Saturday, April 27, 2024

‘లైఫ్ సైన్సెస్’లో లక్షల్లో కొలువులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం రంగంలో 4 లక్షల ఉద్యోగాల సంఖ్యను రెట్టింపు చేసి 8 లక్షల ఉద్యోగ,ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. బయో ఏషియా సదస్సు నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో విలేకరులతో జరిగిన చిట్ చాట్‌లో మంత్రి కెటిఆర్ పలు అంశాలను వెల్లడించారు. 2028 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామని, ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల విలువ కలిగిందని ఆయన తెలిపారు. బయో ఏషియా ప్రాముఖ్యతతో పాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యల గురించి ఆయన వివరణాత్మంగా వెల్లడించారు. 19 సదస్సులను పూర్తిచేసుకుని ఈసారి ప్రతిష్టాత్మకమైన 20వ సదస్సును నిర్వహించుకోబోతున్నామని ఆయన తెలిపారు.

ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు ఈ సదస్సు ఉంటుందని, ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్ షషేపిగ్ నెక్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’ అన్న ఇతివృత్తంతో 20వ బయో ఆసియా సదస్సు జరుగుతుందని ఆయన తెలిపారు. బయో ఏషియా పందొమ్మిది ఏళ్లలో మూడు బిలియన్ డాలర్లు సుమారు 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయని ఆయన తెలిపారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఏషియా విస్తృతమైన సేవలను అందించిందని కెటిఆర్ పేర్కొన్నారు. దేశ లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందన్నారు.

20 సంవత్సరాల్లో 250కిపైగా అవగాహన, ద్వైపాక్షిక ఒప్పందాలు

వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20 వేలకుపైగా భాగస్వామ్య చర్చలను జరిపామని కెటిఆర్ తెలిపారు. 30 పాలసీ పేపర్లు, సిఫార్సులను ఈ సదస్సు అందించిందని, 100 దేశాలు ఇప్పటిదాకా ఈ సదస్సులో పాల్గొన్నాయని కెటిఆర్ వివరించారు. 20 సంవత్సరాల్లో 250కి పైగా అవగాహన, ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉందన్నారు. ఇప్పటికే అనేక దేశాలు భాగస్వామ్య కంట్రీల హోదాలో ఏషియా సదస్సులో పాల్గొన్నాయని కెటిఆర్ తెలిపారు. ఈసారి కూడా పలు దేశాలు బయోఏషియాతో భాగస్వామ్య దేశం హోదాలో పాల్గొంటున్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా బయో ఏషియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం నిలిచిందని కెటిఆర్ పేర్కొన్నారు.

జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో….

ఇందులో తొలిసారిగా ఆపిల్ కంపెనీ కూడా పాల్గొంటుందని, జీవశాస్త్ర రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, బయోఆసియాతో పాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తుందని కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంగా ముందుకెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. 2021లో హైదరాబాద్ దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్ డాలర్లు ఉండగా 2028 నాటికి దీనిని వంద బిలియన్ డాలర్లకు చేరేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. భవిష్యత్‌లో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతోందని ఆయన తెలిపారు. జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ విషయంలో కోర్టుల్లో ఉన్న కేసులపై విచారణ ముగిసిందని, న్యాయమూర్తులు రిజర్వ్ చేసిన తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రం త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు

జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ ఇప్పటికే కీలకంగా మారిందని, ఏటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోందన్నారు. త్వరలోనే ఈ సంఖ్య 1400 కోట్లకు చేరుతుందని, టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుందని కెటిఆర్ తెలిపారు. స్టేషన్ ఆమోదిత ఫార్మా కంపెనీలు 214 అత్యధికంగా ఉండటం, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కు, త్వరలో ప్రారంభం కానుండడం, ఫార్మాసిటీ వంటివి హైదరాబాద్‌ను జీవశాస్త్ర రంగంలో మరింత బలోపేతం చేస్తున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రం త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తుండటం జీవశాస్త్ర రంగానికి, ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు.

ఫార్మాసిటీకి కేంద్రం నుంచి సాయం అందడం లేదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి కేవలం జాతీయ స్థాయి ప్రాధాన్యతనే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యత ఉందని ఆయన తెలిపారు. పరిశ్రమ ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధి కన్నా కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్న హామీలను ఇచ్చుకుంటూ వెళుతుందన్నారు. ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని ప్రాంతాల్లో డిఫెన్స్ కారిడార్లను, బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడం వలన కేంద్రం దేశ అభివృద్ధిని ఫణంగా పెడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకున్నా, బల్క్ డ్రగ్ పార్క్ ను ఇవ్వకున్నా, హైదరాబాద్ ఫార్మాసిటీకి సాయం చేయకున్నా, ఐటిఐఆర్ రద్దు చేసిన ఆయా రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటుకొని అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని రాష్ట్రం నిరూపించిందని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News