Thursday, May 9, 2024

సిఎం కెసిఆర్ ఢీకొట్టే స్థాయి ఎవరికి లేదు: ప్రభుత్వం విప్ వినయ్‌ భాస్కర్

- Advertisement -
- Advertisement -

 Whip Vinay Bhaskar fires on Etela Rajender

సిఎం కెసిఆర్ ఢీ కొట్టే స్థాయి ఎవరికి లేదు
ఇంకా వందేళ్ళు టిఆర్‌ఎస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది
ఈటెల, తరుణ్‌ఛుగ్‌లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా ఏమిచేయలేరు
ఈటెల పోరాటమంతా తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే
ధ్వజమెత్తిన రాష్ట్ర ప్రభుత్వం విప్ ధాన్యం వినయ్‌ భాస్కర్

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఈటెల తరం కాదని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధాన్యం వినయ్‌ భాస్కర్ అన్నారు. ఆయనతో పాటు తరుణ్ ఛుగ్ లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా సరే టిఆర్‌ఎస్‌ను ఏమి చేయలేరన్నారు. ఇంకా వందేళ్లు పార్టీ సుస్థిరంగా ఉంటుందన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని కేవలం తెలంగాణ ప్రజలే కాకుండా దేశం యావత్తు కోరుకుంటున్నదన్నారు. మంగళవారం టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కెసిఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్‌ను ఢీ కొట్టే స్థాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీకి లేదన్నారు. కేవలం ఈటెల అవినీతి వ్యవహరాన్ని సిఎం ప్రశ్నించిన కారణంగానే ఈటెల టిఆర్‌ఎస్ వీడి బిజెపిలో చేరారన్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్నది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం కాదన్నారు. కేవలం ఆస్తులు, అస్తిత్వ పోరాటంగా వినయ్‌భాస్కర్ అభివర్ణించారు. టిఆర్‌ఎస్‌ను వీడి బిజెపిలో చేరిన ఈటెలకు ఆ పార్టీ జాతీయ నేతల నుంచి ఏ మేరకు గౌరవం లభించిందో ప్రజలకు తెలిసిందేనని అన్నారు. బిజెపి జాతీయ నాయకుల మందు ఇప్పుడే తేలిపోయిన ఈటెలకు మునుముందు మరిన్ని అవమానాలకు గురికావడం తథ్యమన్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ ఇచ్చే గౌరవం అపారమైనదన్నారు. సమస్యల గురించి వెళితే సిఎంతో లంచ్ చేసిన అనుభవాలు అనేకం ప్రజా ప్రతినిధులకున్నాయని వినయ్‌భాస్కర్ గుర్తు చేశారు.

టిఆర్‌ఎస్‌లో అందరికన్నా ఎక్కువ ప్రేమను, పదవులను కెసిఆర్ ఈటెల ఇచ్చారన్నారు. పార్టీ ఫ్లోర్ లీడర్, మంత్రి పదవులు కెసిఆర్ చలవ కాదా? అని ప్రశ్నించారు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఈటెలను తీసుకెళ్లింది టిఆర్‌ఎస్ కాదా? అని నిలదీశారు. ఆరేండ్ల క్రితమే ఆయన బిజెపిలో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారన్నారు. ఏమి ఆశించి కమలం పార్టీలో చేరారో రాష్ట్ర ప్రజలకు ఈటెల సమాధానం చెప్పాలన్నారు. పెట్రోలియం మంత్రి సమక్షంలో ఆయన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించమని అడగలేదెందుకు అని వ్యాఖ్యానించారు. అలాగే కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ఆ పార్టీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడే సిఎం కఠోర దీక్షతో పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజల హృదయాల్లో టిఆర్‌ఎస్ పదిలంగా ఉందని, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందన్నారు. టిఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఈటెల వెంట నడిచిన విద్యార్ధి, కుల సంఘాలు ఇపుడు ఆయన వెంట లేవనేనారు. కనీసం ఈటెల వెంట హుజురాబాద్ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ్వరూ వెళ్ళ లేదన్నారు. కెసిఆర్‌ను కాదని టిఆర్‌ఎస్‌ను వీడిన వాళ్ళు రాజకీయంగా కనుమరుగయ్యారన్నారు. కమలం వాడిపోతున్న పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీగా పెరిగాయి కనుకనే భూముల అమ్మకానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. దీనిపై కూడా ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం సిగ్గుచేటన్నారు.
అనంతరం ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టునని చెప్పుకుంటున్న ఈటెల బిజెపిలో ఎలా చేరారనని ప్రశ్నించారు. ఆ పార్టీకి మత రాజకీయాలు తప్ప మరేమి చేతకాదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామన్న హామీల్లో బిజెపి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. పైగా కేంద్ర సంస్థలన్నిటిని ఆ పార్టీ ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడే హక్కు బిజెపికి లేదన్నారు. తెస్తున్న అప్పులన్నీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికే సిఎం వెచ్చిస్తున్నారన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలే కనిపించేవని, కానీ సిఎంగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత అవి పూర్తిగా ఆగి పోయాయన్నారు. విద్య, వైద్య రంగాల మీద కెసిఆర్ పెడుతున్న శ్రద్ధ మరే దేశంలో పెట్టడం లేదన్నారు.

 Whip Vinay Bhaskar fires on Etela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News