Saturday, April 27, 2024

మూడోసారి టిఆర్‌ఎస్‌కే పగ్గాలు

- Advertisement -
- Advertisement -

 

Triangle fight in 2023 TS Assembly Elections 

రాష్ట్రంలో టిఆర్‌ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ… రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు-ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాలు, ఓట్ల పథకాలు, నెంబర్లాట ఇవన్నీ సహజమే. రాజకీయాల్లో దాదాపుగా శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు అనేది అందరికీ తెలిసిందే. సమాజంలో వివిధ పార్టీలు, నాయకులు, చర్చలు, విమర్శలు, ప్రతిపక్షాలు ఉండటం సహజం.
ప్రత్యేకించి తెలంగాణ సమాజంలో టిఆర్‌ఎస్ బలంగా పాతుకుపోయిన మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. తెలంగాణ అంటే టిఆర్‌ఎస్ అన్నంతగా ఒదిగిపోయింది. దానికి ముఖ్య కారణం కెసిఆర్ అపార చాణక్య నీతితో పాటు తాను అమలు చేసిన పథకాలు, రాజకీయ చతురత, ఆకట్టుకునే మాటతీరు, తెలంగాణకు సంబందించిన వివిధ అంశాలపై ఉన్న లోతైన అవగాహన, విషయ పరిజ్ఞానం తదితర అనేక కారణాల వల్ల దాదాపుగా తెలంగాణ సమాజం మొత్తం ఆయన వెంట నిలిచింది. అయితే ఈ విషయాలలో కెసిఆర్‌తో పోటీపడే నాయకుడు నేటికీ లేకపోవడం గమనించదగ్గ విషయం.
రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను గమనిస్తే, టిఆర్‌ఎస్‌పై పోటీకి కాంగ్రెస్, బిజెపి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో, మూడు ప్రధాన పార్టీలు ఈసారి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి కారణం
1. టిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ కలవలేదు… ఆ విషయాన్ని వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో చాలా స్పష్టంగా చెప్పారు.
2. టిఆర్‌ఎస్‌తో బిజెపి కలవలేదు. కారణం వారు రాష్ట్రంలో స్వంతంగా బలపడాలనుకోవడం. వాళ్ళు పోరాడుతుందే అధికార టిఆర్‌ఎస్ మీద కావడం.
3. బిజెపి, కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల్లో కానీ, కేంద్రంలో కానీ కలిసే అవకాశం లేదు.
రానున్న ఎన్నికలలో ఈ మూడు ప్రధాన పార్టీలతో పాటు, చిన్న పార్టీలు చాలా సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. వారు గెలిచే అవకాశం లేకపోయినా, ఓట్లను చీల్చే అవకాశం ఎక్కువగానే ఉంది. అయితే రానున్న ఎన్నికలలో 5000 ఓట్ల తేడాతో గెలిచే నియోజకవర్గాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ చిన్న పార్టీల ఓట్ల చీలికలు కూడా కీలకం అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఆ పార్టీలు ఎవరి ఓట్లను చీలుస్తాయి, తద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది మరో చర్చ.
ఓట్ల విషయానికి వస్తే, రాష్ట్రం మొత్తంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా మేలు జరిగింది. టిఆర్‌ఎస్ గత 8 ఏళ్లలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు రాష్ట్రాన్నే కాకుండా యావత్ దేశాన్నే అనేకసార్లు విస్మయానికి గురి చేశాయి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు పెద్దన్నగా నిలవడం మొదలుకొని ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై నమ్మకాన్ని పెంచే కెసిఆర్ కిట్ లాంటి అనేక గొప్ప పథకాలు మొదలుకొని నేటి దళిత బంధు పథకం వరకు దాదాపుగా ప్రతి పథకం ఒక మచ్చుతునక.
దేశాన్ని ఏళ్ల తరబడి పాలించిన పార్టీలకు గానీ, ఏళ్ల తరబడి ముఖ్యమంత్రులుగా పని చేసిన అనేక మంది నాయకులుగానీ కనీసం ఆలోచన కూడా చేయని రీతిలో పథకాలను ప్రవేశపెట్టి, దిగ్విజయంగా అమలుపరుస్తూ దేశం మొత్తం తమ వైపు చూసేలా చేయగలిగింది టిఆర్‌ఎస్. అధికార టిఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్షంలో గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భాలు అనేకం చూశాం. స్వయంగా రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నాయకులే టిఆర్‌ఎస్ పథకాలను మెచ్చుకున్న సందర్భాలనూ చూశాం. టిఆర్‌ఎస్ అమలు చేసిన చాలా పథకాలను వివిధ రాష్ట్రాలతో పాటు, దేశ స్థాయి లో అమలు చేస్తున్న ప్రభుత్వాలను చూస్తున్నాం.
దేశంతో పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు నడిపి, నేడు చతికిలపడి అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పోటీపడే స్థాయికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ప్రస్తుతం బిజెపిపై పైచేయి సాధించడానికే తమ శక్తియుక్తులను కూడగట్టుకోవడానికి శ్రమించాల్సిన పరిస్థితికి చేరుకుంది. దానికి పార్టీ అంతర్గత కలహాలు, నాయకత్వలోపం తదితర అనేక కారణాలున్నాయి.
బిజెపి విషయానికి వస్తే కెసిఆర్‌ను విమర్శిస్తూ అవినీతి లెక్కలు బయట పెడతాం… కెసిఆర్‌ను జైల్లో పెడతాం అని సంవత్సరాల తరబడి చెప్తూపోవడం తప్ప కేంద్రం లో అధికారంలో ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటీ నిరూపించలేకపోయారు. వ్యక్తిగత విమర్శలను ప్రజలు ఒక స్థాయి వరకు మాత్రమే వింటారు.ఆ తర్వాత పట్టించుకోరు. దానికి సంబంధించిన ఉదాహరణలను తెలంగాణ సమాజంలో ఇప్పటికే చూసినం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం కెసిఆర్ మీద ఏ రకమైన చర్యలకు సాహసించినా కెసిఆర్ బలం మరింత పెరిగే అవకాశం ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదన్న అభిప్రాయం రాజకీయ అవగాహన ఉన్న వర్గాలలో కనబడుతుంది. అయితే మేము అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాం అని చెప్పే కార్యాచరణ ప్రస్తుతానికి బిజెపి వైపు నుండి కనిపించడం లేదు. మైనారిటీ రిజర్వేషన్లు తగ్గిస్తాం, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తాం అనేటటువంటి మతం కేంద్రంగా జరిగే ప్రచారం వారి రాబోయే ఎన్నికల ఎజెండాగా కనబడుతుంది. అయితే మతపరమైన విషయాలను లేవనెత్తుతూ తెలంగాణ సమాజంలో కెసిఆర్ తో తలపడడం అత్యంత కష్టం.
రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ పోటీ ఇచ్చే అభ్యర్థులు లేరు అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. పెట్రోల్ ధరల పెంపు, సిలిండర్ ధరల పెంపు, నిత్యావసరాల ధరల పెరుగుదల, వడ్ల కొనుగోలు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం లేదు అనే విషయాల్లో బిజెపి నుండి సరైన సమాధానం లేదు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి టిఆర్‌ఎస్ నుండి గత కొద్ది రోజులుగా వస్తున్న అనేక ప్రశ్నలకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. అయినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం, సీట్ల శాతం కొంత మేర పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు గెలిచే పరిస్థితి లేదు.
రెండు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపిలు తామే టిఆర్‌ఎస్‌కు పోటీ అని బయటకు చెప్తూ రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించడానికి ఈ రెండు పార్టీలు ఒకరితో మరొకరు పోటీపడుతున్నట్లుగా ఉంది. రెండు పార్టీలలో రాష్ట్ర అధ్యక్షుల మీద పార్టీలోని కీలక నాయకులలో కూడా వ్యతిరేకత ఉన్నట్లుగా కనిపిస్తుంది.
అయితే టిఆర్‌ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2014 నుండి మొదలుకొని 2018 వరకు ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి కారణంగా 2018 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో టిఆర్‌ఎస్ సాధించిన విజయాలను విశ్లేషిస్తే గణనీయమైన మార్పు, టిఆర్‌ఎస్ పట్ల ప్రజల విశ్వాసం, వివిధ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధి ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి.
2014 ఎన్నికలలో టిఆర్‌ఎస్ 63 స్థానాలు గెలుపొందినప్పటికీ టిఆర్‌ఎస్ స్థాపించినప్పటి నుండి ఒక్కసారి కూడా గెలవని నియోజక వర్గాలు రాష్ట్రంలో 49 ఉండగా, 2018 ఎన్నికలలో ఆ సంఖ్యను 18కి తగ్గింది.
2014 ఎన్నికలలో టిఆర్‌ఎస్ జిహెచ్‌ఎంసిలో ఉన్న 24 నియోజక వర్గాలలో కేవలం 3 సీట్లు మాత్రమే గెలవగా, 2018లో 16 సీట్లను గెలుచుకుంది.
2014 ఎన్నికలలో టిఆర్‌ఎస్ కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో (మెదక్‌కలిపి) 54 సీట్లకు గాను 44 సీట్లను గెలుచుకోగా, 2018లో 47 సీట్లను గెలుచుకుంది.
ఉత్తర తెలంగాణ మినహా మిగిలిన జిల్లాలలో ఉన్న 65 సీట్లకు గాను 2014లో 19 సీట్లు మాత్రమే గెలవగా, 2018లో ఆ సంఖ్య 41 సీట్లకు పెరిగింది.
మొత్తంగా 2018 ఎన్నికలలో 88 సీట్లతో స్వంతంగా రెండవసారి అధికారంలోకి వచ్చింది.
2014లో టిఆర్‌ఎస్ ఓట్ల శాతం 34.3 గా ఉండగా, 2018 ఎన్నికలలో 46.8 శాతానికి పెంచుకొని 13.5 శాతం వృద్ధి సాధించింది.
అయినప్పటికీ రెండు పర్యాయాలు పాలించిన పార్టీపై ప్రజల్లో కొంతవరకు వ్యతిరేకత ఉండటం సహజం. అయితే ఆ వ్యతిరేకత రానున్న ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి మాత్రం లేదన్న వాస్తవాన్ని తెలియజేస్తుంది. దాంతో పాటు రానున్న రోజుల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించడం, ఇప్పటికే ప్రకటించిన 90,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, దళిత వర్గాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి రూపొందించిన దళిత బంధు పథకాన్ని విస్తృతంగా అమలు చేయడం, ఇప్పటికే సగానికి పైగా అమలు చేసిన రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు రానున్న కాలంలో మరిన్ని పథకాలకు రూపకల్పన చేసే అవకాశం కనబడుతుంది. వెరసి రాష్ట్రంలో ముచ్చటగా మూడవసారి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టిఆర్‌ఎస్ కదులుతుండటం విశేషం.

నిఖిల్ అల్లేని, 96666 51215

Triangle fight in 2023 TS Assembly Elections 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News