Monday, May 6, 2024

ఆమెకు అంత సత్తా ఉందా?!

- Advertisement -
- Advertisement -

YS Sharmila promises Rajanna Rajyam in Telangana

తెలంగాణ గడ్డపై మరో కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తోంది. ఈ పార్టీకి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పుత్రిక, జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల నాయకత్వం వహించబోవడం అత్యంత చర్చనీయం అయింది. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ వైసిపి విజయానికి షర్మిల చేసిన కృషి ఎవరూ కాదనలేరు. 2012 అక్టోబర్ 18న ఆమె ప్రారంభించిన మహాప్రస్థానం పాదయాత్ర 2013 ఆగస్టు 4న ముగిసింది. 3000 కి.మీ. దూరం ఆమె చేసిన పాదయాత్ర భారతదేశంలోనే ఓ రికార్డు. ఆ రికార్డును తర్వాత ఏ మహిళా దాటలేదు. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జగన్ గెలుపు కోసం ‘ప్రజాతీర్పు -బైబై బాబు’ పేరున 1553 కి.మీ. బస్ యాత్ర చేపట్టి 39 సభల్లో ప్రసంగించి అందర్నీ ఆకర్షించింది. జగన్‌కు 151 స్థానాలు రావడంలో షర్మిల కూడా తనవంతు కృషి చేసింది. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక షర్మిల పాత్ర ముగిసిందనుకొన్నారు. పాలనాధికారంలో ఆమె ఎక్కడా ఏ విధంగా కూడా పాలుపంచుకోలేదు. వైసిపి అధికారానికొచ్చి రెండేళ్లు కావస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఈ నెల 9వ తారీఖున హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించి తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు దాదాపుగా ప్రకటించేసి తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఓ పెద్ద సంచలనానికి తెరతీశారు.

పది రోజుల పాటు అన్ని జిల్లాల్లోని వైఎస్‌ఆర్ అభిమానుల్ని కలిసి వారి మద్దతుతో కొత్త పార్టీ ప్రకటిస్తానని ఆమె ప్రకటించేశారు. ఆనాటి తన ప్రసంగాల్లో తాను జగనన్న బాణాన్ని అంటూ ప్రతి చోట చెప్పేవారు. మరి తెలంగాణ గడ్డపై ఆమె నిజంగా ఎవరి బాణమో తెలియాల్సి వుంది. ఎవరికి వారు పలు రకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు బిజెపి ప్రయోగించిన బాణం అంటున్నారు. కొందరేమో ఆమె జగన్‌తో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకోనున్నదని అంటున్నారు.ఇది కెసిఆర్ ఎత్తుగడ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి విమర్శించారు. జగన్‌కు షర్మిల పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.జగన్ సతీమణి భారతితో షర్మిలకు పొసగడం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు నర్మగర్భంగా చెప్తున్నారు. ఇలా ఎవరికి వారు తమదైన ఊహల్తో విశ్లేషణ చేస్తున్నారు. షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ముందుగా అనగా జనవరి 24వ తేదీన ఓ తెలుగు పత్రికలో పతాక స్థాయిలో వార్త వచ్చింది. అటు జగన్‌కు, ఇటు కెసిఆర్‌కు వ్యతిరేకంగా వున్న ఆ పత్రికలో ఆ వార్త రావడం మరో విశ్లేషణకు కూడా తావిస్తున్నది. షర్మిల తన కార్యాచరణను ముందుగా ఆ పత్రికకే లీక్ చేయడం వల్ల ఆమెకు అండగా ఆ పత్రిక, ఆ పత్రికకు అండగా వున్న చంద్రబాబు హస్తం వుందని ఆ కుట్ర వెనక జగన్‌ని బలహీన పర్చడం జగన్‌కు, కెసిఆర్‌కు మధ్య వున్న సఖ్యత కూడా చెడగొట్టాలని చూడడం ఈ పార్టీ స్థాపన ఉద్దేశం అని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు.

ఇందుకు తోడ్పడిన కొన్ని విషయాలు కూడా ఈ కథనం నిజమనిపించేలా వున్నాయి. తెలుగు ఛానళ్ళన్నీ ఉదయం 9 గంటల నుండి రాత్రి వరకు షర్మిల పార్టీ గూర్చే అత్యంత ప్రాధాన్యత ఈయగా, జగన్‌కు చెందిన ‘సాక్షి’ ఛానల్‌లో దీని గురించి ఎలాంటి వార్త ప్రసారం చేయకపోవడం అన్నా, చెల్లెళ్ల మధ్య విభేదాల్ని సూచిస్తున్నాయి. అందుకు తోడు అప్పటికప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఆమె పార్టీతో మాకేం సంబధం లేదంటూ ప్రకటించడం కూడా ఆ కుటుంబ విభేదాలకు అద్దం పట్టాయి. తెలంగాణ బిజెపి నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ షర్మిల కొత్త పార్టీ కెసిఆర్ ఎత్తుగడ అని కొట్టిపారేశారు.
రాజకీయ నాయకుల మాటలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎవరినీ నమ్మలేం. ఆత్మీయ సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు సంతోషంగా వున్నారా? విద్యార్థులు హ్యాపీగా వున్నారా? ఆరోగ్యశ్రీ అందరికీ అందుతూ వుందా? రైతుల రుణమాఫీ జరిగిందా? అంటూ పరోక్షంగా కెసిఆర్‌పై బాణాల్ని సంధించారు. అసలు మర్మం ఏదైనా రావడం రావడం కెసిఆర్ పాలనపై ఇలాంటి విమర్శల్ని విశ్లేషిస్తే ఆమె కచ్చితంగా టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే పార్టీ పెట్టినట్లు అన్పిస్తోంది.

ఇదే రోజు ఆ తెలుగు దినపత్రిక మరో వార్తను కూడా ప్రచురించింది. ‘త్వరలో అమిత్ షాను కలవనున్న షర్మిల’ అంటూ ఆ వార్త ప్రచురించారు. ఇప్పటి వరకు షర్మిల పార్టీ గూర్చి ఆ పత్రిక చెప్పిందే నిజమైంది కనుక ఈ వార్త కూడా నిజమని నమ్మాల్సి వస్తుంది. మరి ఇది బిజెపి ఎత్తుగడో కాదో భవిష్యత్తులో తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కమలం పార్టీ ఎన్నెన్నో ఎత్తుగడల్ని వేయడం మనం చూస్తున్నాం. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి లాభపడాలన్నదే షర్మిల పాచిక ప్రధాన కారణం అయి వుండవచ్చు. మరి వారికి తోడ్పడమే ఆమె రహస్య అజెండానా? కావచ్చు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓ మంచి గెలుపును సాధించిన బిజెపి మరింత దూకుడు పెంచి, పాలనాధికారం చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు గ్రహించవచ్చు.
మరి షర్మిల తెలంగాణ గడ్డపై నిజంగా రాజన్న రాజ్యం తెస్తుందా? అంత సత్తా ఆమెకు వుందా? అనేక కష్ట నష్టాలకోర్చి, దశాబ్దాల పాటు ఆంధ్ర నాయకుల పెత్తనాన్ని కాదని ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ బిడ్డలు మళ్ళీ ఓ రాయలసీమకు చెందిన మహిళ పెత్తనాన్ని ఆమోదించి పట్టం కడతారా? ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ బిడ్డల్లో అప్పుడే అణగారిపోయిందా? కెసిఆర్ స్థానంలో రాజన్న బిడ్డకు పట్టం కట్టగలరా? ఇవన్నీ అందరిలోనూ మెదలుతున్న ప్రశ్నలు. సమగ్రంగా విశ్లేషించి చూస్తే అది అంత సులభం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గూర్చి కాస్తా సమీక్షించుకోవాలి. తెలంగాణ ప్రజల మనస్సుల్లో రాజశేఖర్ రెడ్డి పట్ల గౌరవ భావం వుందన్నది వాస్తవం. వెనుకబాటుతనంతో పేదరికంతో మగ్గిపోయిన తెలంగాణ ప్రజలకు ఆనాటి రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, రైతుల రుణ మాఫీ పథకాలు ఎంతో మేలు చేకూర్చాయి.

ఇవి నాణానికి ఓ వైపు. మరో వైపు చూస్తే ఆయన ఫక్తు సమైక్యవాది అని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచడం ద్వారా తెలంగాణకు నష్టం చేకూర్చారని, గెలిచిన టిఆర్‌ఎస్ శానస సభ్యుల్ని కాంగ్రెస్‌లో చేర్చేసుకున్నారని, ఆయన కనుక జీవించి వుంటే తమకు తెలంగాణ వచ్చేదే కాదన్న భావనలు కూడా వారి మనస్సుల్లో దాగేవుండొచ్చు. ఇలా పరస్పర భావనలు కల్గిన తెలంగాణ ప్రజలు షర్మిలను ఆదరిస్తారా? కష్టమే. ఆనాడు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి కెసిఆర్‌పై చేసిన విమర్శలు మళ్లీ వైరల్ అయితే! ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారం చేపట్టాక ప్రకటించిన రూ. 2 కిలో బియ్యం, సబ్సిడీ ధరపై విద్యుత్, పటేల్, పత్వారీ వ్యవస్థను తొలగించడం లాంటి కొన్ని పథకాలు తెలంగాణ ప్రజల మనసుల్ని విశేషంగా ఆకర్షించాయి. మరి ఈ రోజు తెలంగాణలో ఎందరి మనసుల్లో ఇంకా ఎన్‌టిఆర్ వున్నాడు? గొప్పవాడు అని కీర్తిస్తున్నారే కానీ ఓట్లు వేయడం లేదు. అభిమానం వేరు, రాజకీయం వేరు. వాస్తవానికి ఈ రోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్థితి కడు దయనీయంగా వుంది. ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావడం లేదు. మొన్నటి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూడా పోటీ చెయ్యలేని అధ్వాన స్థితి. రామన్న రాజ్యమే గుర్తుకు లేని ప్రజలు, రాజన్న రాజ్యం కావాలని ఆశిస్తారా? ఆశీర్వదిస్తారా? షర్మిలకు అంత శక్తి సామర్థ్యాలున్నాయా? అంతటి ఆకర్షణ శక్తి వుందా? అన్ని గొప్ప గుణాలున్నాయా? సమైక్య శంఖాన్ని పూరించిన ఈ ఆడబిడ్డ ఈ తెలంగాణ మనుషుల మనసుల్ని గెలవగలుగుతుందా?
ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు.

కేవలం రాజశేఖర్ రెడ్డి పేరుతో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి నెగ్గుకు రాగలదా? మరి రాజకీయాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాగానే మిగిలిపోతుందా? చంద్రబాబు ఓటమికి చిరంజీవి, మరోసారి చంద్రబాబు ఓటమికి పవన్ కల్యాణ్ తోడ్పడ్డారన్నది అందరికీ తెలుసు. మరి షర్మిల ఎలాంటి పాత్రలో నిలుస్తుందో భవిష్యత్తులో తేలుతుంది. షర్మిలపై కాంగ్రెస్ నాయకుల విమర్శలు సాయంత్రానికి జోరందుకున్నాయి. కావాలంటే సారె పెట్టి పంపిస్తాం కానీ, ఓట్లెయ్యం అని రేవంత్ రెడ్డి, అన్న మీద కోపముంటే అక్కడే పార్టీ పెట్టుకో అని హనుమంతరావు, తెలంగాణలో రాజకీయ శూన్యత లేదని గోనె ప్రకాశరావు తదితరులు చాలా తీవ్రస్థాయిలో విమర్శించారు. టిఆర్‌ఎస్ కూడా అంతే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నది. మరి షర్మిలను ఏ పార్టీవారు అక్కున చేర్చుకుంటారు? చివరికి శుభలగ్నం చిత్రంలో ‘చిలకా ఏ తోడు లేక ఎటు వైపు ఈ ఒంటరి నడక’ అనే సాంగ్‌లా షర్మిల రాజీయ జీవితం ముగియకూడదు. అన్నీ ఆలోచించి ఆమె అడుగులు వేస్తే మంచిది. ఇప్పుడిచ్చిన కవరేజీ చివరి వరకు మీడియా ఈయదు అది సత్యం. చిరంజీవి, పవన్ కల్యాన్‌లే అందుకు సాక్ష్యం. ముందు చూపు వున్న రజనీకాంత్ కూడా బొక్కబోర్లా పడక ముందే తెలివిగా రాజకీయాలొద్దంటూ నిష్క్రమించారు.

ఇక తెలంగాణ గడ్డ గూర్చి చూద్దాం. విభజన అనంతరం రెండు సార్లూ ఉద్యమ సారథి తెలంగాణ సాధకుడు, పోరాటవీరుడు అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మొదటి సారి కన్నా రెండవ సారి మరిన్ని ఎక్కువ సీట్లు ఆయన గెలుపొందారు. ఇది ప్రస్తుత రాజకీయ చరిత్ర. ప్రతి ఓటమి ఆయన్ని గెలుపు వైపు మరింత వేగంగా దూకేలా చేస్తుంది. ఓటమిని ఆయన ఓటమిగా కాకుండా గుణపాఠంగా తీసుకుంటాడు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలు ఆయనను ఓటమికి గురిచేసుండొచ్చు. అంత మాత్రాన ఆయన్ని పూర్తిగా పరాజితుడిగా లెక్కవేస్తే పప్పులో కాలేస్తాం. మరో ఎన్నికల్లో ఆయన బంతిలా ఎగిరి విజయ కిరీటాన్ని అందుకొంటాడు.ఆయన్ని ఎవ్వరూ ఎప్పుడూ తక్కువగా అంచనా వెయ్యలేరు. ఆయన స్వభావం అలాంటిది తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆయన ఇప్పటికే చెరగని ముద్ర వేసుకనే వున్నారు. ఆ ముద్ర అంత త్వరగా చెరిగిపోతుందనుకోలేము. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు కూడా అంత భయంకంరగా లేవు. కెసిఆర్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే కన్పించడం లేదు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఆయన నోరు తెరిచి గర్జిస్తే అవన్నీ గాలి బుడగల్లా తేలిపోతాయి. ఇంకా ఆయన్ని ఎవరూ ‘ఢీ’ కొనే పరిస్థితులే లేవు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నాడు తెలంగాణలో రాజకీయ శూన్యత అనేది ఏర్పడుతుంది. మరి షర్మిల రాజన్న రాజ్యం తీసుకొస్తానంటే జనాలు ఆమె వెంట పరుగెత్తుకుంటూ రారు. షర్మిల అంచనాలు ఫలించే వీలు లేదు. షర్మిల వెనుక ఎవరు దాగున్నారో అన్న విషయాలు కూడా ముందు ముందు ప్రజలు సులభంగా కనుక్కోగలరు. కొత్త పార్టీలు ఇక్కడ బతికి బట్టకట్టడం చాలా కష్టం. టిఆర్‌ఎస్ పార్టీ అంత బలంగా ఈ గడ్డపై పునాదులు వేసుకుంది.

టిఆర్‌ఎస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న ఏకైక పార్టీ ఈ రోజు బిజెపి గానే చెప్పచ్చు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల గెలుపు, దేశంలో ఇంకా వెలిగిపోతున్న మోడీ ప్రభ వారిని పరుగులు తీయిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నెక్కాలనే ఏకైక ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కొంత విజయం సాధించినా రాజ్యాధికారానికి అది సరిపోతుందా అన్నది అనుమానమే. మరో కోణంలో చూస్తే ఈ రోజు కెసిఆర్ ను ‘ఢీ’ కొడుతున్న పార్టీల్లో బిజెపి ముందు వరుసలో వుంది. అది కాదనలేం. కెసిఆర్‌ని తిట్టడమే ప్రధాన అజెండాగా ఆ పార్టీ పయనించడాన్ని తెలంగాణ ప్రజలు అంత సులభంగా జీర్ణించుకోలేరు. ఇక వామ పక్షాలు తమ ఉనికిని దాదాపు పూర్తిగా కోల్పోయాయనే చెప్పవచ్చు. కోదండ రాంకు కెసిఆర్‌ను దెబ్బతీయాలని కొండత కోర్కె అయితే వుంది కానీ, బలం గోరంతే వుంది.

అది పగటి కలగానే మిగిలిపోతున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ కెసిఆర్‌పై పెద్ద యుద్ధం చేస్తున్నట్లు కన్పిస్తున్నా ప్రజలు మాత్రం ఆ పార్టీని ఎందుకనో ఆదరించడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎన్ని బాంబులు కెసిఆర్‌పై పేల్చుతున్నా అవి తుస్ మంటున్నాయి కానీ పేలడం లేదు. అది వారి పార్టీ దురదృష్టమనే చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీ కుంటి నడకే నడుస్తున్నది. ముందు ముందు కూడా ఆ పార్టీకి వెలుగు వస్తుందని అనుకోలేము. ఆ పరిస్థితులు కనపడడం లేవు. రెడ్ల బలం ఒక్కటే అందుకు సరిపోదు. కేవలం కెసిఆర్‌పై విమర్శలకే వాళ్ళు పరిమితమౌతున్నారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డికి హారతులు పట్టి, వెన్నుదన్నుగా నిలబడ్డారు. అలాంటి వారే ఈ రోజు రాజన్న బిడ్డపై, రాజన్న రాజ్యంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి షర్మిలకు ఏ పార్టీ గొడుగు పడుతుంది?

మొన్నటి టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో కెసిఆర్ కొత్త పార్టీలపై తీవ్రమైన కామెంట్స్ చేశారు. పార్టీ పెట్టడమంటే పాన్ కొట్టు పెట్టుకొన్నంత సులభం కాదు అన్నారు. షర్మిల కూడా మరోసారి ఆలోచించుకొని మలి అడుగేస్తే బాగుంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవం, పేరు ప్రతిష్ఠలు తెలంగాణ ప్రజల మనసుల్లో అలాగే వుండిపోనీ. దానికి నష్టం కల్గించకండి. కెసిఆర్ రాజ్యం ఇంకా కంపుకొట్టడం లేదు. కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డి ఓ సుహృద్ భావంతో పరిపాలిస్తున్నారు. అలాంటి దాన్ని షర్మిల పార్టీ పెట్టి చెడగొట్టకూడదు. జగన్ మోహన్ రెడ్డిని ఓ వైపు ప్రతిపక్షాలు, మరో వైపు కోర్టు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయనకు అండగా నిలబడి తోడ్పాటు నీయడం ఆమె కర్తవ్యం. ఎవరి మాటలో విని చేతులు కాల్చుకోకూడదు. మరోసారి ఆలోచించి అడుగులేస్తే మంచిది.

డా. సమ్మెట
విజయ్ కుమార్
8886381999

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News