Saturday, April 27, 2024

వీసాలపై ట్రంప్ నిషేధం

- Advertisement -
- Advertisement -

US president Donald Trump ban on visas  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మితిమించిన జాతీయవాద ఉన్మాదాన్ని ప్రదర్శించడం అధికం చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ అన్న తన ప్రకటిత సిద్ధాంతాన్ని మరింతగా అమల్లోకి తీసుకు వస్తున్నాడు. అమెరికాకు అంతవరకు ఉన్న ఒక మాదిరి సమ్మిళిత లక్షణాన్ని, ప్రపంచ సారథి స్థాయిని ట్రంప్ పని కట్టుకొని శిథిలావస్థకు తెచ్చాడు. ప్రపంచీకరణ ద్వారా ఆంక్షలు లేని విశ్వాన్ని ఆవిష్కరించామని చెప్పుకున్న చోటనే తిరిగి స్వీయ రక్షణ విధానాలను ప్రవేశపెట్టాడు. తాజాగా సోమవారం నాడు హెచ్1బి తదితర వీసాల జారీపై ఈ సంవత్సరాంతం వరకు నిషేధాన్ని విధించి తన ఓటు బ్యాంకును సంతృప్తి పరిచే వ్యూహానికి తెర తీశాడు.

ఈ వీసాలను లాటరీ పద్ధతిపై కేటాయించే విధానానికి స్వస్తి చెప్పాడు. మెరిట్ ఆధారంగా, అత్యధిక జీతాలకు అర్హులైన విదేశీయులకే అవకాశం ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. గతంలో మాదిరిగా సునాయాసంగా అమెరికా వెళ్లి ఆ దేశ అభివృద్ధికి తోడ్పడి బాగుపడాలనుకునే ఇతర దేశాల యువతకు ఇది అత్యంత నిరాశాజనకమైన పరిణామం. అమెరికాలోని కంపెనీలలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించి అక్కడ నిరుద్యోగాన్ని తగ్గించేందుకే వీసాల మంజూరీపై వేటు వేస్తున్నట్టు ట్రంప్ చెప్పుకున్నాడు. 2020 ఫిబ్రవరి, ఏప్రిల్ మాసాల మధ్య దేశంలోని కీలక పరిశ్రమల్లో 20 మిలియన్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, ఆ ఖాళీలను ఆయా కంపెనీలు ఇప్పుడు హెచ్ 1బి, ఎల్ 1 వీసాదార్లతో నింపాలని చూస్తున్నాయని ఆరోపించాడు. 16, 19 ఏళ్ల వయసులోని అమెరికన్ యువతలో నిరుద్యోగం 29.9 శాతానికి చేరుకున్నదని, 2024 ఏళ్లలోని వారిలో 23.2 శాతం వద్ద ఉన్నదని వెల్లడించాడు.

హెచ్ 1బి, హెచ్2బి, జె, ఎల్ వీసాలు దేశంలో నిరుద్యోగాన్ని పెంచుతున్నాయని అందుకే ఈ నిషేధం విధిస్తున్నానని ప్రకటించాడు. అమెరికా ఏటా ఇస్తున్న 85,000 హెచ్ 1బి వీసాలు పొందుతున్న వారిలో 70 శాతం భారతీయ యువతే. ట్రంప్ విధించిన ఈ విధానం అధికంగా మన యువతరాన్నే నష్టపరుస్తుంది. అతడి ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీసాదార్లకు ఎటువంటి ఇబ్బంది కలుగదు. ఈ సమయంలో అమెరికా బయట ఉన్నవారు తిరిగి అక్కడికి వెళ్లలేరు. ఇండియా, చైనా తదితర అనేక దేశాలకు చెందిన విద్యావంతులైన యువత అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో చాలా మంది ముందుగా అక్కడ చదుకోడానికి వెళ్లి ఆ తర్వాత హెచ్1బి అర్హత పొంది ఉద్యోగాలలో చేరి అక్కడే స్థిరపడుతున్నారు. అమెరికా డాలర్‌కున్న అధిక విలువ, సాపేక్షంగా అక్కడి సమాజంలో గల ఎక్కువ స్వేచ్ఛ, సమానత్వం వంటివి వీరిని ఆకట్టుకుంటున్నాయి.

2018లో అమెరికాలో హెచ్ 1బి వీసాలు గల విదేశీయులలో భారతీయులే అత్యధికం 73.9 శాతం వరకు ఉన్నారు. ప్రతి ఐదుగురు హెచ్ 1బి వీసాదారులలో ముగ్గురు భారతీయులేనని అమెరికా అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఈ వీసాలపై అమెరికాలో గల మొత్తం విదేశీయుల సంఖ్య 4,19,637 కాగా అందులో 3,09,986 మంది భారతీయులే. ఇండియన్ల తర్వాత చైనీయులది రెండో స్థానం. అయితే వారు 11.2 శాతమే (47,172). చైనీయుల్లో 45.2 శాతం మహిళలుండగా, భారతీయులలో స్త్రీలు 20.4 శాతమే. అమెరికాలోని కంపెనీలలో ముఖ్యంగా అక్కడి భారతీయుల కంపెనీలలో స్థానికులను తీసుకుంటే యజమానులు అనేక అదనపు భారాలను భరించవలసి వస్తుంది. సంక్లిష్టమైన న్యాయ నిబంధనలను సంతృప్తి పరచవలసి ఉంటుంది. దేశంలో ఎక్కడికైనా వెళ్లి పని చేయాలన్న నియమం ఉన్నప్పటికీ అమెరికన్ ఉద్యోగులు అందుకు ఇష్టపడరు, కట్టుబడి ఉండరు.

అటువంటి వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవు. అమెరికాలోని విప్రో వంటి భారతీయ ఐటి కంపెనీలు స్థానికులైన ఉద్యోగుల నుంచి ఇటువంటి వ్యాజ్యాలను ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు అమెరికన్ యువతలో ఐటి నిపుణులు తక్కువ మంది ఉంటారు. అందుచేత అక్కడి అమెరికన్ కంపెనీలు కూడా ఇండియా వంటి దేశాల నుంచి వచ్చే ఐటి నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తున్నది. జీతాలు, భత్యాల విషయంలో కూడా అమెరికన్లు విదేశీ యువత కంటే ఖరీదైన వారు. అక్కడి కంపెనీలు అమెరికన్ ఉద్యోగులపై పెట్టే వ్యయం కంటే భారత, తదితర విదేశాల యువత కింద భరించే ఖర్చు 20 శాతం తక్కువ. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అక్కడి భారతీయ ఐటి కంపెనీలు అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకోడం పెంచాయి. అయినా వాటికి స్వదేశీ పక్షపాతం అనే ముద్ర చెరగడం లేదు. ట్రంప్ సంతృప్తి పడడం లేదు. వచ్చే నవంబర్ ఎన్నికల్లో గెలిచి అతడు మళ్లీ అధ్యక్షుడయితే ఈ విధానాల కాఠిన్యత ఇంకా పెరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News