Saturday, April 27, 2024

గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు.. పోలీసులపై ప్రతిపక్షాల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు
కుటుంంబసభ్యులను బలవంతంగా శ్మశానవాటికకు తరలించిన వైనం
యుపి పోలీసుల తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం

UP Gang rape victim cremated by Police

హాత్రాస్:ఉత్తర్‌ప్రదేశ్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు పోలీసులే అర్థరాత్రి నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాత్రాస్ గ్రామంలో సెప్టెంబర్ 14న అత్యాచారానికి గురైన దళిత యువతి(19) ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న చనిపోయిన విషయం తెలిసిందే. బాధితురాలి అంత్యక్రియల్ని అర్ధరాత్రి నిర్వహించేలా స్థానిక పోలీసులు ఒత్తిడి చేశారని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం కుటుంబసభ్యుల ఇష్టానుసారమే అంత్యక్రియలు జరిగాయని అంటున్నారు. కుటుంబసభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న మృతురాలి తల్లిని బలవంతంగా పక్కకు నెట్టి అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల చర్యతో యుపిలోని బిజెపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లారని ఆమె సోదరుడు తెలిపారు. మృతదేహాన్ని తమకు అప్పగిస్తే తామే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని చెబితే పోలీసులు అంగీకరించలేదని ఆయన తెలిపారు. కుటుంబసభ్యులకన్నా ముందే మృతదేహాన్ని పోలీసులు హాత్రాస్‌కు తీసుకెళ్లారు. తన తండ్రితోపాటు తమను హాత్రాస్‌కు మరో వాహనంలో తీసుకెళ్లారని బాధితురాలి సోదరుడు తెలిపారు. అక్కడికి చేరుకోగానే నేరుగా అంత్యక్రియలు జరిగే చోటికి తమను లాక్కెళ్లారని ఆయన తెలిపారు. బుధవారం తెల్లవారుజామున రెండున్నర 3 గంటల మధ్య అంత్యక్రియలు నిర్వహించారని ఆమె తండ్రి తెలిపారు. పోలీస్ పహారా మధ్య బూల్‌గర్వీ గ్రామ సమీపంలోని శ్మశానవాటికలో బాధితురాలి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె తండ్రితోపాటు 3040మంది బంధువులు ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి అన్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె ట్విట్ చేశారు. బాధితులకు రక్షణ కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం, మరణం తర్వాత కనీస మానవ హక్కులను కూడా వారికి నిరాకరించిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం నేరానికి పాల్పడ్డదని సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ మండిపడ్డారు.

దర్యాప్తునకు సిట్ ఏర్పాటు: యోగి ఆదిత్యనాథ్
గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డవారిని క్షమించబోమని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రధాని మోడీ ఈ సంఘటనపై తనతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రధాని తనకు సూచించారని ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వారం రోజుల్లో సిట్ నివేదిక ఇస్తుందని తెలిపారు. సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరనున్నట్టు తెలిపారు.

UP Gang rape victim cremated by Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News