Wednesday, May 1, 2024

ఇండియన్ల ఓట్లు నా వైపే: ట్రంప్

- Advertisement -
- Advertisement -

Trump says Indian Americans would be voting for me

వాషింగ్టన్: భారతీయులు తన ఆప్తులని, ఈసారి ఎన్నికల్లో ఇండో అమెరికన్ల ఓట్లన్నీ తనకే అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయులు తనకు ఓటేస్తారని తెలిపారు. తాను తన అధికార హయాంలో ఇండో అమెరికన్లతో ఇతోధిక సంబంధాలను ఏర్పాటు చేసుకున్నట్లు, అదే విధంగా ప్రధాని మోడీ తనకు నిజమైన స్నేహితుడని, ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ట్రంప్ వెల్లడించారు. నవంబర్ 3వ తేదీ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలోని భారతీయుల ఓట్లు తనకు అనుకూలంగా ఉంటాయనే తాను భావిస్తున్నట్లు తెలియచేసుకున్నారు. అమెరికాకు భారత్ నుంచి చాలా మద్దతు వ్యక్తం అవుతోందని, ప్రధాని మోడీ అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారని, ఇరుదేశాల సత్సంబంధాలు ప్రత్యేకించి తనకు మోడీకి ఉన్న అవినాభావం కోణంలో ఇండో అమెరికన్లు తమ ఓటును పదిలమైన రీతిలోనే వాడుకుంటారని చెప్పారు.

వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. మరో నాలుగేళ్లు పేరిట విడుదల చేసిన వీడియోలోని అంశాల ప్రాతిపదికన విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు సందర్భంగా ప్రచారపర్వంలో భాగంగా గత నెలలో ఈ వీడియోను వెలువరించారు. ఈ వీడియోలో ట్రంప్ మోడీ ఫోటోలు, హౌడీ మోడీ , నమస్తే ట్రంప్ సభలు రోడ్ షోలు వంటివి అనేకం పొందుపర్చారు. ఈ వీడియో రూపకల్పనలో సహకరించిన తన కుమారుడు , కూతురు ఇవాంక ఇతరులకు ఇండియాలో అభిమానులు ఉన్నారని, వారి పట్ల అక్కడ కూడా మంచి ఆదరణ ఉందని, ఇరుదేశాల సంబంధాలను పరిగణనలోకి తీసుకుని ఈ వీడియో రూపొందించారని, దీని ప్రాతిపదికన చూసినా ఈ సారి ఎన్నికలలో ఇండో అమెరికన్ల ఓట్లు తమ పార్టీకే పడుతాయని ఖచ్చితంగా చెప్పగలనని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News