Monday, April 29, 2024

ప్రజా ప్రతినిధులపై కేసులో.. తెలంగాణ హైకోర్టు కార్యాచరణ భేష్

- Advertisement -
- Advertisement -

Activity on pending cases of public representatives

 

మిగతా హైకోర్టులు ఆదర్శంగా తీసుకోవాలి
సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సూచన

మనతెలంగాణ/హైదరాబాద్‌ : రాష్ట్రంలో తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా కార్యాచరణ ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా 4,859 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల్లో అగ్రభాగాన యూపి, రెండో స్థానంలో బిహార్ నిలవగా తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై మొత్తం 143 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ ప్రత్యేక కోర్టుల్లో 118 కేసులు పెండింగ్ లో ఉండగా మరో 25 కేసులు సిబిఐ సహా ఇతర కోర్టుల్లో ఉన్నట్లు వెల్లడించారు. కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించిన హైకోర్టు ఈక్రమంలో సిబిఐ ప్రధాన కోర్టులో ఉన్న 17 కేసులను 9 నెలల్లో ముగించే దశలో ఉన్నట్లు వెల్లడించింది. మరో 11 కేసుల్లో సిబిఐ, 5 కేసుల్లో ఇడి ఛార్జీషీట్ ఫైల్ చేసిందని నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రతి శనివారం విచారణ జరపనున్నారు.

కేసుల విచారణ, పురోగతి కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటుకు హైకోర్టు నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టును ఆదర్శంగా తీసుకోవాలన్న అమికస్ క్యూరీ మిగలిన రాష్ట్రాల హైకోర్టులు సైతం వెబ్‌సైట్ రూపొందించేలా చూడాలని కోరారు. కేసుల పురోగతిపై నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని అమికస్ క్యూరీ కోరింది. కాగా సిబిఐ,ఇడి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కేసుల పురోగతిపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ఎంపి,ఎంఎల్‌ఎల కేసుల విచారణతో పాటు దర్యాప్తునూ హైకోర్టు పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా సాక్షుల సంరక్షణ చట్టం- 2018ని ప్రత్యేక కోర్టులు అమలు చేసేలా ఆదేశాలకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను నియమించాలని విన్నవించారు.కేసుల విచారణ వేగవంతానికి వీరంతా సహకరించాలని సాక్షుల విచారణకు ప్రత్యేక కోర్టులు భద్రమైన గది ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అమికస్ క్యూరీ సూచించారు. ప్రతి కోర్టులో ఒక వీడియో కాన్ఫరెన్స్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ కోర్టు ఏర్పాటు వ్యయాన్ని కేంద్రం భరించాలని తెలిపారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్ 

రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌ను ఎప్పటిలోగా నియమిస్తారో వారం రోజుల్లో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మహిళా కమిషన్‌కు రెండేళ్లుగా ఛైర్ పర్సన్ లేరని పేర్కొంటూ కరీంనగర్కు చెందిన రేగులపాటి రమ్యారావు హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం నాడు విచారణ చేపట్టింది.మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్ను ఎందుకు నియమించ లేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే జిల్లా శిశు సంక్షేమ కమిటీలు నియమించలేదని వేసిన ఓ పిల్ పెండింగ్ లో ఉందని చట్టబద్ధమైన సంస్థలకు ఛైర్ పర్సన్లను నియమించకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నియామకానికి ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు చేశారో తెలపాలని ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు నాలుగు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోరారు. దీంతో ధర్మాసనం వారం రోజుల్లో తెలపాలని స్పష్టం చేసింది. కేసు విచారణకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది వసుధ నాగరాజ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది

ఆన్‌లైన్‌లో ఉర్దూ  

ఉర్దూ మాధ్యమం విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు ఎందుకు బోధించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఉర్దూలో కూడా ఆన్‌లైన్ పాఠాలు చెప్పేందుకు తగిన వసతులు కల్పించాలని పేర్కొంది. పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్, టివి పాఠాలు నిర్వహిస్తున్న పాఠశాల విద్యా శాఖ. ఉర్దూ మీడియం విద్యార్థులకు బోధించడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ సమీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో ఉర్దూ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారని.. అలాంటప్పుడు ఆ భాషలో ఆన్‌లైన్ విద్యా బోధన ఎందుకు జరగడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఉర్దూలో ఆన్‌లైన్ పాఠాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఈ నెల 12లోగా తెలపాలని విద్యా శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News