Friday, May 17, 2024

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్.. టార్గెట్ 2025: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటుగా విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 2025 నాటికి 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపి వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం ఇథనాల్‌ను కలిపే అంశంపై కేంద్ర ప్రభుత్వ రోడ్‌ మ్యాప్‌ను విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలిపి వినియోగించడానికి 2022ను, 20 శాతం ఇథనాల్‌ను కలిపి వినియోగించడానికి 2030ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గత ఏడాది కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం 8.5 శాతం ఇథనాల్ కలుపుతున్నారు. 2014లో ఇది కేవలం 11.5 శాతం మాత్రమే ఉండేది. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాకుండా 2025 నాటికే 20 శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మోడీ తెలిపారు.

గత ఏడాది చమురు కంపెనీలు ఇథనాల్ సేకరణ కోసం రూ.21 వేల కోట్లు వెచ్చించినట్లు ప్రధాని తెలిపారు. ఇథనాల్ వినియోగం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా రైతులకు మరింత ఆదాయం లభిస్తుందని ప్రధాని తెలిపారు. ఇథనాల్ సేకరణ పెరగడం వల్ల ఎక్కువ లబ్ధి పొందింది దేశంలో చెరకు పండించే రైతులేనని ఆయన చెప్పారు. అంతకు ముందు ప్రధాని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన కొంత మంది రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇథనాల్ వల్ల తమ ఆదాయం ఎలా పెరిగిందో వారు ప్రధానికి వివరించారు. వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధన వినియోగానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మోడీ చెప్పారు. చెరకుతో పాటుగా గోధుమలు, బియ్యం, ఇతర వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్‌ను తయారు చేస్తారు. ఇది రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉపయోగపడుతోంది. పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి భారత దేశం ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. గడచిన ఏడు సంవత్సరాల్లో భారత దేశ పునరుత్పాదక ఇంధన సామర్థం 250 శాతంకన్నా ఎక్కువ పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఇథనాల్ ఉత్పత్తి, దేశవ్యాప్తంగా పంపిణీకి సంబంధించిన ఇ100 పైలట్ ప్రాజెక్టును మోడీ ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్టును పుణెలో ప్రారంభించారు.

20% Ethanol blended Petrol to 2025: PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News