Saturday, April 27, 2024

వరికి అగ్గి తెగులు

- Advertisement -
- Advertisement -

Aggi tegulu

 

15 లక్షల ఎకరాల్లో వ్యాప్తి
మరింతగా విస్తరించే సూచనలు
అధిక తేమ, నత్రజని మితిమీరడంతోనే…
రంగంలోకి వ్యవసాయశాఖ

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి రైతులను అగ్గి తెగులు బెంబెలెత్తిస్తోంది. ఈ రబీలో రికార్డు స్థాయిలో 37.42 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో ఏకంగా 15 లక్షల ఎకరాల్లో అగ్గితెగులు ఉధృతి ఉన్నట్లు వ్యవసాయ శాఖ, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. నిజామాబాద్, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎక్కువగా నష్టాన్ని ఆశించినట్లు జయశంకర్ వర్సిటీ తెలిపింది. సిరిసిల్లలో 1.28 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఏకంగా 32 వేల ఎకరాల్లో అగ్గి తెగులు సోకింది. మిగతా జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ప్రస్తుతం అగ్గి తెగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆకుమచ్చ దశలోనే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుందని తెలిపింది. అయితే ఈ దశలో నివారించకపోతే తరువాత దశలో ‘ మెడ విరుపు ‘ ఆశించి కలకులు విరిగిపోయి తాలు గింజలు ఏర్పడి అధిక నష్టాన్ని కలగజేస్తుందని హెచ్చరించింది.

దీంతో వ్యవసాయ శాఖ బుధవారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించింది. రైతులకు అందుబాటులో ఉండి, సాంకేతిక సహకారం అందించాలని ఆదేశించింది. ప్రస్తుత రబీలో ఎక్కువగా ఎంటియు 1010, కెఎన్‌ఎం 118 , బతుకమ్మ, ప్రైవేట్ కంపెనీకి చెందిన దొడ్డు గింజ రకాలను, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటి సోనా, పూజ వంటి సన్న గింజ రకాలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. వరి సాగు చేసే అన్ని జిల్లాల్లో ఫిబ్రవరి మాసంలో గాలిలో అధిక తేమ శాతం (90) ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, మంచు కురవటంతో పాటు చాలా చోట్ల వరి పైరు సరిగా ఎదగటం లేదని అధిక మొత్తంలో నత్రజని ఎరువులను వేయడం అగ్గితెగులు ఎక్కువగా ఆశించడానికి ప్రధాన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి సాధారణంగా ప్రతీ ఏడాది యాసంగి వరిలో కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ విస్తీర్ణానికి అగ్గి తెగులు వ్యాపిస్తుంది. అయితే ఈసారి రాష్ట్రమంతటా వ్యాపించి నష్టాన్ని కలుగజేస్తుందని వ్యవసాధికారులు పేర్కొంటున్నారు. అలాగే కొన్ని వరి రకాలు మొదట్లో అగ్గి తెగులును తట్టకునేవని, ఇప్పుడు ఎంటియూ 1010, ఆర్ 64 వంటి వాటికి కూడా వస్తోంది.

రైతులకు సూచనలు.. నివారణ చర్యలివే

* పొలంలోగట్ల వెంబడి గడ్డిజాతి కలుపు మొక్కలు (తుంగ,గరిక) వంటివి లేకుండా చేయాలి.
* ప్రస్తుతం చిరుపొట్ట దశలో ఉన్న వరి పైర్లలో అగ్గి తెగులు గమనించినట్లయితే ఆఖరి దఫా నత్రజని ఎరువును కొన్ని రోజులు ఆపాలి. అలాగే మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఎకరానికి 10 కిలోలు ఆఖరి దఫాగా వేయాలి.

* తెగులు ఉధృతి తొలి దశలో ఉన్నప్పుడు ఐసొప్రోథయోలేన్ 1.5 మి.లీ/లీ లీటరుకు లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ/ లీ లేదా ట్రైసైక్లోజోల్ + మాంకోజెబ్ 2.5 గ్రా లీటరు నీటికి కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. తెగులు ఉధృతి బట్టి కొత్త తెగుళ్ళ మందులైన పికాక్సిస్ట్రాబిన్ 6.78 % + ప్రొఫికోనజోల్ 20.33 % ఎస్‌సి. 2 మి.లీ/లీ లేదా ప్రొఫికోనజోల్ 10.7% + ట్రైసైక్లోజోల్ 34.2% ఎస్.ఇ 1 మి.లీ లేదా టెబుకోపజోల్ 60 % + ట్రైఫ్లాక్సి స్ట్రాబిన్ 25 % డబ్ల్యుజి 0.4 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అయితే కొత్త తెగుళ్ళ మందులను వాడేటప్పుడు ఇతర పురుగు మందులతో కలయిక గురించి తెలుసుకొని పిచికారి చేయాల్సి ఉంటుంది.

Aggi tegulu disease to 15 lakh acres
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News