాష్ట్రంలో హార్వెస్టర్లు ఒక ఐదువేలు ఉన్నాయని, పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి 1500 మిషన్లు వస్తాయన్నారు. హార్వెస్టర్లకు అవసరమైన స్పేర్ పార్టుల దుకాణాలు తెరిపిస్తామని, దొరకకపోతే సిఎస్‌కు ఫోన్ చేస్తే పంపించే ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో కరోనా రాకుండా అడ్డు రాళ్లు పెట్టుకున్నారని అవసరాల రీత్యా వాటిని తీసేయ్యాలని సిఎం సూచించారు. అయితే అదే స్థానంలో చేతులు, కాళ్లు కడుకునేలా గోళం , సబ్బులు, శానిటైజర్‌లు పెట్టాలని అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకురావాలన్నారు.

బిహార్ హమాలీలను తీసుకొస్తాం
తెలంగాణ రైస్ మిల్లర్లలో బీహార్ హామాలీ వాళ్లు ఎక్కువగా పనిచేస్తారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అయితే వాళ్లు హోళీకి వెళ్లిపోతారని, కోతల సమయంలో వస్తారని అయితే లాక్‌డౌన్‌తో అక్కడే ఉండిపోయారన్నారు. ఇక్కడ కొద్దిమంది మాత్రమే మిగిలిపోయారన్నారు. వాళ్లు కొనుగోళ్లు చేపట్టి, ఎఫ్‌సిఐ గోడౌన్‌కు పంపిస్తారన్నారు. అయితే కేంద్రంతో, బీహార్ సిఎస్‌తో మన సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతున్నారని, స్పెషల్ ట్రైన్‌లు పెట్టాలా, వారిని ఎలా తీసుకురావాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

75 లక్షల గోనె సంచులు అవసరం
వరి ధాన్యం సేకరణకు 70 లక్షల నుంచి 75 లక్షల గోనె సంచుల అవసరం ఉందన్నారు. ఇవి పశ్చిమ బెంగాల్ నుంచి వస్తాయన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 35 లక్షల బ్యాగులు ఉన్నాయని, ఇంకో 35 లక్షలు కావాల్సి ఉందన్నారు. నానా కష్టాలు పడి దేశం నలుమూలల నుంచి ఎలాగైనా తెప్పించాలని, కష్టపడి తెస్తామన్నారు.

అన్నీ మున్సిపాలిటీలకు బత్తాయిలు
రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే సి విటమిన్ పండ్లు అన్ని మున్సిపాలిటీలకు కూరగాయల మార్కెట్‌లు ఉండే చోట్లకు బత్తాయి, నిమ్మ, సంత్రాలు, దానిమ్మ, పండిన కాడికి మనది మనమే తిందాం. అందే విధంగా రైతులకు పాస్‌లిచ్చింది. అనుమతి ఇస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన నిత్యావసరాలు, వెళ్లాల్సినవి అనుమతించాలి. ఖాళీ బండ్లు కూడా అనుమతించాలని సిఎం వ్యాఖ్యానించారు. 500 సెంటర్లలో హైదరాబాద్‌లో కూరగాయలు, పండ్లు అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చూడాలని మార్కెటింగ్ శాఖ సంచాకులకు చెప్పామన్నారు.

ఇతర రాష్ట్రాల కూలీలు 3.35 లక్షల మంది
రాష్ట్రంలో దాదాపు 12,436 టీమ్‌లతో 3.35 లక్షల మంది బయట రాష్ట్రాల కూలీలు ఉన్నారని సిఎం చెప్పారు. జార్ఖండ్, ఒరిస్సా, బిహార్, తమిళనాడు వాళ్లు ఎక్కువగా ఉన్నారని, వారంతా ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, పెద్దపల్లి, రామగుండంలలో ఉన్నట్లు తెలిపారు. వీరందరికీ 12 కిలోలు, రూ.500 చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరూ వచ్చిన కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి. ఖర్చుకు వెనకాడకుండా షెల్టర్, మంచినీటి వసతి, భోజనం, మెడికల్ కేర్ తీసుకోవాలన్నారు.

వైద్యులు.. నర్సుల పూల్
సిఎస్ వైద్యులు, నర్సుల కోసం ఒక అడ్వడైజ్‌మెంట్ కూడా ఇచ్చారని, డాక్టర్, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ పూల్ పెట్టుకుంటున్నట్లు సిఎం వివరించారు. వారి సేవలను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటామన్నారు. 60 సంవత్సరాలలోపు ఉన్నవారందరూ అర్హులేన్నారు. మెడికల్ గ్రాడ్యుయేట్స్, రిటైర్డ్ వారిని తీసుకుంటామని, సేవా భావం కలిగి ఉండాలన్నారు.

అంతకు వందరెట్లు అనుభవిస్తరు
కొంతమంది దొంగలు తప్పుడు, దిక్కుమాలిన ప్రచారాలు చేస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు దొరుకుతారని, వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. సోషల్ మీడియా కావొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. ఎంత చేస్తారో అంతకు వందరెట్లు అనుభవిస్తరన్నారు. దిక్కుమాలిన ప్రచారాలు, ఏం ఆశించి చేస్తున్నారో అలాంటి వారికి కరోనా సోకాలని శాపం పెడుతున్నా అన్నారు. శాంతంగా ఉండే ప్రజలను మానసికంగా వేధించడం సరికాదన్నారు. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ రిస్క్ తీసుకుని పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏదీ దాచిపెట్టలేదు. చనిపోయినా శవాన్ని టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. మన కంట్రోల్‌లో చనిపోలేదు. అయినా అపలేదు. ఒకవేళ కంట్రోల్ తప్పితే మేమే హెచ్చరిస్తాం. జాగ్రత్తలు చెబుతామన్నారు.

తొందరగా బయటపడాలని ప్రార్థిస్తున్నా
రాష్ట్రం, దేశం స్థిమిత పడాలని అప్పుడే అన్నీ సర్దుకుంటాయని కెసిఆర్ తెలిపారు. ఏదీ ఉన్నా దయచేసి తొందరగా బయటపడాలని, అందరికంటే ఎక్వుకగా దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు. ట్రాన్స్‌మిషన్‌లో భాగంగా కొత్తగూడెం దగ్గర నుంచి 200 మంది తీసుకొచ్చారని, వాళ్లు ఆంధ్ర కూడా పోయొచ్చారు. అక్కడ ప్రభత్వానికి చెప్పినట్లు తెలిపారు. బియ్యం పంపిణీపై మాట్లాడుతూ ఏ ప్రభుత్వం ఇస్తే ఏముంది. చిల్లర రాజకీయాలు వద్దు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వంతు వారు చేస్తారని వ్యాఖ్యానించారు. అవసరాన్ని బట్టి పిఎంతో మాట్లాడుతా.. అన్నీ చెబుతారా అని ప్రశ్నించారు. తమిళనాడులో సునామీ వచ్చింది. నాకు ఎవరూ చెప్పలేదు. సుమోటోగా నిర్ణయం తీసుకుని రెండు ప్రత్యేక విమానాలు పెట్టి, 300 స్పెషల్ డాక్టర్లను పెట్టి విలువైన మందులు పంపినట్లు గుర్తు చేశారు. బయోమెట్రిక్ లేకుండానే బియ్యం సరఫరా చేసుకోండి. అక్కడా కూడా దొంగతనం చేస్తామంటే వాళ్లకు కూడా కరోనా వస్తదన్నారు.

క్వారంటైన్ ముగుస్తుందిలా..

తేదీ                              వ్యక్తుల సంఖ్య
మార్చి 30                         1899
మార్చి 31                         1440
ఏప్రిల్ 01                          1460
ఏప్రిల్ 02                          1887
ఏప్రిల్ 03                          1476
ఏప్రిల్ 04                          1453
ఏప్రిల్ 05                          914
ఏప్రిల్ 06                          454
ఏప్రిల్ 07                          394

Telangana corona free after April 7
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News