Monday, May 6, 2024

మంచుతో లాక్ డౌన్.. అమెరికా టెక్సాస్ హోం అరెస్టు

- Advertisement -
- Advertisement -

మంచుతో లాక్ డౌన్.. అమెరికా టెక్సాస్ హోం అరెస్టు
మంచినీటికి కటకట, మూసుకుపోయిన దారులు
విద్యుత్ లేక విలవిల, ధైర్యవంతులకే బతికే ఛాన్సన్న మేయర్

డల్లాస్(అమెరికా): మంచినీటి పైపులలో మంచుపేరుకుపోయింది. గడ్డకట్టించే చలిని తరిమివేసేందుకు ఏర్పాటు చేసుకున్న హీటర్లు విద్యుత్ లేకపోవడంతో పనిచేయడం లేదు. బయటకు వెళ్లుదామనుకుంటే దారిలేకుండా పర్చుకున్న మీటర్ల కొద్ది హిమపాతం. ఇళ్లకు అందని నిత్యావసర సరుకులు. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో ఇప్పుడు నెలకొన్న దారుణ పరిస్థితులు ఇవి. గత వారం రోజుల క్రితం టెక్సాస్ ప్రాంతంలో అసాధారణ స్థాయిలో తలెత్తిన మంచుతుపాన్‌తో ఆస్టిన్, డల్లాస్, జార్జియా ఇతర ప్రాంతాలు మునుపెన్నడూ లేనంత స్థాయిలో భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తిరిగి మరోమారు భారీ మంచు తుపాన్ సంభవించనుండటంతో టెక్సాస్‌వాసులు తల్లడిల్లిపోతున్నారు. దేశంలో విద్యుత్ నిర్వహణ చేయలేని దుస్థితిలో ఇప్పుడు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ చేతులెత్తేసింది. మరో నాలుగయిదు రోజుల వరకూ టెక్సాస్ ప్రాంతంలో అత్యధిక శాతం ప్రజలకు విద్యుత్ సరఫరా ఉండదని, ఇందుకు అనుగుణంగా అంతా సన్నద్ధం కావల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అత్యంత శీతల పరిస్థితులు దీనితో విపరీతంగా పెరిగిన విద్యుత్ డిమాండ్, దీనికి అనుగుణంగా సరఫరా చేయలేక పవర్ గ్రిడ్‌ల వైఫల్యం వంటివి ఇప్పుడు ప్రజలను సంకట స్థితికి తెచ్చాయి. దక్షిణాది రాష్ట్రాలను మంచు ముంచేసింది. విమానాలు రద్దు అయ్యాయి. దాదాపుగా 15 కోట్ల మంది అమెరికన్లు మంచుతో బందీ జీవితాలు గడపాల్సి వస్తోంది. టెక్సాస్ ఇతర ప్రాంతాలలో దాదాపు 40 లక్షల మందివరకూ నీళ్లు కరెంట్ లేకపోవడంతో తల్లడిల్లుతున్నారు. కెంటకీలో బలీయమైన చల్లగాలులు వీస్తున్నాయి. లూసియానా ఆస్టిన్ వంటి ప్రాంతాలలో అర్కిటిక్ నుంచి వీస్తున్న చలిగాలులతో అసాధారణ పరిస్థితి ఏర్పడింది
డల్లాస్‌లో ఫ్యాన్లకు మంచు శిలాఫలకాలు
గడ్డకట్టుకుపోయిన మంచు దృశ్యాలు వీధులలోనే కాకుండా ఇళ్లల్లోనూ కన్పిస్తున్నాయి. నల్లజాతీయుడైన థామస్ తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌పై పేరుకుపోయిన మంచు ఫలకాలు కిందికి వేలాడుతున్న ఫోటోలను నెట్‌లో పెట్టారు. తన నివాసం పరిస్థితి ఇదని, ఫ్యాన్లకే కాకుండా ఇళ్ల గోడలు కూడా మంచుతో నిండిపోతున్నాయి. ఇక పలువురి ఇళ్ల బాత్‌టబ్‌లు గడ్డకట్టుకుపొయ్యాయి. ఇప్పుడు ఇంటినిండా కావల్సినంత ఐస్ ఉందని, తాగడానికి, స్నానానికి నీరే కరువు అయిందని పౌరులు తమ ఇళ్ల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తమకు దండిగా పుస్తకాలు పంపించడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీవీలు, క్రమేపీ ఫోన్లు కూడా పనిచేయని స్థితి ఏర్పడుతూ ఉండటంతో బోర్‌ను భరించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పై కప్పులపై రోజుల తరబడి మంచుపేరుకుని పోవడం ఇది క్రమేపీ కరిగి పై భాగాలు కూలడం, మంచుధాటికి కిటికీ అద్దాలు పగలడం, పైపులైన్లు పగలడం వంటి పలు పరిణామాలు జరుగుతున్నాయి.
72 ఏండ్లలో ఎప్పుడూ లేని హిమపాతం
ఉత్తర టెక్సాస్‌లో 72 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొంది. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు పాటుపడుతున్నారు. ఇప్పటివరకూ 30 లక్షల మంది విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాడిసన్ కౌంటీలలో మిస్సిస్సిపీ నది గడ్డకట్టుకుపోయింది. నీళ్లు వెదజల్లే ఫౌంటన్‌లు ఇప్పుడు గడ్డకట్టుకుపోయి నిశ్చల చిత్రాలుగా మారాయి. పలు చోట్ల వాల్‌మార్ట్ ఇతరత్రా ప్రధాన మార్కెట్లు మూతపడ్డాయి. కొరియర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. డల్లాస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మంచుతో నిండిపోవడంతో దీనిని తొలిగించేందుకు సహాయక సిబ్బంది పాటుపడుతోంది. టెక్సాస్‌లో అన్ని చోట్లా విమాన ఇతరత్రా రవాణ వ్యవస్థ దెబ్బతింది.
ధైర్యంగా ఉండే వారే బతుకుతారు
ట్వీటు వెలువరించిన మేయర్ రాజీనామా
ప్రస్తుత ఐస్ సంక్షోభం దశలో ధైర్యంగా ఉండే వారు ఉంటారు. మిగిలిన వారు అంతరించిపోతారని కామెంట్స్ చేసిన వెస్ట్ టెక్సాస్ మేయర్ టిమ్ బాయ్డ్ తన వ్యాఖ్యలకు తాను చింతించడం లేదంటూ పదవికి రాజీనామా చేశారు.కొలరాడో సిటీ మేయర్ అయిన టిమ్ ప్రస్తుత స్థితిలో ప్రజలను ఆదుకునే విషయంలో స్థానిక ప్రభుత్వాలు ఏమీ చేయలేవని, ఎవరికి వారు సరైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే బతికి బయటపడుతారని వ్యాఖ్యానించారు. నగరం, కౌంటీ, విద్యుత్ పంపిణీ సంస్థలు లేదా ఇతరత్రా సేవల వారు అసాధారణ స్థితిలో ఎంతకని ఏమైనా చేస్తారని తెలిపారు. ప్రజలను రక్షించే బాధ్యత ఏమీ లేదన్నారు. ఎవరికి వారే ధైర్యం తెచ్చుకుని ఉండాలని, బలహీన మనస్కులు ఉండలేరని తెలిపారు.
మంచుతుపాన్లతో 20 మంది దుర్మరణం
చలిలో అమెరికాలోని టెక్సాస్ జనం అల్లాడుతోంది. జనజీవనం దెబ్బతిన్న దేశంలో ఇప్పుడు మంచుతో కరోనా వ్యాక్సిన్లు కూడా గడ్డకట్టుకుపోయిన స్థితి ఏర్పడింది. పలు ప్రాంతాలో వ్యాక్సిన్ల పంపిణి నిలిచిపోయింది. నార్త్ కరోలినాలో టోర్నడోలతో ముగ్గురు మృతి చెందారు. మరికొన్ని రోజులు హిమపాతం తప్పదని అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాలలో వేలాది విమానాలు తెల్లపోయిన విమానాశ్రయాలలో నిలిచిపొయ్యాయి. టెక్సాస్ పరిసరాలలో నీళ్లు లేక దాదాపు 40 లక్షల మందికి అవస్థలు . టెక్సాస్, అలబామా, ఒరేగాన్, ఒక్లహోమా,కెన్సస్, కెంటకీ, మిసిసిపి రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి విధించారు. ఇప్పటికే తుపాన్లు ఇతరత్రా 20 మంది వరకూ బలి అయ్యారని వివిధ ప్రాంతాల సమాచారంతో నిర్థారణ అయింది.
భారతీయ యువతరానికి అపరిచిత సంకట స్థితి
భారతదేశం నుంచి ప్రత్యేకించి తెలుగురాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐటి యువత కుటుంబాలతో పాటు టెక్సాస్‌ను కేంద్రంగా చేసుకుని నివసిస్తోంది. వారిలో చాలా మందికి ఇక్కడి ఇప్పటి వాతావరణం చాలా అసాధారణంగా మారింది. తాము ఇక్కడికి వచ్చిన తరువాత ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, సాధారణంగా వెలుపల వాతావరణం అసాధారణ రీతిలో చలిగా ఉంటే దానిని తట్టుకునేందుకు ఇళ్లలోతగు విధమైన హీటింగ్ అధునాతన ప్రక్రియలు ఉంటాయని, విద్యుత్ నిరంతరం ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సరఫరా అవుతుందని, అసలు అంతా సహజసిద్ధంగా జరిగే ప్రక్రియగా ఉంటుందని, పని ఒత్తిడి ఎంత ఉన్నా దీనికి మించిన రిలీఫ్ ఉండనే ఉండటం వంటివి తమ నిత్యజీవితంలో తెలియకుండానే సాగుతున్నాయని, అయితే ఇప్పుడు తమకు ఇక్కడి పరిస్థితితో బతుకు ఇంతటి అసాధారణంగా కూడా ఉంటుందా? అనే ఫీలింగ్ వస్తోందని అక్కడి భారతీయ యువత తెలిపింది.

US is Covered by snow with 21 inches on ground

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News