Monday, April 29, 2024

రిజిజు బదిలీ!

- Advertisement -
- Advertisement -

సింహం జూలు పట్టుకొని, దాని మీది నుంచి, కింది నుంచి కుప్పిగంతులేసి మీసం మెలేసిన చిట్టెలుక మాదిరి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజుని న్యాయశాఖ నుంచి తప్పించడం ఊహించని పరిణామమే. ఒక చిన్న మంత్రివర్గం మార్పు చేపడుతూ కేంద్రం గురువారం నాడు రిజిజును, ఆ శాఖలోని జూనియర్ మంత్రి ఎస్‌పి సింగ్ బఘేల్‌ను ఇతర శాఖలకు బదిలీ చేసింది. రిజిజును అప్రధానమైన భూశాస్త్రాల మంత్రిత్వ శాఖకు పంపించింది. బఘేల్‌ను ఆరోగ్యశాఖ సహాయ మంత్రిని చేసి స్వతంత్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. రిజిజు స్థానంలో నియమించిన అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ను కూడా సహాయ మంత్రి నుంచి స్వతంత్ర శాఖను నిర్వహించే స్థాయికి పెంచింది. భారీ స్థాయి మంత్రివర్గ మార్పులో భాగంగా ఎవరిని ఏ శాఖ నుంచి వేరే యే శాఖకు బదిలీ చేసినా దానికి చెప్పుకోదగిన ప్రత్యేకత వుండదు. కాని పనికట్టుకొని ఒకే ఒక్క శాఖ మంత్రుల బదిలీకి ప్రధాని సిఫారసు చేయడం, దానిని రాష్ట్రపతి ఆమోదించడం విశేష పరిణామమే.

రిజిజును తప్పించడం వెనుక వున్న కారణాలేమిటో కేంద్రంలోని పెద్దలెవరూ పెదవి విప్పనప్పటికీ ఆయన న్యాయ శాఖ మంత్రిగా నిర్వహించిన పాత్ర ప్రభావం ఈ బదిలీ మీద విశేషంగా వున్నట్టు స్పష్టపడుతున్నది. ఉన్నత న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలపై కొలీజియం వ్యవస్థ కొనసాగడాన్ని రిజిజు తాను ఆ మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి అదే పనిగా దుయ్యబట్టారు. ఒక దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గోళ్ళుగిల్లుకుంటూ కూర్చొంటున్నారనే ధ్వనితో మాట్లాడారు. ఇటీవలి కాలంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఈయనికి జంట స్వరంగా రంగ ప్రవేశం చేశారు. కొలీజియం సిఫారసు చేసినవారిని ఉన్నత న్యాయమూర్తులుగా వెంట వెంటనే నియమించకుండా కేంద్రం ఆ ఫైళ్ళపై తిష్ఠవేసుకొని కూర్చోడం అంతకు ముందు నుంచి వున్నదే. అది నిశ్శబ్దంగా చేస్తూ వుండిన ఈ సహాయ నిరాకరణకు కిరెన్ రిజిజు శబ్ద సహకారం ఇవ్వడం ప్రారంభించారు. న్యాయమూర్తులను ఒకేసారి నియమిస్తారని, వారికి ఎన్నికలు వుండవని, ప్రజల ఎంపికకు వారు గురికారని ఒకసారి రిజిజు నోరు పారేసుకున్నారు. దానితో జస్టిస్ ఎస్‌కె కౌల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

కొలీజియం అనేది రాజ్యాంగ ధర్మాసనం ధ్రువపరిచిన వ్యవస్థ అని, అది ఈ భూన్యాయమని, దాని మీద నోరు చేసుకుంటే చర్య తీసుకోడానికి వెనుకాడబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయినా రిజిజు వాగుడు ఆగలేదు. సుప్రీంకోర్టు ఏయే కేసులను విచారించాలో నిర్దేశించే స్థాయికి ఆయన వాచాలత్వం పెరిగిపోయింది. సుప్రీంకోర్టే బెయిల్ దరఖాస్తులపై విచారణ చేపడితే, చిల్లరమల్లర ప్రజాప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) విచారిస్తే దాని భారం విపరీతంగా పెరిగిపోతుందని రిజిజు వ్యాఖ్యానించారు. దానితో తమకు ఏదీ చిన్న కేసు లేదా పెద్ద కేసు కాబోదని అన్ని కేసులు ఒకటేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) వ్యాఖ్యానించారు.రిటైర్డ్ న్యాయమూర్తులు ప్రభుత్వం మీద వ్యాఖ్యానించడాన్ని రిజిజు ప్రశ్నించారు. ఇలా ఒకటేమిటి అనేక రకాలుగా ఆయన తన లేకితనాన్ని ప్రదర్శించుకొన్నారు. 22 మాసాలుగా రిజిజు దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థపైనే ఇలా వదరుతూ వుంటే పల్లెత్తు మాట అనని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఉన్నపళంగా ఆయనను అక్కడి నుంచి పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్ చేయడం వెనుక వున్న ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది

. బిజెపి 2014లో కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆ ఏడాది ఆగస్టులో న్యాయ వ్యవస్థ నియామకాల కోసం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)ను ఏర్పాటు చేస్తూ అందుకోసం రాజ్యాంగం 99వ సవరణను తీసుకొచ్చింది.ఈ సవరణను ఆ ఏడాది ఆగస్టు 13న లోక్‌సభ, 14న రాజ్యసభ ఆమోదించాయి. ఆ తర్వాత 16 రాష్ట్రాల శాసన సభలు కూడా పచ్చ జెండా ఊపాయి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర కూడా పడింది. అయితే 2015 అక్టోబర్ 16న సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 4:1 తేడాతో ఎన్‌జెఎసి వ్యవస్థను రద్దు చేసింది. అప్పటి నుంచి ఉన్నత న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలపై కొలీజియం నిర్ణయాలే చెల్లుబాటు అవుతున్నాయి.ఆ వ్యవస్థకు చాలా కాలం తలొగ్గిన ప్రధాని మోడీ ప్రభుత్వం ఉన్నట్టుండి దానికి అభ్యంతరాలు చెప్పడం ప్రారంభించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకొన్న తర్వాత కొలీజియంను ప్రశ్నించడమంటే కేంద్రంలోని బిజెపి పాలకులు న్యాయ వ్యవస్థను కాషాయీకరణ చేయాలనుకొంటున్నారని అనుమానించవలసి వస్తుంది. రిజిజును తప్పించడం ద్వారా మోడీ ప్రభుత్వం కొలీజియంను పూర్తిగా అంగీకరించదలచిందని భావించవచ్చా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News