Monday, April 29, 2024

మునుగోడు ముస్తాబు

- Advertisement -
- Advertisement -

పెద్ద సంఖ్యలో జన సమీకరణ
గులాబీమయమైన మునుగోడు
రెయిన్ ఫ్రూఫ్‌తో సభా వేదిక

హాజరు సిఎం కెసిఆర్

ప్రజా దీవెనకు సర్వం సిద్ధం

మన తెలంగాణ/మునుగోడు: ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో శనివారం జరగబోయే ప్రజాదీవెన సభకు ఆ పార్టీ శ్రేణులుముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కెసిఆర్ రాక సందర్భంగా మునుగోడు మొత్తం గులాబీమయంగా మారింది. ఈ సభ ద్వారా ఉప ఎన్నికకు శంఖారావం పూరించేందుకు కెసిఆర్ సిద్ధమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. భారీ బహిరంగ సభకు జన సమీకరణకు జిల్లాలోని ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులతో మండలానికి ఇద్దరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా, మాజీ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికార టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2024లో జరిగే సాధారణ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్స్‌గా భావించిన అన్ని పక్షాలు తమ బలాబలాలను చూపించేందుకు సిద్ధమవుతున్నాయి.

దీనిలో భాగంగానే ముందుగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ శనివారం మునుగోడులో నిర్వహించే భారీ బహిరంగ సభతో తమ సత్తాచాటి సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగానే టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఉప ఎన్నిక జరగడానికి మరో రెండు, మూడు నెలల సమయం ఉన్నప్పటికీ మునుగోడును తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మునుగోడు బహిరంగసభకు తీసుకురావడం ద్వారా క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపేలా చూస్తున్నారు. ఉప ఎన్నికను మంత్రి జగదీష్‌రెడ్డి అన్నీతానై చూసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన కీలకనేతలను తమ దారికి తెచ్చుకుంటూ, అసంతృప్తులను బుజ్జగించి సభను సక్సెస్ చేసే పనిలో ఉన్నారు. నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ, వివిధ పార్టీలకు చెందిన కలిసివచ్చే నాయకులను పార్టీలోకి తీసుకురావడంలోనూ ఆయన పక్కా ప్రణాళికతో ముందుకువెళుతున్నారు. కాగా, ఎమ్మెల్యే, ఎంపి స్థాయి నాయకులను మండలాల్లో ఇన్‌చార్జీలుగా నియమించి మునుగోడులో విజయం సాధించాలనే వ్యూహంతో టిఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది.

రెయిన్ ఫ్రూఫ్ షామియానాతో సభా వేదిక

వచ్చే రెండు రోజులు ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశాలుంటాయన్న వార్తల నేపథ్యంలో సభకు ఎటువంటి ఆటంకం కలుగకుండాద సభా వేధికను చాలా పటిష్ఠంగా నిర్మాణం చేస్తున్నారు. ఐరన్ ఫోల్స్, రెయిన్ ప్రూఫ్ షామియానాలతో సభా వేధికను సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారులపై భారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం మంత్రి జగదీష్ రెడ్డితోపాటు ఎంఎల్‌ఎలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు సభ నిర్వహణ పనులను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లనూ అంతేస్థాయిలో ఉండేలా వేధికను ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఏర్పాట్లకు వరుణుడు అడ్డంకిగానే మారుతున్నాడని చెప్పొచ్చు. శుక్రవారం వాతావరణం మేఘావృతమై, తేలికపాటి వర్షం కురవడంతో సభ ఏర్పాట్లకు కొద్దిగా ఆటంకంగా మారిందని పార్టీ నేతలంటున్నారు. వర్షం కారణంగా ప్రస్తుతం సభ ప్రాంగణం చిత్తడిగా మారింది

భారీ కాన్వాయితో కెసిఆర్ రాక

బహిరంగ సభ నిమిత్తం సిఎం కెసిఆర్ మునుగోడుకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం భారీ కాన్వాయితో ర్యాలీకి పార్టీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే పదుల సంఖ్యలో కార్ల ద్వారా భారీ కాన్వాయితో ర్యాలీ నిర్వహించనున్నట్టు సమాచారం. జిల్లా సరిహద్దుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వందలాది కార్లతో స్వాగతం పలికి మునుగోడు వరకు భారీస్థాయిలో ర్యాలీకి పార్టీ క్యాడర్ ఏర్పాట్లలో మునిగితేలుతోంది. కాగా, వర్షం కారణంగా ఏదైనా ఇబ్బంది కలిగితే సిఎం కెసిఆర్ హెలికాప్టర్‌లో వచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సభాస్థలి ప్రాంతంలో హెలిప్యాడ్ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికలో సత్తా చాటి వచ్చే సాధారణ ఎన్నికల్లో తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ముందస్తు కసరత్తుకు తార్కాణంగా ఈ సభ ద్వారా చెప్పకనే చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News