Saturday, April 27, 2024

ఓపెన్‌క్యాస్ట్‌లో భారీ పేలుడు

- Advertisement -
- Advertisement -

నలుగురు దుర్మరణం, ఒకరు విషమం, మరి ఇద్దరికి గాయాలు

పెద్దపల్లి జిల్లా సింగరేణి గనుల్లో దుర్ఘటన
మందుగుండు అమరుస్తుండగా ప్రమాదం

మన తెలంగాణ/(రామగిరి-/యైటింక్లయిన్‌కాలనీ): పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ, ఆర్‌జి3 డివిజన్, ఓసిపి1 ప్రాజెక్టు ఫేజ్2లో మంగళవారం ప్రమాదవశాత్తు మందుగుండు సామగ్రి పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఓసిపి1 ప్రాజెక్టులో ఓబి (మట్టి)ని వెలికి తీసేందుకు మహలక్ష్మి ప్రైవేట్ కంపెనీకి సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు అప్పగించింది. మట్టిని వెలికి తీసేందుకు మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఉదయం 10.20గంటల ప్రాంతంలో మట్టిలో 31రంధ్రాలు చేసి వాటిలో మందుగుండు నింపారు. అనంతరం పక్కనే ఉన్న పెద్ద బండరాయిలో బ్లాస్టింగ్ మెటీరియల్ చార్జింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న బండారి ప్రవీణ్(38), బిల్ల రాజేశం(42), అర్జయ్య(41), సిలివేరి రాకేశ్(28) మట్టి పెళ్లలతో సహా పైకి ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద స్థలం పక్కనే ఉన్న మరో కార్మికుడు కె వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వెంకటేష్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న బండి శంకర్, సాకలి భీమయ్యలకు గాయాలు కాగా వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మందుగుండు నింపే సమయంలో రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే బ్లాస్టింగ్ మిస్‌ఫైర్ అయ్యిందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. అలాగే సింగరేణి అధికారుల పర్యవేక్షణ లోపించడం కూడా ప్రమాదానికి మరో కారణంగా చెబుతున్నారు. సింగరేణి అధికారులంతా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఉండగా ఈ ఘటన జరగడంతో వారు షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, పెద్దపల్లి డిసిపి రవీందర్‌యాదవ్, గోదావరిఖని ఏసిపి ఉమేందర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందని సింగరేణి అధికారులు చెబుతున్నారు. నల్గొండకు చెందిన ఐడిబిఎల్ కంపెనీకి చెందిన నన్నెల్స్, డిటోనేటర్లు బ్లాస్టింగ్‌లో వాడినట్టు కంపెనీ అధికారులు చెప్పారు. ఈ ఘటన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విషాదం నింపింది. ఇప్పటి వరకు సింగరేణిలో ఇలాంటి ప్రమాదం జరగలేదని, బ్లాస్టింగ్ జరిగి ఇంత మంది మరణించిన దాఖలాలు లేవని పలువురు అధికారులు తెలిపారు.

4 died after blast in singareni collieries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News