Monday, April 29, 2024

జెఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటిన గిరిజన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జెఈఈ మెయిన్ 2023 ఫలితాల్లో గిరిజన విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 6 నుంచి 15 వరకు పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలు శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సి (ఎన్‌టిఎ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో గిరిజన విద్యార్థులు సత్తా చాటారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభా (సిఒఈ) కళాశాలల నుండి 741 మంది విద్యార్థినీ విద్యార్థులు ఐఐటిజెఈఈ మెయిన్స్ 2023 పరీక్షకు హాజరు కాగా అందులో 509 మంది ఐఐటిజెఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో ఆల్ ఇండియా స్థాయిలో 23 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా, 80 మంది విద్యార్థులు 80 శాతానికి పైగా విజయం సాధించారని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లోని ఐఐటి స్టడీ సెంటర్‌లో శిక్షణ పొందిన వంశీ 99.21 సాధించి చరిత్ర సృష్టించాడని మంత్రి తెలిపారు. వంశీ కేటగిరి 46 వ ర్యాంక్ సాధించడం గర్వకారణమన్నారు.

గిరిజన గురుకుల విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సత్తా చాటారని మంత్రి తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత నిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయనడానికి విద్యార్థులు సాధిస్తున్న ఈ ర్యాంకులే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లీష్ మీడియంలో దోధన, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్నందున ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని తెలిపారు. గురుకులాల్లో గిరిజన విద్యార్థులకు ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని దీంతో గిరిజన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇంజనీరింగ్, ఎంబిబిఎస్ విద్యలో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. రికార్డు స్థాయిలో గిరిజన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి సత్తా చాటడానికి కృషి చేసిన అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News