Monday, April 29, 2024

వేయి ఆలోచనలకు పుస్తక ప్రదర్శనలే వేదిక: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వంద పూలు వికసించేందుకు, వేయి ఆలోచనలు సంఘర్షించేందుకు పుస్తక ప్రదర్శనలే వేదికలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను జ్ఞాన తెలంగాణగా నిర్మించేందుకు పుస్తకాలు పనిముట్టుగా పని చేస్తాయని తెలిపారు. చరిత్రను వక్రీకరించే వాళ్లను గుర్తించాలంటే అసలు చరిత్రను అవగతం చేసుకోవాలంటే విధిగా ఈతరం పుస్తక పఠనం కొనసాగించాలని అన్నారు. గురువారం ( నేటి నుండి ) ప్రారంభమయ్యే 35వ జాతీయ పుస్తక ప్రదర్శన పోస్టర్‌ను ప్రగతి భవన్‌లో కేటిఆర్ బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ జ్ఞాన ఆయుధంతో సత్యాగ్రహ మార్గంలో 14 ఏళ్లు రాష్ట్ర సాధన మహోద్యమాన్ని కొనసాగించి రాష్ట్రాన్ని సాధించారన్నారు. పుస్తకాలు తయారు చేసిన వ్యక్తులే ఏ రంగంలో నైనా అత్యున్నత స్థానాలకు ఎదగగలుగుతున్నారన్నారు.

జ్ఞాన మార్గంలో వచ్చిన అనేక శాస్త్ర సాంకేతిక విప్లవాల వల్లనే జాతుల, దేశాల పురోభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. ఒక సమాజం అత్యున్నత స్థాయికి ఎదిగి మార్గదర్శకంగా నిలబడటానికి పుస్తకాలు ఇచ్చిన జ్ఞానమే పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతికి ఇంకా సాధించవలసిన పురోగతికి మేధో సంఘర్షణల నుంచి జనించిన ఆలోచనలన్నింటిని భద్రంగా రికార్డు చేసి ప్రపంచం చేతికందించేది పుస్తకాలేనని మంత్రి కెటిఆర్ వివరించారు. భిన్న సంస్కృతుల, భిన్న భాషల వేదికగా మినీ ఇండియాగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరంలో భిన్న భాషా సంస్కృతుల పుస్తకాల కేంద్రంగా హైదరాబాద్ బుక్ ఫేయిర్ నిలిచిందని చెప్పారు. మనిషిని మనిషి ప్రేమించే వ్యవస్థను నిర్మించటానికి, అత్యుత్తమ సంస్కార వంతులను తయారు చేసే జ్ఞాన కర్మాగారమైన పుస్తక ప్రదర్శనను హైదరాబాద్‌లో 35 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగటం ఈ మట్టి చైతన్యానికి నిదర్శనమని తెలిపారు.

పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు నూతన ఆలోచనల పొదుగుగా నిలిచిన పుస్తక ప్రదర్శనను ఉపయోగించుకోవాలని యువతకు కోరారు. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటూ అభివృద్ధిని సాధిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ముందుకు సాగుతున్నట్లుగా బుక్ ఫెయిర్ కూడా సరవజనుల ఆకాంక్షలకు ఐక్యతకు ప్రతిరూపంగా నిర్వహించబడాలని కెటిఆర్ హితవు పలికారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తాను కూడా ఒక రోజు పాల్గొంటానని నూతనంగా వస్తున్న పుస్తకాలను అధ్యయనం చేసేందుకు బుక్ ఫెయిర్ అంతా కలియతిరుగుతానని బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్‌కు తెలిపారు. బుక్ ఫెయిర్‌ను ప్రజల దగ్గరకు తీసుకు పోతున్న పుస్తక నిర్వాహకులను కేటిఆర్ అభినందించారు.

పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా వెలుగొందాలని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ , బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలిప్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు రాఘవ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News