Wednesday, May 1, 2024

ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

Union Cabinet approval To Electoral Reform Bill

నాలుగు సవరణలతో బిల్లు
శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌కు..
ఓటర్ కార్డుకు ఆధార్‌లింక్, ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటర్‌గా నమోదు కాకుండా అడ్డుకట్ట
కొత్త ఓటర్లకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం

న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. సంస్కరణల్లో చెప్పుకోదగిన ప్రధాన మార్పు ఆధార్‌తో ఓటర్‌కార్డును లింక్ చేయడం. దీని ద్వారా బోగస్ ఓట్లను కట్టడి చేయొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. కొందరు పలు చోట్ల ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకుంటున్నట్టు కమిషన్ పరిశీలనలో తేలింది. దానిని అరికట్టేందుకు ఆధార్‌తో లింక్ చేయడమే సరైందని పలువురు సూచించారు. అయితే, ఆధార్‌లింక్ విషయంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మరో సంస్కరణ నూతన ఓటర్ల నమోదుకు సంబంధించింది. ఇప్పటివరకు ప్రతిఏటా జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారికి ఓటర్లుగా నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు. దీనిని ఇక ఏడాదిలో నాలుగుసార్లు కటాఫ్ తేదీల్లో లెక్కించేందుకు వీలు కల్పిస్తూ సవరించనున్నారు. ఇసి సూచనమేరకు న్యాయశాఖ ఈ సిఫారసును పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. కటాఫ్ తేదీలుగా జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1లను ఇసి సూచించింది. మరో సవరణ సర్వీస్ ఓటర్ల విషయంలో లింగ తటస్థత పాటించడం. ఇప్పటివరకూ సైనిక సిబ్బంది విషయంలో ఉద్యోగి భార్యకు సర్వీస్ ఓటర్‌గా వీలు కల్పించారు. మహిళ సైనిక ఉద్యోగి అయితే భర్తకు ఆ అవకాశం లేదు. దీనిని సవరించి భార్య అనే పదం స్థానంలో జీవితభాగస్వామి అనే పదాన్ని చేర్చి భర్తకు కూడా వీలు కల్పించనున్నారు. మరో సవరణ.. ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రభుత్వ భవనాలనైనా వాడుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారం కల్పించేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News