Monday, April 29, 2024

అర్ష్‌దీప్‌పై పిచ్చిరాతలు… వికీపీడియాకు కేంద్ర సమన్లు

- Advertisement -
- Advertisement -

Asia Cup 2022: Arshdeep Singh Abused on Social Media

న్యూఢిల్లీ: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను నేలపాలు చేసి భారత యువ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ బ్యాటర్ ఆసిఫ్ ఇచ్చిన తేలికపాటి క్యాచ్‌ను అర్ష్‌దీప్ జారవిడిచాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా భారత బౌలర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ప్రముఖ సైట్ వికీపీడియాలో అర్ష్‌దీప్‌పై అనుచిత కథనాలు ప్రసారమయ్యాయి. వికీపీడియా పేజీలో అర్ష్‌దీప్‌కు ఖలీస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని వార్తలు ప్రచురితమయ్యాయి. ఇది దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. భారత ఐటి మంత్రిత్వ శాఖ వికీపీడియా ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. వెంటనే వచ్చి కలవాలని ఆదేశించింది. ఇక ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ప్యానెల్ వీకీపిడియా ప్రతినిధులను ప్రశ్నించనుంది. అంతేగాక వికీపీడియాకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుండగా అర్ష్‌దీప్‌పై వికీపీడియాలో వచ్చిన కథనాలు పాకస్థాన్‌లో ఎడిట్ చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పొరుగు దేశంలో తమ క్రికెటర్‌పై కుట్ర జరగడాన్ని భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఇలాంటి చర్యలు భారత అంతర్గత శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. వికీపీడియాలో ఇలాంటి సవరణలకు ఎలా అనుమతిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో వికీపీడియాపై తీవ్ర చర్యలకు సయితం వెనుకాడబోమని ఆ అధికారి స్పష్టం చేశారు.
అర్ష్‌దీప్‌కు బాసట
మరోవైపు క్యాచ్‌ను చేజార్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌కు మాజీ క్రికెటర్లు అండగా నిలిచారు. ఏ క్రికెటర్ కూడా కావాలని క్యాచ్‌ను నేలపాలు చేయడని వారు పేర్కొంటున్నారు. క్రికెట్‌లో క్యాచ్‌లు చేజారడం అనేది మాములు విషయమేనని గుర్తుంచుకోవాలంటున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ప్రతి ఆటగాడిపై తీవ్ర ఒత్తిడి ఉండడం సహాజమేనని, ఇలాంటి స్థితిలో క్యాచ్‌లు చేజార్చడం మాములేనని మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పేర్కొన్నారు. ఇక అర్ష్‌దీప్‌ను కొందరు ఖలీస్థాని అని విమర్శలు గుప్పించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాచ్ జారవిడిచాడనే సాకుతో అర్ష్‌దీప్‌పై జాత్యాహంకార విమర్శలు చేయడం సరికాదని హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్‌కు పంజాబ్ ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి అర్ష్‌దీప్ తల్లితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అర్ష్‌దీప్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Asia Cup 2022: Arshdeep Singh Abused on Social Media

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News