Saturday, April 27, 2024

కాబూల్‌తో సంబంధాలు!

- Advertisement -
- Advertisement -

U.S. military completely withdrawn from Afghanistan

 

ప్రకటించిన గడువు ప్రకారం ఆగస్టు 31 మంగళవారం నాడు అమెరికా సైన్యం అఫ్ఘానిస్తాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయింది. అక్కడి అమెరికన్ దళాల కమాండర్ జనరల్ క్రిస్ డోనాహ్యూ, అమెరికా రాయబారి రాస్ విల్సన్, ఇంకా మిగిలిన కొద్ది మంది సైనికులు కాబూల్ విమానాశ్రయం నుంచి బయలుదేరడంతో అఫ్ఘానిస్తాన్‌పై తాలిబన్ల విజయం పరిపూర్ణమైంది. కాబూల్ విమానాశ్రయం సహా మొత్తం దేశం వారి కైవసమైంది. అందుకు సంకేతంగా కాబూల్ అంతటా తాలిబన్ల విజయ దుందుభులు మోగాయి. ఇప్పుడక్కడ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు, సమగ్ర పాలక వ్యవస్థ నెలకొనడం జరగవలసి ఉన్నాయి. ప్రభుత్వ స్థాపనపై తాలిబన్ల నేతలు ఇప్పటికే చర్చలు, మంతనాలు జరిపారు. ప్రభుత్వం ఏర్పాటు లాంఛన ప్రాయమే అనుకోవాలి. అయితే వారి పాలన ఈసారి ఎలా ఉండబోతుందనేదే ముఖ్యమైన అంశం. గతంలో మాదిరిగా పాశవిక విధానాలు అమలు చేయబోమని, మహిళల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామని, అందరినీ కలుపుకొని పోతామని ఇటీవల వారు ఇచ్చిన హామీకి విరుద్ధంగా తాలిబన్లు పూర్వపు క్రౌర్యాన్నే ప్రదర్శిస్తున్నారు. పర్వత ప్రాంత బఘ్లాన్ రాష్ట్రంలోని ప్రఖ్యాత జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని ఇంటిలోంచి బయటకు ఈడ్చుకు వచ్చి కాల్చి హతమార్చిన దారుణం తాలిబన్లలో మార్పు రాలేదని చాటింది.

సంగీతం, పాట, నృత్యం వంటి కళలను వారు సహించరు. గతంలో 1996 -2001లో సాగిన వారి పాలనలో కూడా సంగీతాన్ని నిషేధించారు. ఇస్లామ్‌లో దానికి చోటు లేదని వారు నమ్ముతారు. స్వదేశం చేరుకోడానికి కాబూల్ విమానాశ్రయానికి వచ్చి సమీపంలోని గురుద్వారాలో రెండు వారాలుగా తలదాచుకున్న 140 మంది సిక్కులు, హిందువులకు తాలిబన్లు అభయమిచ్చినట్టు తెలుస్తున్నది. దానితో వారు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లి వ్యాపారాలు, వ్యవహారాలు జరుపుకుంటున్నట్టు వార్తలు చెబుతున్నాయి. అఫ్ఘాన్‌తో సంబంధాల్లో భారత దేశానిది చెప్పనలవికానంత చేదు అనుభవమే. నలభై ఏళ్లలో రెండు సార్లు రెండు అగ్రరాజ్యాల వెంట నడిచి తీవ్ర నిరాశను ఎదుర్కొన్నది. 1980లలో అప్పటి సోవియట్ యూనియన్ అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించినప్పుడు భారత్ దానితో కలిసి వ్యవహరించింది. ఇందిరా గాంధీ నాయకత్వంలో ఇండియా అలీన విధానానికి కూడా స్వస్తి చెప్పి సోవియట్ వెంట నడిచింది. ఒక వైపు సోవియట్, భారత్ మరో వైపు అమెరికా, పాకిస్తాన్ ఎదురెదురు ధ్రువాలుగా పని చేశాయి.

అఫ్ఘాన్‌లో సోవియట్ చొరబాటుపై 1980 జనవరిలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ప్రత్యేక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు సోవియట్‌ను ఇండియా గట్టిగా సమర్థించింది. ఆ దశాబ్ది అంతంలో సోవియట్ ఆంతరంగిక సంక్షోభాన్ని ఎదుర్కొని యూనియన్ విచ్చిన్నమైపోయినప్పుడు అఫ్ఘాన్ నుంచి అది పూర్తిగా వైదొలగింది. అప్పుడు ఇండియా ఏకాకి అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇంచుమించు అదే పరిస్థితి ఎదురయింది. అమెరికా ప్రాణాలు అరచేత పట్టుకొని అఫ్ఘాన్ నుంచి నిష్క్రమించింది. దాని అండ చూసుకొని గత 20 ఏళ్లలో అఫ్ఘానిస్తాన్‌లో భారత దేశం ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసింది. అక్కడి 34 రాష్ట్రాల్లో వివిధ ప్రాజెక్టులలో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. రోడ్లు, ఆనకట్టలు, పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్ కేంద్రాలు నిర్మించింది. హేరత్ రాష్ట్రంలో జలవిద్యుత్ కేంద్రం, సల్మా డామ్‌లను నెలకొల్పింది. 90 మిలియన్ డాలర్ల వ్యయంతో కాబూల్‌లో పార్లమెంటు భవనాన్ని, 218 కి.మీ నిడివి జరాంగ్ డెలారమ్ హై వేని కూడా నిర్మించింది.

అప్పుడు సోవియట్‌కు గాని, ఇప్పుడు అమెరికాకు గాని అఫ్ఘాన్ నుంచి వెళ్లిపోడమంటే వాటి సైన్యాలను ఉపసంహరించుకోడం మాత్రమే, భారత దేశ పరిస్థితి అటువంటిది కాదు. అఫ్ఘాన్‌లోని భారతీయుల రక్షణ, అలాగే అక్కడ పెట్టిన పెట్టుబడుల విలువను నష్టపోకుండా చూసుకోడంతోబాటు మొత్తంగా దేశ భద్రతను సురక్షితంగా కాపాడుకోడం ఇండియాకు ఒక పెద్ద సవాలుగా మారింది. తాలిబన్లకు పాకిస్తాన్‌తో విడదీయలేని పటిష్ఠమైన బంధం ఏర్పడి ఉంది. ఇంత కాలం వారికి పలు విధాలుగా పాకిస్తాన్ తోడ్పడింది. అఫ్ఘాన్ వారి వశం కావడంతో మన కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను ఉసిగొల్పి పంపించే పాకిస్తాన్ విద్రోహకాండ మరింత పెరిగే అవకాశాలున్నాయి. నేరుగా తాలిబన్ల నుంచి కూడా ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది. రష్యా, చైనా, ఇరాన్ వంటి సమీప దేశాలు తాలిబన్లను గుర్తించి వారితో మంచి సంబంధాలు నెలకొల్పుకుంటే ఈ ప్రాంతంలో మనం ఒంటరి అయిపోయే ప్రమాదముంది. అందుచేత తాలిబన్ల ఏలుబడిలోని అఫ్ఘానిస్తాన్‌తో భారత్ స్వతంత్ర సంబంధాలను పెట్టుకోవాలా, అమెరికాతో కలిసి నడవాలా అనేది నేడున్న క్లిష్టమైన సమస్య. అమెరికా ఏమేరకు మనకు తోడుగా నిలుస్తుందనేది కీలకం. అందుచేత మన పాలకులు ఈ దశలో విజ్ఞతతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News