Sunday, April 28, 2024

అమెరికా ఉచ్చుకు దూరంగా..!

- Advertisement -
- Advertisement -

America for world ownership

 

ఆత్రగాడికి బుద్ధిమట్టు (తక్కువ లేదా పరిమితం) అన్నారు పెద్దలు. లేకపోతే రెండు దశాబ్దాల పాటు అఫ్ఘాన్ తాలిబన్లనే అదుపు చేయలేక సలాంచేసి తోక ముడిచిన అమెరికన్లు ఒకేసారి చైనా, రష్యాలను మింగేస్తాం అంటుంటే ఏమనుకోవాలి మరి! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన చతుష్టయ (క్వాడ్) విదేశాంగ మంత్రుల నాలుగవ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఒక ప్రధాన మార్పు ఏమంటే తన చేతికి మట్టి అంటకుండా ఇతరులతో పని జరిపించుకోవటం. కొద్ది నెలల క్రితం దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం ఏమిటంటూ ఆ ప్రాంత దేశాలను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇంకేముంది రష్యన్లు ఉక్రెయిన్ ఆక్రమణకు నడుంకట్టారు, మీ వెనుక మేముంటాం అందరం పోరాడుదాం, ముందుకు పదండితోసుకు అని హడావుడి చేస్తోంది. చతుష్టయ కూటమికి ఉక్రెయిన్ వివాదానికి సంబంధం లేదు, అయినా మెల్‌బోర్న్‌లో దాని గురించి ప్రస్తావించారు. ప్రతి దానికి ప్రతి దేశ జుట్టును ముడివేయాలని అమెరికా చూస్తోంది. ఈ కూటమిలోని వారందరూ ఉక్రెయిన్ వెళ్లి రష్యా మీద దాడులకు దిగుతారా? అంతసత్తా ఉందా? ఆసియాకు చైనా నుంచి, ఐరోపాకు రష్యా నుంచి ముప్పు ఉందనే తన దుష్ట పన్నాగంలోకి అన్ని దేశాలనూ లాగేందుకు అమెరికా పూనుకుంది.

భారత్ ఎదుగుదలకు, ప్రాంతీయ నాయకురాలిగా నాయకత్వం వహించేందుకు మద్దతు ఇస్తాం అని మెల్‌బోర్న్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మనకు చెప్పారు. మనం ఏ దేశాలకు నాయకత్వం వహించాలి? ప్రపంచ పెత్తనం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతోంది. మింగటం దాని వల్ల కావటం లేదు. ఒక్కొక్క ఖండంలో ఒక్కో జూనియర్ భాగస్వామి కోసం ఎదురు చూస్తోంది. మనం దాని ఏజంటుగా మారాలని కోరుకుంటోంది. అసలు భారత ఉపఖండంలో మన కోసం ఎదురు చూస్తున్నవారెవరైనా ఉన్నారా? అందరినీ, కాస్తదూరంలో ఉన్న ఇరాన్ వంటి మిత్ర దేశాలను దూరం చేయటంలో అమెరికా జయప్రదమైంది. చిన్నదేశమైన భూటాన్ కూడా మనతో చెప్పకుండా డోక్లాం ప్రాంత వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనాతో చర్చలు జరిపింది కదా! మనల్ని తన పట్టునుంచి పోకుండా అమెరికా బిగించింది. మీ ఊరు చుట్టు పక్కల 66 ఊళ్లకు పోతుగడ్డ అని పొగిడినట్లుగా మనలను మునగచెట్టు ఎక్కిస్తోంది. తన దక్షిణ చైనా సముద్ర ఆధిపత్య ఎత్తుగడలో భాగంగా గాల్వన్ రూపంలో మనకూ చైనాకు లడాయి పెట్టింది. మరో వైపున ఆస్ట్రేలియాను చైనా మీదకు ఉసిగొల్పింది, జపాన్‌లో తానే తిష్టవేసింది గనుక జపాన్ను ప్రత్యేకంగా రెచ్చగొట్టాల్సిన పని లేదు. చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకుందామనే పేరుతో భారత విస్తరణ వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. అది జరిగేదేనా?

ఈ కాలంలో జరిగిందేమిటి? ఆస్ట్రేలియా తోకలను కత్తిరించేందుకు చైనా వాణిజ్య ఆయుధాన్ని వాడుతున్నది. 2021 తొలి తొమ్మిది నెలల కాలంలో ఆస్ట్రేలియా నుంచి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చైనా 17.3 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులను తగ్గించింది. అదే వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుందంటే, అమెరికా నుంచి 6.3, కెనడా నుంచి 1.5, న్యూజిలాండ్ నుంచి 1.1 బి.డాలర్ల మేరకు అదనంగా చైనా దిగుమతి చేసుకుంది. అంటే ఆస్ట్రేలియాను ఫణంగా పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంది. ఇప్పుడు చైనాతో అమెరికాకు ఉన్న లడాయి ఏమిటి? తన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం లేదన్నదే, చైనా దిగుమతులు పెరిగితే దక్షిణ చైనా సముద్రమూ ఉండదు, భారత్‌కు నాయకత్వమూ ఉండదు. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి బెదిరింపులకు దిగుతోంది.

నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు ఎన్నికల్లోపు ఓటర్ల ముందు ఏదో ఒకటి సాధించినట్లు లేదా మరొక మహత్తర కార్యక్రమంలో ఉన్నట్లు ఓటర్లకు జో బైడెన్ కనిపిస్తేనే ఓట్లు పడతాయి. అందుకే ఈ తిప్పలు. ప్రస్తుతం అమెరికా, చైనా వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. 2020లో కుదిరిన ఒప్పందం మేరకు మా దగ్గర నుంచి సరకులు కొంటారా లేదా అని అమెరికా వత్తిడి తెస్తోంది. మీరు మాత్రం మా మీద అనేక ఆంక్షలు విధిస్తారు, చుట్టూ మంటపెడతారు, తగ్గించాల్సిన పన్నుల గురించి మాట్లాడరు, కరోనా కారణంగా తలెత్తిన సమస్యల గురించి మాట్లాడకుండా మా మీద నిందలు వేస్తే కుదరదు అని చైనా అంటోంది. ఆ ఒప్పందం ప్రకారం 2020లో అమెరికా నుంచి 260, 2021లో 310 బి.డాలర్ల విలువ గల వస్తువులు, సేవలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దానికి ప్రతిగా అమెరికా చైనా నుంచి వచ్చే 120 బి.డాలర్ల విలువ గల వస్తువులపై పన్నును 15 నుంచి 7.5 శాతానికి తగ్గించాలి. 2021లో రెండు దేశాల మధ్య 755.6 బి.డాలర్ల మేర వాణిజ్యం జరగా అమెరికా నుంచి దిగుమతులు 179.53 బి. డాలర్లు మాత్రమే ఉన్నాయి. చైనా వార్షిక విదేశీ వాణిజ్య విలువ ఆరు లక్షల కోట్ల డాలర్లుండగా అమెరికా వాటా పన్నెండు శాతంగా ఉంది. మెల్‌బోర్న్ సమావేశం సందర్భంగా అమెరికా విడుదల చేసిన పత్రం భారత్, చైనాల మధ్య మంటను మరింతగా ఎగదోసేదిగా ఉంది.

చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్నాయని ఈ ప్రాంతంలో భద్రతను సమకూర్చే భారత పాత్రకు తాము మద్దతు ఇస్తామని అమెరికా పేర్కొన్నది. క్వాడ్‌లో భారత్ భావసారూప్యత కలిగిన భాగస్వామి, చోదకశక్తి అని వర్ణించింది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్న కారణంగానే తాము ఈ ప్రాంతంపై కేంద్రీకరించామని, ఆస్ట్రేలియా మీద ఆర్ధిక బలాత్కారం, వాస్తవాధీన రేఖ వెంట భారత్‌తో ఘర్షణ, తైవాన్ మీద పెంచుతున్న వత్తిడి, తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలపై బెదిరింపులు వంటి చర్యలతో తమ మిత్రులు, భాగస్వాములు మూల్యం చెల్లించాల్సి వస్తోందని అమెరికా పత్రం పేర్కొన్నది. చైనాను మార్చటంలో తమకు పరిమితులు ఉన్నట్లు ఒక అమెరికా అధికారి ఈ సందర్భంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

మెల్‌బోర్న్ సమావేశంలో రష్యా గురించి భిన్నంగా మాట్లాడినప్పటికీ చైనా విషయంలో దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తమైంది. క్వాడ్ బృందం విభేదాల గురించి గాక సహకారం, చేతులు కలపటం మీద కేంద్రీకరించాలని మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ వివాదం గురించి చెప్పారు. అమెరికా ఆంక్షలు, బెదిరింపులను ఖాతరు చేయకుండా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థలను మన దేశం కొనుగోలు చేసింది. ఇప్పటికీ మిలిటరీ సరఫరాలపై వారి మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నాము. రష్యా మిలిటరీ బెదిరింపులు ముప్పు తెస్తున్నాయని అమెరికా మంత్రి బ్లింకెన్ ఆరోపించగా ఈ వివాదంలోకి తాము తలదూర్చటం లేదని జైశంకర్ పేర్కొన్నారు. ఒక దేశం ఎవరితో కలవాలో లేదో మరొక దేశం నిర్ణయించరాదని అమెరికా మంత్రి రష్యా మీద ధ్వజమెత్తారు. నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోరాదని రష్యా డిమాండ్ చేస్తుండగా చేర్చుకొని ఉక్రెయినుకు మిలిటరీని తరలించి రష్యా మెడ మీద కత్తిలా మారాలని అమెరికా ఎత్తు వేసింది. నా సహచరులు చెప్పినట్లుగా మేము కొన్నింటి కోసం ఉన్నప్పటికీ కొందరికి వ్యతిరేకం కాదని జైశంకర్ అన్నారు. ఇటీవలి భద్రతా మండలి సమావేశంలో కూడా రష్యాను విమర్శించేందుకు మన దేశం తిరస్కరించింది.

జపాన్, రష్యా మధ్య సరిహద్దు సమస్యలున్నప్పటికీ ఘర్షణకు జపాన్ సిద్ధంగా లేదు. అమెరికా వత్తిడి మేరకు కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ చైనాతో వాణిజ్య మిగులు ఉన్న జపాన్ తెగే వరకు లాగేందుకు సిద్ధంగా లేదు. దక్షిణ కొరియా కూడా చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటోంది. మన దేశం గాల్వన్ ఉదంతాల సమయంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గతేడాది రికార్డు స్థాయిలో వస్తువులను దిగుమతి చేసుకొని సానుకూల సందేశాన్ని పంపింది. కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను, పరికరాలను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించి నిషేధం విధించిన అంశం తెలిసిందే.

కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాజకీయాలను ఖాతరు చేయకుండా మన దిగుమతిదారులు లావాదేవీలు జరిపారు. చైనా నుంచి నిర్ణీత పరిమాణంలో వస్తువులను విధిగా కొనుగోలు చేయాలనే ఒప్పందాలేవీ లేవు, అగత్యమూ లేదు. అమెరికన్లు చెబుతున్నట్లు వారు మనకు సహజ భాగస్వాములే అయితే, జపాన్, ఆస్ట్రేలియా మన మంచి కోరుకున్నట్లయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను వారు సరఫరా చేయవచ్చు, చేయగలరు కానీ వారు చెప్పిన ధరలను మనం చెల్లించాలి. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు. ఆ వెలతో దిగుమతి చేసుకుంటే మన జనాల జేబులు కొట్టి అమెరికా, ఇతర దేశాలకు సమర్పించాలి. తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నందున దిగుమతిదారులు మొగ్గు చూపుతున్నారు తప్ప చైనా మీద వారికేమీ ప్రత్యేక ప్రేమ ఉండికాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News