Saturday, April 27, 2024

ఢిల్లీలో లేడీ సింగం.. కిడ్నాపర్లను చిత్తుచేసి బిడ్డను కాపాడుకుంది

- Advertisement -
- Advertisement -

Woman fights Kidnapers to save her daughter in Delhi

న్యూఢిల్లీ: ఓ తల్లి తన నాలుగేళ్ల బిడ్డను రక్షించుకునేందుకు ఝాన్సీ లక్ష్మిభాయి అయింది. బాలిక అయిన తన బిడ్డను ఎత్తుకెళ్లడానికి వచ్చిన దుండగులను వీరోచితంగా అడ్డుకుంది. ఈ ఘటన దేశ రాజధానిలో జరిగింది. తూర్పు ఢిల్లీలో ఈ తల్లి మోటారు సైకిల్ల్‌పై వచ్చిన దుండగులను అడ్డుకోవడం, తన పాపను రక్షించుకున్న క్రమం అంతా అక్కడి సిసిటీవీ కెమెరాలలో నిక్షిప్తం అయింది. మంగళవారం జరిగిన ఈ తల్లిపోరు తెలిపే దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ప్రచారం పొందాయి. తన బావ 27 ఏండ్ల ఉపేందర్ కిడ్నాపర్లను కిరాయికి తీసుకుని ఈ బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశాడు. బిడ్డను ఎత్తుకెళ్లి తండ్రి నుంచి భారీగా సొమ్ము రాబట్టుకోవాలని వ్యూహం పన్నాడు. డబ్బుకోసం గడ్డి తినే స్వభావపు ఈ వ్యక్తి వరుసకు పాపకు పెద్దనాన్ననే అవుతాడు. కృష్ణానగర్ వాసి అయిన ఉపేందర్ తన సోదరుడి నుంచి పరిహారం పొందాలనుకున్నాడు. బిడ్డను ఎత్తుకొచ్చి సినిమా తరహాలో తల్లిదండ్రులనుంచి కనీసం 30-40లక్షల రూపాయల వరకూ లాగుదామనుకున్నాడు. బిడ్డను ఎత్తుకుని వెళ్లేందుకు వచ్చిన దుండగులను తల్లి తరిమికొట్టింది. బిడ్డ కిడ్నాప్ కాకుండా చూసుకుని ఎదకు హత్తుకుంది. దుండగులు స్పీడ్‌గా బైక్‌లపై వచ్చి బిడ్డను తీసుకుని పోతూ ఉండగా గమనించిన తల్లి వారిని అడ్డగించింది. బైక్‌పై ఉన్న దుండగుడిని బలంగా నెట్టివేసింది. దీనితో బైక్ కిందపడింది. బైక్‌పై ఉన్న ఇద్దరు తరువాత తేరుకుని బైక్ తీసుకుని ఉడాయించారు.

ఈ లోగా వారి చేతుల్లో నుంచి బిడ్డను తల్లి లాక్కుంది. సంఘటనాస్థలి నుంచి వారిని పట్టుకునేందుకు పలువురు స్థానికులు యత్నించారు. అయితే వారు చిక్కలేదు. వెంటనే ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకున్నారు. తరువాత గాలింపు చర్యలు చేపట్టగా కొంచెం దూరంలో దుండగులు వాడిన బైక్ పడేసి ఉంది. అక్కడనే పడి ఉన్న బ్యాగ్‌లో దేశవాళి పిస్టల్‌ను తూటాలతో ఉండగా కనుగొన్నారు. దుండగులలో ఒకరు ఇంట్లోకి వచ్చి నీళ్లు అడిగాడు. నీళ్లు తేవడానికి తల్లి బిడ్డతో పాటు లోపలికి వెళ్లుతుండగా దుండగుడు బిడ్డను తీసుకుని పారిపోయేందుకు యత్నించాడు. అప్పటికే బైక్‌పై ఉన్నవ్యక్తి ఇంజన్ ఆన్‌లో ఉంచి సిద్ధంగా ఉన్నాడు. అయితే తల్లి వారిని అడ్డుకోవడంతో వారి కిడ్నాప్ ప్రయత్నం బెడిసికొట్టిందని పోలీసులు తెలిపారు. వారం రోజులుగా నిందితుడు ఈ ప్రాంతంలో రెకీ నిర్వహిస్తూ వస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యక్తి కదలికలను సిసిటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా గుర్తించారు. తరువాత జరిగిన దర్యాప్తు క్రమంలో బైక్‌పై ఉన్న నెంబర్ నకిలీది అని తేలింది. తరువాతి దశలో ధీరజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణ దశలో బిడ్డ పెద్దనాన్న ఉపేందర్ స్వయంగా కిడ్నాప్ కోసం తమను సంప్రదించినట్లు నిందితుడు తెలిపాడు.

బుధవారం ఉదయం ఉపేందర్‌ను ఇదే ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తూర్పు ఢిల్లీ డిసిపి జస్మీత్ సింగ్ తెలిపారు. ఉపేందర్ బాగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నందున కొంచెం ఆస్తిపరుడైన తమ్ముడి నుంచి డబ్బులాగాలని వ్యూహం పన్నాడు. తమ్ముడికి గాంధీనగర్‌లో బట్టలషాపు ఉంది. వ్యాపారంలో దండిగా డబ్బులు వస్తున్నాయని, వీరి బిడ్డను ఎత్తుకెళ్లితే డిమాండ్ చేసినంతగా ముడుతుందని ఉపేందర్ ప్లాన్ చేశాడు. తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు తన ఆప్తులిద్దరికి పని అప్పగించాడు. వీరిలో ఒకడు దొరికాడు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Woman fights Kidnapers to save her daughter in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News