Monday, April 29, 2024

అన్నాడిఎంకె నేతను నేనే

- Advertisement -
- Advertisement -

VK Sasikala hoists party flag at MGR memorial

ఎంజిఆర్ స్మారకస్థలిలో శశికళ

చెన్నై : దివంగత నాయకురాలు జయలలిత నెచ్చెలి వికె శశికళ ఆదివారం తమ రాజకీయ సందడిని ఉధృతం చేశారు. తనను బహిష్కరించిన అన్నాడిఎంకె పార్టీలో అంతా తానే అని పరోక్షంగా తెలిపారు. తానే పార్టీకి ప్రధాన కార్యదర్శిని అని శిలాఫలకం సాక్షిగా తెలియచేసుకున్నారు. ఆదివారం తన అనుచరులు వెంటరాగా పార్టీలో ఇంతకు ముందటి చిన్నమ్మ శశికళ స్థానికంగా ఉన్న ఎంజిఆర్ స్మారక స్థలి వద్దకు వెళ్లారు. తొలుత పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అక్కడ అన్నాడిఎంకె పార్టీ పతాకం ఎగురవేశారు. ఆ తరువాత తన పేరు పక్కన అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి అని తెలిపే ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనితో పార్టీ వర్గాలలోనే కాకుండా తమిళనాడు రాజకీయాలలో శశికళ తదుపరి అడుగు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కరోజు క్రితమే శశికళ ఇక్కడి జయలలిత సమాధి వద్దకు వెళ్లి తదేక ధ్యానంతో గడిపారు. పార్టీకి ఉజ్వలభవిత ఉంటుందని విలేకరులకు తెలిపారు. ఇప్పుడు పార్టీ వ్యవస్థాపక నాయకుడు ఎంజిఆర్ స్మారకస్థలికి వెళ్లిన దశలో ఆమె విలేకరులతో కొద్ది సేపు మాట్లాడారు. చాలా కీలక సంకేతాలు వెలువరించారు.

పార్టీ కోసం, తమిళ ప్రజల కోసం అంతా ఒక్కటిగా కలిసినడవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీని పటిష్టం చేయాల్సి ఉంది. తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చి ప్రజల సంక్షేమానికి పాటుపడటం ప్రాధాన్యతాంశం అన్నారు. అంతకు ముందు శశికళ రామాపురంలోని ఎంజిఆర్ ఇంటికి వెళ్లారు. జైలునుంచి వచ్చిన తరువాత ఆమె ఎంజిఆర్ నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. అక్కడ కొద్దిసేపు ఉన్న తరువాత నేరుగా ఎంజిఆర్ స్మారక స్థలికి వెళ్లారు. పార్టీ వ్యవస్థాపక నేతల సంస్మరణతో పార్టీ వర్గాలలో తన పట్ల సెంటిమెంట్‌ను దట్టించుకుని తరువాతి క్రమంలో పార్టీ సారధ్యం దిశలో ఆమె కీలక ప్రకటనకు దిగుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఆమెకు ఆ హక్కులేదు : పార్టీ నేత జయకుమార్

శశికళ ఆదివారం ఎంజిఆర్ స్మారకస్థలి వద్ద జెండా ఎగురవేయడం, తనను తాను ప్రధాన కార్యదర్శి అని ప్రకటించుకోవడం వంటి పరిణామాలపై పార్టీ సీనియర్ నేత , మాజీ మ ంత్రి డి జయకుమార్ స్పందించారు. జెండా ఎగురవేసే హక్కు ఆమెకు లేదని, పార్టీ ప్రధాన కార్యదర్శి అని తెలిపే చర్యకు దిగడం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధం అని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News