Sunday, April 28, 2024

కెసిఆర్ పాలనతో పోటీపడే నాయకుడేడి

- Advertisement -
- Advertisement -

TRS MLC Election Campaign in Nalgonda

నల్లగొండ: దేశం మొత్తంలో అణువనువు వెతికినా సిఎం కెసిఆర్ పాలనతో పోటీపడే దమ్మున్న, విజన్ ఉన్న నాయకుడు లేనేలేడని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పాలనాపరంగా కెసిఆర్‌తో పోటీపడే అవకాశాలు లేవంటూ వివరించారు. మంగళవారం నల్గొండలో జరిగిన పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థ్ది పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్షాలకు ప్రజలకు చెప్పడానికి ఏ అంశం అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత దూషణలకు దిగుతూ బజారునపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ జుగుప్సాకర వ్యాఖ్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ద్వజమెత్తారు. తెలంగాణ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన ఉందని యావత్ తెలంగాణ లోకం తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తోందని, ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకలాంటిదని పేర్కొన్నారు.

తెలంగాణలో ఆకలి కేకలు వినిపించకూడదనే ఏకైక లక్షంతో ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతూ ఆకలి సమస్యను దరదాపులకు రాకుండా తరిమికొట్టారని వివరించారు. యావత్ తెలంగాణలో ఏ మూలన కూడా అంతరాయం లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలో టిఎస్‌ఐపాస్ ద్వారా వేలాది కంపెనీలను తీసుకొచ్చి ప్రైవేటు రంగంలో రూ. 15లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత నాయకత్వంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. దేశ ప్రధానమంత్రి మోదీ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనుడని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తీసుకొస్తామని ప్రజల ముందు ప్రగల్బాలు పలికి నిలువునా మోసం చేశారని ఆరోపించారు.

గులాబీ దళపతి, సిఎ కెసిఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థ్ది పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పని మాటమీద నిలబడి యావత్ తెలంగాణను సస్యస్యామలం చేసిన ఘనత కెసిఆర్‌దేనని తెలిపారు. యాసంగిలో 50లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేస్తూ రికార్డు సాధించి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే పేరుగాంచిందని, అదే సందర్భంలో 14.2 వృద్ధ్దిరేటుతో దేశంలోనే ముందంజలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 43లక్షల మందికి ఆసరా పెన్షన్‌లు, 60లక్షల మందికి రైతుబంధు వంటి బృహత్తర పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న కెసిఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. దండుమల్లాపురంలో ఇండస్ట్రీయల్ పార్క్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడబోతున్నామని, ఐటి హబ్‌ను నల్లగొండలో త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు.

తెలంగాణలోనే ప్రభుత్వ రంగ సంస్థలను కన్నబిడ్డల మాదిరిగా కాపాడుకుంటుంటే కేంద్రం అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలన్నింటిని తెగనమ్ముతోందని ఆరోపించారు. ప్రతిపక్షాల పని అభూత కల్పనలు, కల్లబొట్టిమాటలతో ప్రజలు మభ్యపెట్టాలని చూస్తున్నాయని, వారి పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, రాష్ట్ర నాయకులు నిరంజన్‌వలీ, రమణానాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News