Friday, May 3, 2024

క్రమంగా కరోనా కోరలు

- Advertisement -
- Advertisement -

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు స్వదేశానికి
యాంటి హెచ్‌ఐవి డ్రగ్స్‌తో కరోనాకు చికిత్స
వివిధ దేశాల్లో కరోనా మరణాలు 4,000
లక్ష దాటిన బాధితులు : డబ్లూహెచ్‌ఓ

Corona

 

న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళలో మరో ఆరుగురికి, పూణెలో ముగ్గురికి కోవిడ్ 19 (కరోనా) సోకింది. వీరికి జరిపిన పరీక్షల్లో పాజిటివ్ ఫలితం వచ్చింది. ఇక కర్ణాటకలో కూడా మరో మూడు కేసులు వెలుగు చూశా యి. అయితే తాజా కేసుల్ని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ధ్రువీకరించాల్సి ఉంది. సోమవారం సాయంకాలం వరకూ మన దేశంలో 56 మందికి కరోనా వచ్చినట్టు నమోదైంది. వీరిలో గత నెలలో కేరళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ముగ్గురు కూడా ఉన్నారు. సోమవారం కేరళలో.. మూడేళ్ల బాలుడితో సహా 12 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. జమ్మూ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పుణె, కర్ణాటక, పంజాబ్‌లలో మిగిలిన కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తుండడంతో కఠినమైన ఆంక్షలు విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31 వరకు పాఠశాలలు, అంగన్‌వాడీలు, మదర్సాలు, కాలేజీలు, సినిమాహాళ్లను, డ్రామా థియేటర్లను మూసేయాలని ఆదేశించింది. పండగలు, వేడుకల్ని సా ధ్యమైనంత వరకు మానుకోవాలన్నది. కరోనా వైరస్‌పై చర్చించేందుకు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం జరిపిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాతో మాట్లాడారు.‘ వివిధ ఆస్పత్రుల్లో 116 ఐసోలేషన్ వార్డులు, 967 హోం క్వారంటైన్‌లో కనీసం 1,116 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు’ అని చెబుతూ విజయన్ రాష్ట్రంలో ప్రభుత్వ, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ బో ర్డు పాఠశాల్లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు క్లాసు ల్ని రద్దు చేస్తున్నాం. వారి పరీక్షలూ వాయిదా వేస్తున్నామన్నారు. కార్యాలయాల్లో కరోనా వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. కేరళ ఆరోగ్యమంత్రి కెకె శైలజ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇరాన్ నుంచి స్వదేశానికి భారతీయులు
ఇలా ఉండగా…భారత వైమానిక దళం (ఐఎఎఫ్) సైనిక విమానం ద్వారా కరోనాకు తీవ్రంగా గురైన ఇరాన్ నుంచి 58 మంది భారతీయుల్ని స్వదేశం చేర్చారు. సి 17 గ్లోబ్‌మాస్టర్ విమానాన్ని సోమవారం సాయంకాలం ఘజియాబాద్ సమీపంలోని హిండన్ వైమానిక స్థావరం నుంచి టెహరాన్ పంపించారు. అలాగే ఇరాన్‌లో ఉం టున్న 529 మంది భారతీయులు వాడిన వస్త్రాల నమూనాలను కూడా తెచ్చారు. వాటిని ఇక్కడ ల్యాబ్‌లలో పరీక్షించి, వారికి కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకుంటారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఇరాన్‌లో దాదాపు 2,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఐఎఎఫ్ ప్రతినిధి కెప్టెన్ అనుపం బెనర్జీ మాట్లాడుతూ విమానంలో ఇరాన్ నుంచి తీసుకొచ్చిన 58 మంది భారతీయుల్లో 25 మంది పురుషులు, 31 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని హిండన్‌లో వైద్యకేంద్రంలో విడిగా ఉంచారు. ఐఎఎఫ్ అవసరమైన వైద్య చర్యలు తీసుకుంటోంది. తగిన వైద్య సదుపాయాలు కల్పిస్తూ పౌరులకు అండగా నిలుస్తోంది’ అన్నారు. ఇరాన్ నుంచి ఐఎఎఫ్ విమానం సి17 గ్లోబ్‌స్టార్ హిం డన్ వైమానిక స్థావరానికి చేరిన తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆ సమాచారాన్ని ట్వీట్ చేస్తూ ‘ఈ కార్యక్రమం పూర్తయింది. తదుపరి చర్య చేపట్టాలి. ఇరాన్ నుంచి మరింత ఎక్కువ మంది భారతీయుల్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అన్నారు.
కరోనా చికిత్సకు యాంటి హెచ్‌ఐవి మందులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో మొదటిసారి రెండు డ్రగ్‌లు కలిపిన మందును జైపూర్ ఆస్పత్రిలో కోవిడ్ 19కు చికిత్స పొందుతున్న వృద్ధ ఇటాలియన్ దంపతులకు ఇచ్చారు. ఈ డ్రగ్‌లను సాధారణంగా హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ను అదుపు చేసేందుకు వాడతారు. లోపినావిర్ రిటోనవిర్ అనే రెండు మందుల్ని కలిపి పరిమితంగా వాడేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతిచ్చారు. కరోనా వైరస్‌కు ఈ మందులు వాడేందుకు అత్యవసరంగా అనుమతి ఇవ్వాలని ఇండియాన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కోరడంతో ఈ అనుమతి లభించింది.ఎస్‌ఎంఎస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ మీనా మాట్లాడుతూ ‘ ఇటాలియన్ దంపతులకు శ్వాససంబంధమైన సమస్యలు తలెత్తడంతో లోపినావిర్ రిటోనవిర్ అనే రెండు మందుల్ని కలిపి ఇవ్వాలని నిర్ణయించాం. ఇటలీ దంపతులకు ఈ మందులు ఇచ్చే ముందు వారి అనుమతి తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. ఇటలీ అతను డాక్టర్. ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నారు. కరోనా కు ముందే ఆయనకు శ్వాస సమస్యలున్నాయి. కరోనా సోకిన తర్వాత పరిస్థితి దిగజారడంతో ఈ మందులు ఇచ్చాం. ఇప్పుడాయన పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన భార్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది’ అన్నారు. ఇంతవరకూ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 4,000 మంది మరణించారని, లక్షమందికి పైగా కోవిడ్ 19 సోకిందని, ఈ మహమ్మారితో ముప్పు నిజమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) తెలిపింది.

56 Corona Positive cases find out in India

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News