Wednesday, May 15, 2024

అన్నదాత వర్షాతిరేకం

- Advertisement -
- Advertisement -

సమయానికి కురుస్తున్న వానలతో చకచకా సాగు పనులు
టైమ్‌కు రైతుబంధు, రైతులు, కూలీలకు చేతినిండా పని
ఎవుసం వైపు కరోనాతో పల్లెను చేరిన పట్నం వాసులు
గ్రామాల్లో సరికొత్త వ్యవసాయ సందడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జోరుగా ఎవుసం పనులు సాగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతుల ఆనందంతో సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఒకవైపు వరినాట్లు పడుతుండగా, మరోవైపు చెలకలో వేసుకున్న పత్తి, కంది చేనులలో కలుపును తీయిస్తూ ఎరువులు వేసుస్తున్నారు. కొన్నిచోట్ల జోడెడ్లతో గుంటుక కొడుతున్నారు. కరోనా కారణంగా పట్టణాల్లో పనులు కొంత మందకొడిగా సాగుతున్నా పల్లెల్లో మాత్రం ఎవుసం పని మస్త్‌గా ఉందని రైతులు పేర్కొంటున్నారు. సమయానికి చేతికి రైతుబంధు పెట్టుబడి సాయం అందడంతో అన్నదాతలు అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి కూడా తప్పింది. హైదరాబాద్‌లో కరోనా విజృంభణ కొనసాగడంతో అక్కడి నుంచి గ్రామాలకు చేరిన వారికి కూడా చేతినిండా పనిదొరుకుతోంది. చదువుకునే కాలేజీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులతో పాటు నగరంలో వ్యాపార సంస్థలలో పనిచేసిన ఉద్యోగులు కూడా వ్యవసాయ పనుల కు వెళ్తున్నారు. పత్తి పంటలకు ఎరువు వేసేందుకు, పురుగు మందులు కొట్టేందుకు వెళ్తున్నారు.

వరి పొలాలను సిద్ధం చేసేందుకు కూడా కూలీలను మాట్లాడుకుంటున్నారు. అలాగే కొందరు తమ సొంత భూముల్లో సాగును ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత సాగులో భాగంగా కందులు, పత్తి, వరి వేసుకుంటున్నారు. కొందరు కొత్తగా బోర్లు వేయించి మరీ పొలాలను అచ్చు కడుతున్నారు. కోటి 25 లక్షల ఎకరాల నియంత్రిత ప్రతిపాదిత సాగు లక్షం చాలా సులువుగా చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 80 లక్షల ఎకరాల విస్తీర్ణం సాగు నమోదైంది. అయితే నియంత్రిత సాగు ప్రకారం వరి సాగు మాత్రం 41.76 లక్షల ఎకరాల కంటే ఎక్కువే అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘మన తెలంగాణ’తో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో ముందుగానే వాస్తవ పరిస్థితులను అంచనా వేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే కార్యక్రమాలకు ప్రాధన్యత ఇచ్చారు. అందులో భాగంగానే పంట ఉత్పత్తులను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంతో పాటు రైతుబంధు పెట్టుబడి సాయం దాదాపు రూ.7200 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా పంటలు ఆనందంగా పంటలు సాగు చేసుకుంటున్నారని టిఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు.

‘నాకు ఏడు ఎకరాల పొలం ఉంది. గవర్నమెంటు నుంచి రైతుబంధు పైసలు వచ్చినయ్. సిఎం సారు చెప్పినట్లు కంది రెండు ఎకరాలు, పత్తి మూడు ఎకరాలు, రెండు ఎకరాల్లో సన్న వడ్లు వేసినా. ఈసారి అన్ని రేట్లు పెరిగినయి. కూలీలకు పైసలు ఎక్కువనే అయితున్నాయి. అయితే గతం మాదిరి ఈసారి కొరత పెద్దగా లేదు. కరోనా తోటి పట్నంలో ఉండేటోళ్లు చాలా మంది ఊర్లకు వచ్చారు. మగ మనుషులు చేనులకు పురుగు మందులు, వరి పొలాలకు ఓరాలు తీసేందుకు పొతున్నరు.’

సత్యనారాయణ, జనగాం జిల్లా

‘నేను హైదరాబాద్‌లోని ఉప్పల్ ఏరియా పీర్జాదిగూడలో చిన్నపాటి వ్యాపారం నడుపుకునేవాడిని. కరోనా కారణంగా గిరాకీ తగ్గిపోవడంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌ను విడిచి తిరిగి మా ఊరికి రావాల్సి వచ్చింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో మాకున్న మూడెకరాల భూమిని చదును చేసి కొత్తగా పొలం అచ్చుకట్టినం. ఇటీవలే నాట్లేశినం. వరి దిగుబడి మంచిగా వస్తదని అనుకుంటున్న. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాలనుకుంటున్నా’.

– ఇమ్మడి కృష్ణారెడ్డి
   కేశిరెడ్డిపల్లి, జనగామ జిల్లా

‘నెల రోజుల నుంచి వ్యవసాయం పనులకే వెళ్తున్నా. కలుపు తీసేందుకు వెళితే రోజుకు రూ.400 ఇస్తున్నారు. పట్నంలో బతకనికి పోయినోళ్లందరూ ఊర్లకు వచ్చారు. అయినా మస్త్ పని దొరుకుతుంది. ఇంకో నెల, రెండు నెలలు ఎవుసం పనులు ఉంటాయి. ఇళ్లు, పొలం పని తప్పితే ఇంకేం లేదు. పొద్దుగాల 10 గంటల కల్లా పొలాలకు పోతే మళ్లీ రాత్రి 6 గంటలకు వస్తున్నం’.

-ఎ. యాదలక్ష్మీ, యదాద్రి భువనగిరి జిల్లా

 Telangana Farmers busy in Field because of Plenty Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News