Wednesday, May 1, 2024

అమెరికా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ భేటీ

- Advertisement -
- Advertisement -

US Secretary of Defence Esper meets Minister Rajnath Singh

 

నేడు 2+2 మంత్రులస్థాయి చర్చలు
పాల్గొననున్న ఇరు దేశాల విదేశాంగ మంత్రులు

న్యూఢిల్లీ: అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ టి ఎస్పర్‌తో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. మంగళవారం ఇరు దేశాల మధ్య 2 +2 మంత్రులస్థాయి చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులు ఈ చర్చల్లో పాల్గొంటారు. చర్చల కోసం అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో కూడా సోమవారమే భారత్ చేరుకున్నారు. ప్రధాని మోడీతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌తోనూ అమెరికా మంత్రులు భేటీ కానున్నారు.

ఇప్పుడు జరిగేవి థర్డ్ ఎడిషన్(మూదో దఫా) చర్చలు. 2018 సెప్టెంబర్‌లో ఢిల్లీలో, 2019 డిసెంబర్‌లో వాషింగ్టన్‌లో 2+2 చర్చలు జరిగాయి. చైనాతో ఎల్‌ఎసి వద్ద ఉద్రిక్తతలు, ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య జరిగే 2+2 మంత్రులస్థాయి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రక్షణ, నిఘాకు సంబంధించిన అంశాల్లో సహకారం కోసం ఇరు దేశాల మధ్య ఇప్పటికే లెమోవా(2016), కోంకాసా(2018)  పేరుతో ఒప్పందాలు జరిగాయి. ఈసారి చర్చల సందర్భంగా బెకా(బేసిక్ ఎక్ఛేంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రీమెంట్) పేరుతో మరో కీలక ఒప్పందం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య సైనిక సాంకేతికత ,ఉపగ్రహాలు అందించే నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వీలు కలుగుతుంది. దాంతో, సరిహద్దుల వెంట పాకిస్థాన్, చైనాలు చేసే కుట్రలను తెలుసుకోవడంలో అమెరికా ఉపగ్రహాలు అందించే సమాచారం భారత సైన్యానికి తోడ్పడుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News