Saturday, April 27, 2024

నేడు వరంగల్‌కు మంత్రులు

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ ఆదేశాలతో
నేడు మంత్రుల వరంగల్ పర్యటన

CM KCR Review meeting on floods and Rains

మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉదయం హెలి కాప్టర్‌లో వరంగల్ వెళతారు. ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలుస్తారు. మంత్రుల బృందం నగరంలో పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. వరంగల్ ఎంజిఎంను సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహిస్తారు. వానలు, వరదలు, కరోనా పరిస్థితిని సమీక్షిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారు.

విద్యుత్ శాఖ పనితీరు భేష్
విపత్తు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేయడంతో పాటు గ్రిడ్ ఫెయిల్ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని సిఎండి ప్రభాకర్ రావును, ఇతర విద్యుత్ సిబ్బందిని సిఎం కెసిఆర్ అభినందించారు. ప్రగతి భవన్‌లో సోమవారం సిఎం కెసిఆర్ నిర్వహించిన సమీక్షలో విద్యుత్ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా గురించి ట్రాన్స్ కో – జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు సమావేశంలో వివరించారు. భారీ వర్షాలు, వరదల వల్ల విద్యుత్ వ్యవస్థకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు కలిగినప్పటికీ ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదన్నారు. కరీంనగర్ జిల్లాలో 220 కెవి సామర్థ్యం కలిగిన ఏడు టవర్లు భారీ వరదల వల్ల కొట్టుకుపోయాయని, వరంగల్ జిల్లాలో రెండుచోట్ల 33 కెవి సబ్ స్టేషన్లు నీట మునిగాయని సిఎంకు విద్యుత్ శాఖ సిఎండి ప్రభాకర్‌రావు వివరించారు. ఎన్‌పిడిసిఎల్ పరిధిలో 54 గ్రామాలు నీట మునిగి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామన్నారు. వరద నీరు నిండిన ప్రాంతాలకు సంబంధించి ఎస్‌పిడిసిఎల్ పరిధిలో 159, ఎన్‌పిడిసిఎల్ పరిధిలో 89 మొత్తంగా 248 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ ఫార్మర్లకు విద్యుత్ సరఫరాను ముందు జాగ్రత్త చర్యగా నిలిపి వేశామని సిఎంకు తెలియజేశారు. ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు ఉన్నందున అప్పర్ జూరాల, లోయర్ జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో మొత్తం 1200 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గినందున కెటిపిపి, సింగరేణి, కెటిపిఎస్ తదితర ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించామని సిఎండి ప్రభాకర్ రావు వివరించారు. దీనిపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ…ఈ ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో కూడా నమోదు కాని విధంగా రాష్ట్రంలో 13,168 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైయిందన్నారు. ఇదే ఏడాది ఒక సందర్భంలో 4,200 మెగావాట్ల అత్యంత కనిష్టానికి డిమాండ్ పడిపోయిందని, సాధారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తితే గ్రిడ్ కుప్పకూలుతుందన్నారు. కానీ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆ పరిస్థితి తలెత్తకుండా చేశాయని సిఎం అభినందించారు.

మున్సిపల్ శాఖకు కితాబు
హైదరాబాద్, వరంగల్ తో పాటు అనేక నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినా మున్సిపల్ శాఖ బాగా పనిచేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చేసిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. వరంగల్ లో తలెత్తిన పరిస్థితితో పాటు హైదరాబాద్, కరీంనగర్, ఇతర పట్టణ ప్రాంతాల పరిస్థితిని కూడా సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు పట్టణాల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు వివరించారు. “భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటిలలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైన, ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆశ్రయమిచ్చామన్నారు. ఒక్క వరంగల్ నగరంలోనే 4,750 మందిని శిబిరాలకు తరలించామని సిఎంకు వివరించారు. రాష్ట్రంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న 1,898 ఇండ్లను గుర్తించి, అందులో నివసిస్తున్న వారిని కూడా శిబిరాలకు తరలించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. రెండేళ్ల క్రితం నుంచి హైదరాబాద్ నగరంలో డిసాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ను నిర్వహిస్తున్నామన్నారు.

ఇందులోని 339 మంది సుశిక్షితులైన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడుతున్నారని వివరించారు. వీరికి పూర్తి స్థాయిలో ఎక్విప్‌మెంట్ కలిగిన 50 వాహనాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్ తరహాలోనే డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ను వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లోకూడా వాడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా సిద్ధంగా ఉండే విధంగా డిఆర్‌ఎఫ్ తయారైందన్నారు. వీటికి తోడు మాన్సూన్ ఎమర్జెన్సీ టీములను కూడా అన్ని నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి, తగిన సహాయక చర్యలు తీసుకుంటు న్నామని అని కెటిఆర్ వివరించారు. విపత్తుల సమయంలో మున్సిపల్ శాఖ అద్భుతంగా పనిచేస్తున్నదని సిఎం అభినం దించారు. ఇతర దేశాలు, దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ప్రకృతి విపత్తుల సమయంలో అనుసరించే వ్యూహాన్ని అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రానికి అనుగుణమైన విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని సిఎం కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరులో ప్రొఫెషనలిజం కనిపించాలని సిఎం ఆకాంక్షించారు.

TS Ministers to visit Warangal due to floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News