Monday, April 29, 2024

దసరా రోజున టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభం!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ, సంక్షేమ పథకాల్లో ఆదర్శంగా నిలిచిన టిఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గత సంవత్సరం దసర రోజు నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసి ప్రారంభించాలని టిఆర్‌ఎస్ అధిష్టానం భావించినప్పటికీ వచ్చిన వరుస ఎన్నికలతో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకపోవడంతో టిఆర్‌ఎస్ అధిష్టానం కార్యాలయాల నిర్మాణాలపై దృష్టి సారించింది. ఆధునిక సౌకర్యాలతో రాష్ట్రంలో 31 పార్టీ కార్యాలయాల నిర్మాణం టిఆర్‌ఎస్ అధిష్టానం చేపట్టింది. పార్టీ కార్యాలయ నిర్మాణాలకు రూ.60 లక్షల చొప్పున టిఆర్‌ఎస్ అధిష్టానం సమకూర్చి జిల్లా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఎకరానికి తక్కువ కాకుండా భూమి సేకరించి పార్టీ నిర్మాణాలు చేపట్టింది. సంగారెడ్డి పార్టీ కార్యాలయాన్ని మంత్రి హరీష్‌రావు సందర్శించి పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పార్టీ కార్యాలయాన్ని సిద్ధంచేసి మొక్కలు నాటించారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ కార్యాలయ నిర్మాణంపై పూర్తి స్థాయి దృష్టి సారించారు.

ఖమ్మంలో ఇప్పటికే ఉన్న పార్టీ కార్యాలయాన్ని ఆధునీకరించారు. హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యాలయం ఉండటంతో 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, వరంగల్, ములుగు పార్టీ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మహబూబాబాద్, జనగామ పార్టీ కార్యాలయాలు నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి, ఆదిలాబాద్, మంచిర్యాల, వేములవాడ, వికారాబాద్ తదితర జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో పనుల్లో కాస్త నెమ్మది అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాయి. పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు పార్టీ అధినేత సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ సమయం ఇవ్వాల్సి ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అయితే గత విజయదశిమి నాడు ప్రారంభించాల్సిన పార్టీ కార్యాలయాలు వరుస ఎన్నికలతో ఆలస్యం అయినప్పటికీ వచ్చే దసరా రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు నాయకులు చెపుతున్నారు. అయితే ఆ లోగా కరోనా కూడా రాష్ట్రం నుంచి పారిపోయో అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయనే ఆశాభావం నాయకుల్లో వ్యక్తం అవుతుంది.

TRS Build Offices will begin on Dussehra Festival

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News