Monday, May 6, 2024

మేధావులపై మేకు

- Advertisement -
- Advertisement -

Treason case registered against Shashi Tharoor and Rajdeep Sardesai

 

ఆ ఏడుగురిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ దౌత్యవేత్త శశిథరూర్, మిగతా ఆరుగురు పేరొందిన పాత్రికేయులు, వారిలో ఒకరు అందరికీ తెలిసిన రాజ్‌దీప్ సర్దేశాయ్. వీరందరిపైనా రాజద్రోహం, నేరపూరితమైన బెదిరింపు, శత్రుత్వాలను రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, నేరపూరిత కుట్ర, మత విశ్వాసాలను గాయపర్చడం వంటి నేరారోపణలతో భారత శిక్షాస్మృతి కింద ఐదు రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక అభియోగ పత్రాలు (ఎఫ్‌ఐఆర్‌లు) దాఖలయ్యాయి. ఈ కేసులు బిజెపి పాలిత రాష్ట్రాలైన యుపి, మధ్యప్రదేశ్, కర్నాటకల్లోనూ, న్యూఢిల్లీలోనూ దాఖలు కావడం గమనించవలసిన విషయం. ఢిల్లీలో పోలీసులు నేరుగా కేంద్ర హోమ్ శాఖ అదుపులో ఉంటారు. ఈ రాష్ట్రాలలో దాఖలయిన వ్యక్తిగత ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ కేసులను నమోదు చేశారు. వీటిని పురస్కరించుకొని తమను అరెస్టు చేయకుండా, తమపై పోలీసులు ఎటువంటి దౌర్జన్యానికి దిగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రధాన న్యాయమూర్తి శరద్ ఎ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం ఆ మేరకు మంగళవారం నాడు స్టే విధించింది.

రిపబ్లిక్ టివి అధినేత ఆర్నాబ్ గోస్వామికి పోలీసుల నుంచి రక్షణ కలిగించిన పద్ధతిలోనే వీరి అరెస్టుపైనా స్టే ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇంతటి ప్రముఖులపై ఐదు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకేరకమైన కేసులు దాఖలు కావడం అందులో రాజద్రోహం నేరారోపణ కూడా చోటు చేసుకోడం విశేషించి గమనార్హం. ఈ కేసులకు కారణమైన ఫిర్యాదుదారులు కేవలం దేశహితం కోసమే ఆ పని చేసి ఉంటారని వీటి వెనుక వేరెవరి పాత్ర, ప్రమేయం లేవని అనుకోలేము. రాజ్యాంగం ప్రసాదిస్తున్న వాక్ స్వాతంత్య్ర హక్కును గౌరవిస్తూ వీరికి సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసుల నుంచి రక్షణ కల్పించడం హర్షించవలసిన విషయం. ఇంతకూ ఈ ఏడుగురు ప్రముఖులు చేసిన నేరం ఏమిటి? గణతంత్ర దినాన ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుండగా నవ్‌రీత్ సింగ్ అనే రైతు మరణించాడు. అతడు పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్టు సాటి రైతులు ఆరోపించగా ఆ మేరకు తొలి వార్తలు వెలువడ్డాయి. వాటిని ఆధారం చేసుకొని ఆ రైతు కాల్పుల్లో చనిపోయినట్టు ఈ ఏడుగురు టిట్టర్‌లో సందేశాలు పెట్టారు. వాస్తవానికి ఆ రైతు పోలీసు అవరోధాలను (బ్యారికేడ్లు) ట్రాక్టర్‌తో ఢీ కొట్టి తొలగించబోతుండగా కిందపడి మరణించినట్టు తేలింది.

అతడి శరీరంపై కాల్పుల ఆనవాళ్లు కనిపించలేదు. ఈ విషయం రూఢి అయిన తర్వాత ఆ ఏడుగురూ ఆ మేరకు తమ ట్విట్టర్ సందేశాలను సరిదిద్దుకున్నారు కూడా. అయినా వారు దేశంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతోనే ట్వీట్లను పెట్టారని ట్విట్టర్‌లో వారికి లక్షలాది మంది అనుచరులున్నారని పేర్కొంటూ ఆ ఫిర్యాదులు దాఖలయ్యాయి, కేసులు నమోదయ్యాయి. మన ప్రజాస్వామ్యం పాశ్చాత నమూనా కాదని, మానవీయ లక్షణాలను పుణికిపుచ్చుకున్నదని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ఘనంగా ప్రకటించిన తర్వాతనే సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు రావడం యాదృచ్ఛికమే. కాని మన పాలకులు, పోలీసులు పాటిస్తున్నది మాత్రం మానవీయ ప్రజాస్వామ్యం కాదని అనుకోక తప్పడం లేదు. వారి చర్యల్లో, నిర్ణయాల్లో తమను వ్యతిరేకించే వర్గాల మీద కసి, పగ సాధింపు, నిర్బంధించే ధోరణులే ఎక్కువగా తరచూ కనిపిస్తున్నాయనడం అబద్ధం కాబోదు. ఈ విషయం వారు నిజాయితీతో ఆత్మపరిశీలన చేసుకొని ప్రజాస్వామిక రాజ్యాంగ నియమాలు, విలువల మేరకు శాసన పాలన చేయడం మొదలు పెడితే దేశానికెంతో మేలు జరుగుతుంది.

రాజద్రోహ చట్టం బ్రిటిష్ వలస పాలకుల హయాంలో దేశంలో పురుడు పోసుకున్నది. నోటి మాట ద్వారా గాని, రాతపూర్వకంగా గాని లేదా సంకేతాలతో గాని, ఇతరత్రా గాని ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని కలిగించే పనులు చేసే వారిని రాజద్రోహులుగా పరిగణించి శిక్షించాలంటూ భారత శిక్షాస్మృతి 124ఎ సెక్షన్ అవతరించింది. ఈ సెక్షన్‌ను బ్రిటిష్ ప్రభుత్వం 1870లో చట్టంలో చేర్చింది. బ్రిటిష్ ప్రభుత్వమే బ్రిటన్‌లో 2009లో ఈ చట్టాన్ని రద్దు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పౌరు ల హక్కుగా లేని రోజుల్లో అవతరించిన ఈ చట్టం ప్రజాస్వామిక వ్యవస్థలో కొనసాగడానికి వీల్లేదని భావించి దానిని తొలగించింది. పాశ్చాత్య ప్రజాస్వామ్యం కంటే మనదే గొప్పదని చెప్పుకుంటున్న మన పాలకులు మాత్రం దానిని కొనసాగిస్తూ దాని కింద కేసులు పెట్టి పౌరులను కష్టాల పాలు చేయడం సిగ్గుపడవలసిన విషయం. దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని దాని రక్షా కవచమైన పోలీసు వ్యవస్థను దాని ఇతర విభాగాలను విమర్శించడానికి సాహసించకుండా భయపెట్టడానికే శశిథరూర్ మీద ఇతర ఆరుగురు జర్నలిస్టుల మీద ఈ కేసును ప్రయోగించారని అనుకోవలసి ఉంది. పాలకులు ఇప్పటికైనా ఈ పద్ధతిని మానుకోవడం మంచిది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News